logo

జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు

ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడేవారిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయనున్నట్టు డీజీపీ శైలేంద్రబాబు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో... దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలకు చెందిన కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలపై ఎన్‌ఐఏ అధికారులు 22వ తేదీ సోదాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

Published : 26 Sep 2022 02:04 IST

డీజీపీ హెచ్చరిక

చెన్నై: ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడేవారిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయనున్నట్టు డీజీపీ శైలేంద్రబాబు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో... దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలకు చెందిన కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలపై ఎన్‌ఐఏ అధికారులు 22వ తేదీ సోదాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా 11 మంది అరెస్టయ్యారని తెలిపారు. ఈ చర్యలకు నిరసనగా కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయన్నారు.1,410 మందిని అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారని తెలిపారు. వాహనాలపై రాళ్లు రువ్వడం తదితర ఘటనలకు పాల్పడిన 19 మంది అరెస్టై జైలులో ఉన్నారని పేర్కొన్నారు. తంజావూరులో బస్సుపై రాళ్ల దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు అరెస్టయ్యారని తెలిపారు. వారి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కిరోసిన్‌ నింపిన సీసాలను కొన్ని సంస్థలకు చెందినవారి ఇళ్లు, వాహనాలు, వ్యాపార కేంద్రాలు లక్ష్యంగా విసిరిన ఘటనలు జరిగాయన్నారు. వీటిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 250 మంది అనుమానితులను దర్యాప్తు చేయగా మరో వంద మందిని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కోయంబత్తూరు నగరంలో అదనంగా 3,500 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారని, శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ తామరైకన్నన్‌ అక్కడ మోహరించారని పేర్కొన్నారు. ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలకు పాల్పడే నేరస్తులను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయనున్నట్టు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని