logo

పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించిన సీఎం

కొళత్తూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం ప్రారంభించారు. రూ.30.77 కోట్ల వ్యయంతో చేపట్టిన వర్షపునీటి కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు.

Published : 14 Aug 2022 00:16 IST

శ్రీనివాస నగర్‌లో టెన్నిస్‌ మైదానాన్ని ప్రారంభిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: కొళత్తూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం ప్రారంభించారు. రూ.30.77 కోట్ల వ్యయంతో చేపట్టిన వర్షపునీటి కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.8.35 కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ముగిసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.12.30 కోట్ల వ్యయంతో కొళత్తూర్‌ చెరువు పునరుద్ధరణ పనులు, వాననీటి కాలువల నిర్మాణ పనులు ప్రారంభించారు. డాన్‌బాస్కో మహోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించారు. పళ్లిసాలైలోని చెన్నై మహోన్నత పాఠశాల భవనాన్ని పునరుద్ధరించే పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు ఉపకరణాల అందించారు. శ్రీనివాస నగర్‌లో నిర్మించిన చెన్నై ప్రాథమిక పాఠశాల మైదానంలో నిర్మించిన టెన్నిస్‌ మైదానాన్ని ప్రారంభించారు. అరుళ్‌మిగు కపాలీశ్వరర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్యా ఫీజుల కింద రూ.10 వేలు చొప్పున నగదు, పుస్తకాల సంచులు అందించారు. పెరియార్‌ నగర్‌లో అభివృద్ధి చేసిన ప్రభుత్వ శివారు ఆస్పత్రిలో 4 ఆపరేషన్‌ థియేటర్లను ప్రారంభించారు. కలైవాణర్‌ అరంగంలో కళలు, సాంస్కృతికశాఖ, మ్యూజిక్‌ డ్రామా, సమాచార ప్రజా సంబంధాలశాఖ తరఫున ఏర్పాటు చేసిన వీరమంగై వేలునాచ్చియార్‌ మ్యూజికల్‌ డాన్స్‌ డ్రామాను ప్రారంభించారు. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సెల్వపెరుంతగై కృతజ్ఞత
చెన్నై, న్యూస్‌టుడే: దినపత్రికల్లోని కథనాలపై స్పందించిన ముఖ్యమంత్రికి సీఎల్పీ నేత సెల్వపెరుంతగై కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దళిత పంచాయతీ అధ్యక్షులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి అధ్యయన వార్తలపై స్పందించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. సీఎం స్పందించడంతో జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని, పంచాయతీ రాజ్‌ చట్టాన్ని సుస్థిరం చేసేందుకు సహకరించినందుకు స్టాలిన్‌కు కృతజ్ఞతలు, అభినందనలు చెప్పారు. అలాగే సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాలకృష్ణన్‌ కూడా ముఖ్యమంత్రి చర్యలను స్వాగతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని