logo

కలిసి పని చేద్దాం రండి..!

అన్నాడీఎంకేలో కలిసి పని చేద్దామని ఎడప్పాడి పళనిస్వామికి అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చెన్నైలో అతని నివాసంలో పన్నీర్‌సెల్వం విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీలో తమ మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయని, దీంతో పార్టీలో అసాధారణ పరిస్థితి నెలకొందని తెలిపారు.

Published : 19 Aug 2022 02:14 IST

 ఎడప్పాడికి ఓపీఎస్‌ పిలుపు

తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతున్న ఓపీఎస్‌

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకేలో కలిసి పని చేద్దామని ఎడప్పాడి పళనిస్వామికి అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చెన్నైలో అతని నివాసంలో పన్నీర్‌సెల్వం విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీలో తమ మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయని, దీంతో పార్టీలో అసాధారణ పరిస్థితి నెలకొందని తెలిపారు. అభిప్రాయ బేధాలు మరిచి పార్టీ మంచి కోసం అందరితో కలిసి పని చేయడమే తమ వైఖరని చెప్పారు. అన్నింటినీ పక్కన పెట్టి పార్టీ విజయమే లక్ష్యంగా పని చేద్దామని ఎడప్పాడికి సూచించారు. ఆ సమయంలో ఎడప్పాడి పళనిస్వామిని ప్రియమైన సోదరుడని పన్నీర్‌ పదేపదే సంబోధించడం గమనార్హం. మరోవైపు శశికళ, దినకరన్‌లతో కలిసి పని చేసే అవకాశం ఉందా? అని అడిగిన విలేకర్ల ప్రశ్నకు బదులుగా.. ఎవరైనా పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తే వారిని పార్టీలో చేర్చుకుంటామన్నారు. అందులో శశికళ, దినకరన్‌లకు మినహాయింపు లేదన్నారు. అందరం అన్నాడీఎంకేలో కలిసి పని చేయాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.
ఆ ప్రసక్తే లేదు: పళనిస్వామి
ఓపీఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని శాసనసభ ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. పళనిస్వామి నేతృత్వంలో జులై 11న జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఎడప్పాడి తరఫున అప్పీలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీని కైవసం చేసుకునేందుకు యత్నించటమే ప్రస్తుతం అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులకు కారణమని తెలిపారు. సర్వసభ్య సభ్యుల చేతే సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తల పదవులు సృష్టించబడ్డాయన్నారు. ప్రధాన కార్యదర్శికి సమానంగా ద్వంద్వ పదవులు తీసుకొచ్చి పార్టీలో అన్నాడీఎంకే చట్ట విధానాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. 2663 మంది సభ్యులు పార్టీ సంస్థాగత ఎన్నికల ద్వారా ఎన్నుకున్నవారన్నారు. ఏక నాయకత్వం కావాలని కార్యకర్తలు, నిర్వాహకులు కోరారని చెప్పారు. రౌడీల ద్వారా పార్టీ ప్రధాన కార్యాలయం, మా తరఫు వారిపై ఓపీఎస్‌ దాడి చేశారన్నారు. అన్న ఓపీఎస్‌, నేను విడిపోయామని, 2017లో ఒక్కటయ్యామని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశానికి మేము పిలుపునిచ్చినప్పుడు నిరాకరించిన ఓపీఎస్‌ ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ ఉన్నత బాధ్యతల్లో ఉన్న ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీని ఎలా నడపుతామని తెలిపారు. కలిసి పని చేద్దామన్న ఓపీఎస్‌ పిలుపును ఎడప్పాడి పళనిస్వామి వర్గం నిరాకరించింది.
కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అప్పీలు
అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదన్న మద్రాసు హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పును వ్యతిరేకిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున అప్పీలు చేశారు. చెన్నై వానగరంలో జులై 11న జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దురైస్వామి, జస్టిస్‌ సుందరమోహన్‌ ధర్మాసనం ముందు ఈపీఎస్‌ తరఫున అప్పీలు పిటిషన్‌ గురువారం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు.

ఓమందూరార్‌ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని వినాయక ఆలయంలో పూజలు చేస్తున్న పన్నీర్‌సెల్వం

ఇద్దరికీ చిక్కులు తెచ్చిన ఆదేశాలు
సర్వసభ్య సభ్యుల్లో ఐదింట ఒక వంతు మంది లేఖ సమర్పించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరితే సమన్వయకర్తో, సంయుక్త సమన్వయకర్తో నిరాకరించకూడదని హైకోర్టు తీర్పులో ఉంది. ఒకవేళ ఇందులో సమస్య ఉంటే కమిషనర్‌ను నియమించాలని కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. పళనిస్వామి వర్గం దీన్ని అమలు చేయాలనుకుంటే పన్నీర్‌కు సమస్యలు తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2 వేల మందికిపైగా సర్వసభ్య సభ్యులు ఎడప్పాడికి మద్దతుగా ఉన్నారు. వారితో సమావేశం ఏర్పాటు చేయాలని తనతోపాటు ఓపీఎస్‌కు ఆహ్వానం పంపించి పన్నీర్‌ను చిక్కుల్లో పడేయొచ్చని భావిస్తున్నారు. దీనికి పన్నీర్‌ నిరాకరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కమిషనర్‌ను నియమించడం ద్వారా సమావేశం జరిపే అవకాశం కూడా తీర్పులో ఉందని గుర్తుచేస్తున్నారు. తీర్పు  వ్యతిరేకంగా రావడంతో ఇప్పటికే పళనిస్వామి వర్గంలో నిరాశ నెలకొంది.
‘కార్యాలయం’ కేసులో స్టే నిరాకరణ
సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయ తాళాలను ఎడప్పాడి పళనిస్వామికి అప్పగించాలన్న మద్రాసు హైకోర్టు ఆదేశాలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలు తొలగించి, ఆ తాళాలు ఎడప్పాడి పళనిస్వామి దగ్గర అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన అప్పీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధర్మాసనం ఎదుట గురువారం విచారణకు వచ్చింది. విచారించిన ధర్మాసనం సమగ్ర దర్యాప్తు చేయకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని, కేసును వారం తర్వాత విచారిస్తామని ఆదేశించారు. ఇంకా ప్రతివాదులు, సీలు వేసిన రెవెన్యూశాఖకు బదులివ్వాలని సుప్రీం నోటీసులు పంపింది.
నిస్వార్థపరులు ఆహ్వానిస్తారు: టీటీవీ
విల్లివాక్కం, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు, నిస్వార్థపరులు పన్నీర్‌సెల్వం అభిప్రాయాన్ని ఆహ్వానిస్తారని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం తన ట్విట్టర్‌లో.. డీఎంకేని కూల్చడానికి అమ్మ మద్దతుదారులంతా కలిసి పనిచేయాలని ఓ పన్నీర్‌సెల్వం పిలుపునిచ్చారని గుర్తు చేశారు. స్వార్థం తలకెక్కి పదవీ వ్యామోహంతో ఉన్న ఓ ముఠా మంచి విషయాలను ఆమోదించదన్నది తెలిసిందేనన్నారు. ఎంజీఆర్‌, జయలలిత కాలం నుంచి పార్టీ కోసం సేవలందించిన శశికళ, దినకరన్‌ సహా అందరూ కలిసి పనిచేయాలని ఓపీఎస్‌ పేర్కొనడంలో దురుద్దేశం లేదన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని