logo

తమిళనాడు ఆధ్యాత్మిక రాజధాని

చెన్నపురి గోవింద నామస్మరణలతో మారుమోగింది.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లే గొడుగుల ఉత్సవంతో భక్తిపారవశ్యం వెల్లువిరిసింది. ఎటుచూసినా శ్రీవారి నామ గానాలే.. ఉత్తర చెన్నైలోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడింది..

Published : 26 Sep 2022 02:04 IST

 స్వాత్మానందేంద్ర స్వామి

భక్తజనసందోహం నడుమ గొడుగులు తీసుకెళ్తున్న దృశ్యం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: చెన్నపురి గోవింద నామస్మరణలతో మారుమోగింది.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లే గొడుగుల ఉత్సవంతో భక్తిపారవశ్యం వెల్లువిరిసింది. ఎటుచూసినా శ్రీవారి నామ గానాలే.. ఉత్తర చెన్నైలోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడింది.. తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఇక్కడ నుంచి ఏటా ఛత్రాలు (గొడుగులు) వెళ్లడం సంప్రదాయంగా కొనసాగుతోంది. హిందూ ధర్మార్థ సమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే ఈ కార్యక్రమం ఆదివారం ఫ్లవర్‌ బజార్‌లోని చెన్నకేశవపెరుమాళ్‌ ఆలయంలో జరిగింది. విశాఖ శ్రీ శారదపీఠం ఉత్తర పీఠాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొని ఛత్రాల ఉత్సవాన్ని ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, సమితి ట్రస్టీ ఆర్‌ఆర్‌ గోపాల్‌జీ, వేదాంతం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ‘తిరుమల తిరుపతి గొడుగుల ఉత్సవం ఇంత భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా జరగడం ఆనందంగా ఉంది. తమిళనాడు నుంచి ఆంధ్రాలోని తిరుమలకు గొడుగులు తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం. ఆదిశేషుడి అవతారం ఇక్కడ నుంచి తిరుమలకు వెళ్తున్నట్టు ఉంది. ఈ దర్శనభాగ్యం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సమానం. దేశంలో పలురకాల పూజా విధానాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ తమిళనాడు సంప్రదాయం అన్నింటికన్నా గొప్పగా భాసిల్లుతోంది. దేశానికి రాజధాని దిల్లీనే అయినప్పటికీ, ఆధ్యాత్మిక రాజధాని తమిళనాడే. తిరుమలకు వెళ్లే భక్తుల్లో 90 శాతం మంది తమిళులే. విశాఖ శ్రీ శారద పీఠం గత 30 ఏళ్లుగా హిందూమత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తోంది. మతమార్పిడి చేసుకున్న వారి వద్దకు వెళ్లి హిందూ మతంలో చేర్చే పనులను పీఠం చేస్తోంది. నవరాత్రి ఉత్సవాలు ఆరంభమైనందువల్ల శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఇక్కడకు రాలేకపోయార’ని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని