logo

75 వసంతాల్లో ‘ఆర్థిక’ పురోభివృద్ధి!

చోళులు, పాండ్యులు, పల్లవులు ఇలా ఎంతోమంది మహామహులు తమిళ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ ఆనవాళ్లూ ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి.

Published : 15 Aug 2022 01:05 IST

కీలక ప్రభావం చూపిన నేతలు ‌

రాష్ట్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు

ఈనాడు, చెన్నై: చోళులు, పాండ్యులు, పల్లవులు ఇలా ఎంతోమంది మహామహులు తమిళ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ ఆనవాళ్లూ ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. తమిళుల నాగరికతకు ఆధారాలూ కనిపిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటం అనంతరం బ్రిటిష్‌ చెర నుంచి విముక్తి పొందాక ఈ ప్రాంతంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1947 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రధాన ఘటన సమాహారం ఇదీ...
* స్వాతంత్య్రం వచ్చాక ఈ ప్రాంతంలో వివిధ సామాజిక వర్గాల మధ్య శాంతినెలకొంది. మద్రాస్‌ ప్రెసిడెన్సీగా ఏర్పడ్డాక.. సి.రాజగోపాలాచారి (రాజాజీ) తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిధిలో ఆంధ్రా ప్రాంతాలూ కలిసి ఉన్నాయి.
* పొట్టిశ్రీరాములు పోరాటం ఫలితంగా 1953లో మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు కలిశాయి. ఈ ప్రాంతం తమిళనాడు రాష్ట్రంగా అవతరించింది.
* 1947 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. తర్వాత ద్రావిడర్‌ కళగం నుంచి వేరై.. ద్రావిడ మున్నేట్ర కళగాన్ని 1949లో అన్నాదురై స్థాపించారు. ప్రత్యేకించి హిందీ నేపథ్య సంస్కృతిని ఈ పార్టీ వ్యతిరేకించింది. ద్రావిడులకు ప్రత్యేక ప్రాంతం కావాలనే డిమాండ్‌ పెరిగింది.
* ప్రత్యేక ద్రావిడనాడు కావాలని ఉద్యమాలు జరిగాయి. తర్వాత 1962లో చైనా, భారత్‌ మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఈ డిమాండ్‌ కాస్తా వెనకబడింది.
* 1963లో రాజ్యాంగంలోని 16వ సవరణ ప్రకారం వేర్పాటువాద రాజకీయ పార్టీల్ని ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించారు. దీంతో డీఎంకే స్వతంత్ర ప్రతిపత్తిపై దృష్టిపెట్టింది. ఆ తర్వాత ద్రావిడ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరిగాయి.
* అన్నాదురై, కరుణానిధి లాంటి రచయితలు తమ కలం ద్వారా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశారు. పలు మాధ్యమాల్లో ఉద్యమ సందేశాల్ని పంపడం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు.
* 1967లో డీఎంకే రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే పేరుతో ఎంజీఆర్‌ ప్రత్యేక పార్టీని తెచ్చారు. ఈ రెండు పార్టీల ప్రభావం రాష్ట్రమ్మీద ఎక్కువగా ఉందనే చెప్పాలి. తర్వాత జయలలిత తెరమీదకి వచ్చి ప్రభావం చూపిన మహిళానేతగా ఎదిగారు.
* రాష్ట్ర అభివృద్ధిలో ఎంతోమంది నేతలు తమదైన ముద్ర వేశారు. రాజాజీ, కామరాజ్‌ విద్యావ్యవస్థ వృద్ధి చెందడానికి తోడ్పడ్డారు. అన్నాదురై తమిళనాడులో బలమైన ఉద్యమనేతగా ఎదిగారు. కరుణానిధి సామాజిక వ్యవస్థ బలీయానికి తోడ్పడ్డారు. ఎంజీఆర్‌, జయలలిత సాధికారత కోసం కృషి చేశారు. ప్రస్తుతం కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నారు.
* 2004లో సునామీ ప్రభావంతో 8 వేల మంది చనిపోయినట్లు అంచనాలున్నాయి. ఈ విషాదం నుంచి బయటపడి రాష్ట్రం మరింత పురోభివృద్ధి దిశగా కదిలింది. వాస్తవానికి 1990 నుంచే దేశంలోనే ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఎదిగేందుకు ప్రయత్నాలు జరిగాయి.
* ప్రస్తుతం 180 దేశాల్లో తమిళులు విస్తరించారు. దేశంలో తమిళనాడు సాంకేతిక, పారిశ్రామిక, తయారీ తదితర రంగాల్లో తిరుగులేని ప్రగతిని సాధిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని