logo

సంవత్సరమంతా సగర్వ పతాక రెపరెపలు!

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను పురస్కరించుకుని ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయాలన్న ప్రధాని పిలుపునిచ్చారు. కానీ.. చెన్నై నగరంలోని మైలాపూర్‌ డాక్టర్‌ రాధాకృష్ణన్‌ సాలైలో ఓ ఇంటిపై చాలా ఏళ్లుగా నిత్యం మువ్వన్నెల జెండా

Published : 15 Aug 2022 01:05 IST

జెండా ఆవిష్కరించిన సురానా కుటుంబం

ఈనాడు-చెన్నై: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను పురస్కరించుకుని ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయాలన్న ప్రధాని పిలుపునిచ్చారు. కానీ.. చెన్నై నగరంలోని మైలాపూర్‌ డాక్టర్‌ రాధాకృష్ణన్‌ సాలైలో ఓ ఇంటిపై చాలా ఏళ్లుగా నిత్యం మువ్వన్నెల జెండా ఎగురుతూనే ఉంటుంది. ఆ ఇంట్లోని వారు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్‌ సురానా, లీలావతి సురానా దంపతుల కుటుంబానికి చెన్నైలోనే ప్రత్యేక గుర్తింపుంది. వృత్తిపరంగా వీరు న్యాయసలహాల సంస్థను (లా ఫిర్మ్‌) నడుపుతున్నారు. కుమారుడు వినోద్‌ సురానా, కోడలు రష్మిలదీ న్యాయవృత్తే. వీరి పిల్లలూ న్యాయ విద్యనే అభ్యసిస్తున్నారు. వీరంతా కలిసి జెండా నిర్వాహణ బాధ్యతను చూస్తున్నారు.

కోర్టు తీర్పుతో సంబరం
జెండాను ఎగుర వేయాలనే తపన వీరి కుటుంబంలో ఉన్నప్పటికీ గతంలో కఠిన నిబంధనల ప్రకారం ప్రైవేటుగా ఇలా ఇళ్లమీద జెండాను ఎగురవేయడానికి అనేక ఇబ్బందులు వచ్చేవి. ఈ నేపథ్యంలో 2004లో ఎంపీ నవీన్‌జిందాల్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు కీలక తీర్పు వెల్లడైంది. జెండాను ఎగురవేయడమనేది వ్యక్తి హక్కు అని, దేశంపై ఉన్న విధేయతకు అది గుర్తుగా, గర్వకారణంగా కోర్టు అభివర్ణించింది. ఈ ఆదేశాలతో సురానా కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. అప్పటినుంచే తమ ఇంటిమీద జెండాను ఎగురవేయడం ప్రారంభించారు. మొదట్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలదాకా మాత్రమే ఎగరేసి నిబంధనల ప్రకారం దించివేసేవారు. ఈ బాధ్యతను కుటుంబీకుల్లో రోజూ ఒకరు తీసుకునేవారు. ఇప్పుడు రోజంతా, ఏడాది పొడవునా ఎగురవేస్తున్నారు. ప్రతీ రెండునెలలకోసారి జెండాను మార్చి రాజ్యాంగ నిబంధనల ప్రకారం దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. పూర్తిగా ఖాదీ వస్త్రంతో చేసిన జెండానే వినియోగిస్తూ వస్తున్నారు. మొదట్లో వీరు నాలుగంతస్తుల భవనంలో కిందింట్లో ఉండేవారు, కేవలం జెండా ఎగురవేయడం కోసం పైఇంటికి మారారు. ఇంట్లోనే కాకుండా ఇప్పుడు వారి కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలుచేస్తున్నారు. జెండా ఎగురవేసిన ప్రతీసారీ కుటుంబీకులకు, ఉద్యోగులకు గర్వంగా ఉంటుందని చెప్పారు సురానా దంపతులు. దేశభక్తి తమ రక్తంలోనే ఉందని, దేశాన్ని, ప్రజల్ని గౌరవించాలనే భావన మా పిల్లల్లో, సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లోనూ తీసుకొస్తున్నామని చెబుతున్నారు.

ఇంటికి ఐఎస్‌వో ధ్రువపత్రం
మరో ప్రత్యేకత ఏంటంటే.. వీరి ఇల్లు ఐఎస్‌వో 9001:2008, ఐఎస్‌వో 9001:2015 గుర్తింపుల్ని పొందింది. ఈ ఇంటిపై ఏటా ఆడిటింగ్‌ కూడా జరుగుతూ ఉంటుంది. నెల, అంతకుమించి రోజువారీ మెనూ జాబితాను సిద్ధం చేయడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని వండటం, తినడం లాంటిది చేస్తున్నారు. ఇంటినే ఓ సంస్థగా, పెద్దవారు నిర్వాహకులుగా, పిల్లలు కస్టమర్లుగా కొనసాగుతున్నారు. అతిథులకూ ప్రత్యేక వంటకాల మెనూ ఈ ఇంట్లో ఉంటుంది. వీరింట్లో అన్ని వస్తువులు కూడా లేబుల్స్‌ ఉండటం, కేటగిరీలవారీగా వాటిని ఉంచడం లాంటివీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని