logo

విస్తృతంగా విదేశీ పెట్టుబడులు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎఫ్‌డీఐ పెట్టుబడుల నివేదిక ఆధారంగా.. తమిళనాడులో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.196 కోట్లు అదనంగా ఎఫ్‌డీఐ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రం తాజా ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ జూన్‌ మధ్య రూ.5836 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Published : 26 Sep 2022 05:54 IST

అధికంగా సింగపూర్‌, మారిషస్‌ నుంచి

సేవారంగాలపైనే ఎక్కువ

మరిన్ని తెచ్చేందుకు తమిళనాడు కసరత్తు

కొవిడ్‌ లాంటి క్లిష్ట సమయాల్ని చూసిన తర్వాత గట్టిగా  నిలుదొక్కుకున్న తమిళనాడులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో కూడా తమిళనాడు 5వ స్థానంలో నిలిచింది. ఎఫ్‌డీఐలను మరింత పెంచేందుకు ఇప్పుడు ప్రభుత్వం వివిధ రంగాల్లో వసతుల్ని ఏర్పాటుచేస్తోంది.

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే, సైదాపేట: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎఫ్‌డీఐ పెట్టుబడుల నివేదిక ఆధారంగా.. తమిళనాడులో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.196 కోట్లు అదనంగా ఎఫ్‌డీఐ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రం తాజా ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ జూన్‌ మధ్య రూ.5836 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల,్ జూన్‌ మధ్య రూ.5640 కోట్లు వచ్చాయి. అదే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య రూ.8364 కోట్లు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇవే మాసాల మధ్య రూ.7062 కోట్లకు చేరింది. దీన్నిబట్టి పెట్టుబడుల రాక పెరుగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రమే టాప్‌
తమిళనాడు అధికారులు మాత్రం దేశంలోనే రాష్ట్రానికి ఎక్కువగా ఎఫ్‌డీఐలు వస్తున్నాయని చెబుతున్నారు. చాలా కంపెనీల ప్రధాన కార్యాలయాలు దిల్లీ, ముంబయి కేంద్రంగా నడుస్తున్నాయి. కానీ వాటి పెట్టుబడులు మాత్రం చాలావరకు తమిళనాడుకు వస్తున్నాయని అంటున్నారు. అప్పుడు అవి కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రం మరింత పురోభివృద్ధి చెందినట్లు అంచనాకు రావొచ్చని వివరిస్తున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలు ప్రాంతీయంగా ఆర్‌బీఐ కార్యాలయాల్లో రికార్డ్‌ అవుతాయని కూడా వెల్లడిస్తున్నారు. అధికారులు చెప్పేదాన్ని బట్టి.. గతేడాది మార్చి 31వ తేదీ దాకా రాష్ట్రానికి రూ.81,722 కోట్ల విదేశీపెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు.

50 శాతం అక్కడి నుంచే..
గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐ తగ్గడానికి పలు కారణాల్ని చూపుతున్నారు. గతేడాదే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రావడం, దీనికి తోడు కోవిడ్‌ తీవ్రత ఉండటం ప్రధాన కారణాలుగా చూపుతున్నారు. కొవిడ్‌ పరిస్థితుల్ని సైతం రాష్ట్రం దీటుగా ఎదుర్కొందని చెబుతున్నారు. ప్రస్తుతం సింగపూర్‌, మారిషస్‌ నుంచి అత్యధికంగా ఎఫ్‌డీఐ పెట్టుబడులు వస్తున్నాయని అంటున్నారు. ఈ రెండు దేశాల నుంచి.. 50 శాతం పెట్టుబడులున్నట్లు అంచనా ఉంది. ఆ తర్వాత యూఎస్‌, జపాన్‌, నెదర్లాండ్స్‌ నుంచి వస్తున్నాయి.


సేవలకే ప్రాధాన్యం..

తమిళనాడుకు వచ్చే పెట్టుబడుల్లో అగ్రస్థానంలో సేవారంగానికి సంబంధించిన సంస్థలున్నాయి. ఆర్థిక, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, బిజినెస్‌ ఔట్‌సోర్సింగ్‌, పరిశోధన, కొరియర్‌, సాంకేతిక పరీక్షలు, విశ్లేషణ నేపథ్య రంగాల్లో పనిచేసే సంస్థలకు విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాత కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లున్నాయి. మరోవైపు ఇతర రంగాల్లోనూ ఎఫ్‌డీఐలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లోనూ పెట్టుబడి సదస్సులు నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్రం నుంచి మరో బృందం కూడా విదేశాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. తమిళనాడు నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉన్న టాప్‌-3 సెక్టార్లు చూస్తే.. 2021 నివేదిక ప్రకారం పత్తి ఆధారిత ఉత్పత్తులు, మోటార్‌వాహనాలు, ఆటోమొబైల్‌ విడిభాగాలు ఉన్నాయి.


పేరుకు తగ్గట్లు లేవు: రామదాసు

దేశంలో, ప్రపంచంలో తమిళనాడుకు క్రేజ్‌ ఎక్కువగా ఉందని, దాంతో పోల్చుకుంటే ఇక్కడున్న వసతులకు తక్కువ ఎఫ్‌డీఐ పెట్టుబడులు వస్తున్నాయని పీఎంకే అధ్యక్షులు అన్బుమణి రామదాస్‌ ఇదివరకే గళం విప్పారు. రాష్ట్రానికున్న సత్తాకు తగ్గట్లు పెట్టుబడులు తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తుచేశారు. మరింత సులువుగా విదేశీ మారకాన్ని ఆకర్షించేలా.. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి.. అక్కడ వసతుల్ని మరింతగా పెంచి ఇంకా పెట్టుడుల్ని తీసుకురావచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని