logo

తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎంపిక చెల్లదు!

ఎంతో ఉత్కంఠ నడుమ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి సంబంధించిన వ్యాజ్యాలపై బుధవారం మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎడప్పాడి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన సర్వసభ్య సమావేశం చెల్లదని చెప్పడంతో ఆయన వర్గీయులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Published : 18 Aug 2022 00:44 IST

మద్రాసు హైకోర్టు తీర్పుతో పళని వర్గం దిగ్భ్రాంతి
పన్నీర్‌సెల్వం మద్దతుదారుల్లో వెల్లివిరిసిన ఆనందం

జయలలిత సమాధికి నివాళులర్పిస్తున్న ఓపీఎస్‌ తదితరులు

సైదాపేట, న్యూస్‌టుడే: ఎంతో ఉత్కంఠ నడుమ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి సంబంధించిన వ్యాజ్యాలపై బుధవారం మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎడప్పాడి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన సర్వసభ్య సమావేశం చెల్లదని చెప్పడంతో ఆయన వర్గీయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్నాడీఎంకేలో ఏర్పడిన ఏక నాయకత్వ పోరు కలకలం రేపింది. తర్వాత ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో జులై 11న సర్వసభ్య సమావేశం జరిగింది. పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయ్యారు. దీనికి వ్యతిరేకంగా ఓపీఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్రాసు హైకోర్టే విచారిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వసభ్య సమావేశానికి వ్యతిరకమైన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ జయచంద్రన్‌ సమక్షంలో విచారణ జరిగింది. అప్పుడు ఎడప్పాడి పళనిస్వామి తరఫు న్యాయమూర్తి విజయనారాయణన్‌ జులై 11 సర్వసభ్య సమావేశానికి సంబంధించిన ఎజెండా జూన్‌ 27న తయారు చేసినట్లు తెలిపారు. సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తల పదవుల గడువు ముగిసినందున పార్టీ అధిష్ఠాన నిర్వాహకులతో సర్వసభ్య సమావేశ నోటీసులు జులైౖ 1న సభ్యులకు పంపినట్లు తెలిపారు. సర్వసభ్య సమావేశం చట్టప్రకారమే జరిగిందని వివరణ ఇచ్చారు.

వాడీవేడిగా వాదనలు
అప్పుడు న్యాయమూర్తి మాట్లాడుతూ సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తల పదవీకాలం ఐదేళ్లయితే ఏడాదిలోనే గడువు ఎలా ముగుస్తుందని ప్రశ్నించారు. పళనిస్వామి తరఫు న్యాయవాది బదులిస్తూ... సంస్థాగత ఎన్నికలకు సర్వసభ్య సమావేశం అంగీకారం ఇవ్వనందున ఆ పదవులు ఖాళీ అయినట్లు, కావున పార్టీ అధిష్ఠాన నిర్వాహకులు పార్టీ సంబంధిత వ్యవహారాలు చూసుకుంటారని ఎన్నికల కమిషన్‌కు తెలిపినట్లు పేర్కొన్నారు. దీనికి బదులు వాదనలు చేసిన పన్నీర్‌సెల్వం తరఫున న్యాయవాది కృష్ణకుమార్‌.. జూన్‌ 23 సర్వసభ్య సమావేశంలో ఎలాంటి తీర్మానాలు ఆమోదించలేదని, కావున రెండు పదవులకు ఎన్నికలకు అంగీకారం అనే మాటకే తావులేదని తెలిపారు. సర్వసభ్య సమావేశం ఆమోదించకుంటే రెండు పదవులు ఖాళీ అవుతాయని 23న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎక్కడా చెప్పలేదని తెలిపారు. 2017లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారంటే అది సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తను ఎన్నుకునేందుకని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులు వేరని ఓపీఎస్‌ తరఫున వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జయచంద్రన్‌ బుధవారం ఉదయం తీర్పు వెలువరించారు. జూన్‌ 23కు ముందున్న పరిస్థితే అన్నాడీఎంకేలో కొనసాగాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగినవి ఏవీ చెల్లవని కోర్టు ఆదేశించింది. సర్వసభ్య సమావేశం ఏర్పాటుకు 30 రోజుల ముందే నోటీసులు పంపాలని సూచించింది. సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తలు కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపింది. దీనికోసం కమిషనర్‌ను నియమించాలని తెలిపింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఇళ్ల ముందు వారి మద్దతుదారులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున వచ్చారు. ముందుగా వారిద్దరు అనుచరులతో చర్చలు జరిపారు. కోర్టు తీర్పు పన్నీర్‌సెల్వానికి అనుకూలంగా రావటంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు.

ఈ విజయం తాత్కాలికం: జయకుమార్‌
తీర్పు గురించి పళనిస్వామి మద్దతుదారుడు జయకుమార్‌ మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలకు లోబడే సర్వసభ్య సమావేశం జరిగిందని తెలిపారు. 2,000 మందికిపైగా సర్వసభ్య సభ్యుల అంగీకారంతోనే పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపియ్యారని అన్నారు. ప్రస్తుతం ఓపీఎస్‌కు దక్కిన విజయం తాత్కాలికమేనని తెలిపారు. మద్రాసు హైకోర్టు తీర్పే చివరి నిర్ణయం కాదన్నారు. ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పార్టీని ఎవరూ చీల్చలేరు: పన్నీర్‌
సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకేను ఎవరూ చీల్చాలనుకున్నా కుదరదని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చెన్నై మెరినాలో మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత స్మారక మందిరాల్లో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకేను కార్యకర్తల పార్టీగా ఎంజీఆర్‌ స్థాపించారని పేర్కొన్నారు. ఎవరూ జయించలేని పార్టీగా జయలలిత తీర్చిదిద్దారని తెలిపారు. ఈ తీర్పును కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని చెప్పారు. కార్యకర్తలు కోరుకున్నట్లే జరిగిందని తెలిపారు. హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో కోర్టు మంచి తీర్పు ఇచ్చిందని తెలిపారు. అన్నాడీఎంకేను ఎవరూ చీల్చలేరని స్పష్టం చేశారు. ప్రత్యేక వ్యక్తి కింద, సర్వాధికారంగా పార్టీని తీసుకెళ్లాలంటే కుదరదని పేర్కొన్నారు. అందరూ ఏకమై రావాలని, పార్టీ నుంచి తొలగించబడిన వారిని మళ్లీ చేర్చాలని ఆకాంక్షించారు. అన్నాడీఎంకే విధివిధానాలకు లోబడి వచ్చే వారిని చేర్చుకుంటామని తెలిపారు. కోర్టు తీర్పును గౌరవించి తాము నడుచుకుంటామని పేర్కొన్నారు. విమర్శలు ఎదుర్కొనే స్వభావం నాయకత్వానికి ఉండాలని తెలిపారు. అందర్నీ కలుపుకొని వెళ్లడమే నాయకత్వ లక్షణమని వ్యాఖ్యానించారు. తాను అలా కలుపుకొని వెళ్తానని పేర్కొన్నారు. కార్యకర్తలు తనకు ఇచ్చిన బాధ్యత సమన్వయకర్త అని చెప్పారు.


హైకోర్టు తీర్పు అనంతరం బుధవారం పళనిస్వామి నివాసం వద్దకు చేరుకున్న నేతలు
జయకుమార్‌,మునుస్వామి, సెంగోట్టయ్యన్‌, గోకుల ఇందిర తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని