logo

అభాగ్యుల పాలిట అన్నపూర్ణ!

మరణం అందరికీ వస్తుంది. అయితే ఆకలితో ఎవరూ చనిపోకూడదనేదే తన లక్ష్యమని చెబుతున్నారు భానుప్రియ. అలాంటి సమాజాన్ని సృష్టించటమే తన జీవిత లక్ష్యమని చెబుతున్నారీమె. చెన్నైకు చెందిన భానుప్రియ ప్రైవేటు సంస్థలో సాంకేతిక నిపుణురాలిగా గతంలో పనిచేశారు.

Published : 18 Aug 2022 00:44 IST

నిత్యం ఆహారం పంపిణీ చేస్తున్న యువతి

సేవా రత్న పురస్కారంతో..

సైదాపేట, ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: మరణం అందరికీ వస్తుంది. అయితే ఆకలితో ఎవరూ చనిపోకూడదనేదే తన లక్ష్యమని చెబుతున్నారు భానుప్రియ. అలాంటి సమాజాన్ని సృష్టించటమే తన జీవిత లక్ష్యమని చెబుతున్నారీమె. చెన్నైకు చెందిన భానుప్రియ ప్రైవేటు సంస్థలో సాంకేతిక నిపుణురాలిగా గతంలో పనిచేశారు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి పేదలకు సాయం చేయటమే పూర్తిస్థాయి పనిగా ముందుకు సాగుతున్నారు. ఆమె సేవకు గుర్తింపుగా పలు సంస్థలు సత్కరించాయి. ‘సేవా రత్న’, ‘సేవై సెమ్మల్‌’ తదితర బిరుదులు, రెండు గౌరవ డాక్టరేట్‌లతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. తన సేవా  కార్యక్రమాలు ఆమె మాటల్లోనే... ‘‘ చెన్నై పెరంబూరులో పుట్టి పెరిగాను. సైన్సులో బ్యాచిలర్‌ డిగ్రీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కోర్సులు చేశా. 10వ తరగతి చదివేటప్పుడు పెరంబూరు రైల్వే ప్లాట్‌ఫాం మీదుగా పాఠశాలకు  రాకపోకలు సాగించేదానిని. అక్కడ ఆదరణ లేని వికలాంగ సోదరిని చూసేదాన్ని. ఒకసారి నేను దాచుకున్న మొత్తం తీసుకెళ్లి ఆమెకు ఇచ్చా. కానీ అందరూ తనకు డబ్బులు ఇస్తున్నారని, ఎవరూ మాట్లాడటం లేదని వాపోయింది. నేను ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేసింది. నాకు వీలు దొరికనప్పుడల్లా ఆమెతో మాట్లాడి, ఆహారం ఇచ్చేదాన్ని. దీన్ని మిగతా వారు ఒకలా చూసేవారు. కొంతకాలం తర్వాత వారు కూడా సహాయం చేయటం ప్రారంభించారు. అందరం కలిసి ఆమె కుటుంబంతో మాట్లాడి ఆర్థిక, వస్తు సహాయం చేసి ఆమె పరిస్థితి మార్చాం. అప్పటి నుంచి ఆదరణ లేనివారికి సహాయం చేయటం అలవాటుగా పెట్టుకున్నాను. 2015లో వరదలు వచ్చినప్పుడు నేను, నా స్నేహితులు బృందంగా ఏర్పడి చేతనైన డబ్బులు సమకూర్చి ఇంట్లోనూ ఆహారం తయారుచేశాం. బాధితులకు అందించాం. తర్వాత కూడా  సేవ చేసేందుకు నిర్ణయించుకుని ట్రస్టు ప్రారంభించాను. రోజుకి రూ.10 చొప్పున ప్రతిఒక్కరం  పొదుపు చేసి ఆ మొత్తంతో కిరాణా సరకులు తెచ్చేవాళ్లం. మా అమ్మ తయారుచేసిన ఆహారాన్ని రోడ్డు వెంబడి నిరాశ్రయులకు పంపిణీ చేయడం ప్రారంభించాం. తొలి రోజుల్లో రోజుకి 25 మందికి అందించేవాళ్లం. ప్రస్తుతం ఎక్కువమంది సాయం చేస్తుండటంతో వంద మందికి ఇవ్వగలుగుతున్నాం. 24 గంటలూ ఎవరైనా వచ్చి ఆకలి తీర్చుకుని వెళ్లేలా ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. రోడ్డు పక్కన నివశించే వారికి ఆవాసం కల్పించాలన్నదే జీవిత లక్ష్యం.’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని