logo

పోయిన జ్ఞానం తిరిగొచ్చింది!

పాఠశాలలకు వెళ్లే బాలలకు కరోనాతో తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. విడతలవారీ లాక్‌డౌన్, కేసులు ప్రభావంతో 18 నెలలపాటు బడులకు దూరంగా ఉన్నారు. ఓ పక్క చదువులేక, మరో పక్క ఇంట్లో బందీలుగా పసివారి జీవితం అధ్వానంగా తయారైంది.

Published : 27 Sep 2022 01:24 IST

ప్రాథమిక విద్యార్థుల్లో 2/3 వంతు మందికి పూర్వస్థితి

రాష్ట్రంలో ‘ఇల్లం తేడి కల్వి’ పథకం విజయవంతం

- ఈనాడు, చెన్నై

తరగతి గదిలో చిన్నారులు

పాఠశాలలకు వెళ్లే బాలలకు కరోనాతో తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. విడతలవారీ లాక్‌డౌన్, కేసులు ప్రభావంతో 18 నెలలపాటు బడులకు దూరంగా ఉన్నారు. ఓ పక్క చదువులేక, మరో పక్క ఇంట్లో బందీలుగా పసివారి జీవితం అధ్వానంగా తయారైంది. పైగా అప్పటివరకు నేర్చుకున్న అంశాలు కూడా చాలావరకు మర్చిపోయిన పరిస్థితి. ఈ తరహా పిల్లల్ని సాధారణస్థితికి తేవడానికి తమిళనాడులో గతేడాది ప్రవేశపెట్టిన ‘ఇల్లం తేడి కల్వి (ఇంటి దగ్గరికే విద్య)’ పథకం ఉపయోగపడింది. ఈ మేరకు తాజా సర్వేలో వెల్లడైంది.

తమిళనాడులో జరిపిన ఓ సర్వేలో బాలలు కొవిడ్‌ ప్రభావం నుంచి బయటపడి చదువులో సాధారణస్థితికి వచ్చి ప్రతిభ కనబరుస్తున్నారని తేల్చారు. వారిలో మార్పు తేవడంలో అక్కడి ప్రభుత్వం తెచ్చిన ‘ఇల్లం తేడి కల్వి’ పథకం కీలకపాత్ర పోషించిందని స్టాక్‌హోమ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అభిజిత్‌ సింగ్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కో అటానమో డి మెక్సికోకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మారిసియో రొమేరో, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్‌ కార్తిక్‌ మురళీధరన్‌ జరిపిన సర్వేలో తేలింది. ఈ సర్వే ఫలితాల్ని తాజాగా ‘రీసెర్చి ఆన్‌ ఇంప్రూవింగ్‌ సిస్టమ్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (రైజ్‌)’ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు.

ఊహించని మార్పు

ప్రభుత్వం కరోనాకు ముందు 2019లో బాలల ప్రతిభను అంచనా వేయడానికి శాఖాపరమైన సర్వేలు చేసింది. అప్పట్లో వారి స్థితిగతులను కొలమానంగా తీసుకుని దీన్ని నిర్వహించారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మే నెల వరకు విడతలవారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని కలిశారు. రాష్ట్రంలోని 4 జిల్లాలు, 220 గ్రామాల పరిధిలోని 19,467 మంది ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. కొవిడ్‌ సమయంలో తల్లిదండ్రుల అభిప్రాయాల్ని బట్టి.. పిల్లలకు చదువు ఏమాత్రం గుర్తులేదని, బాగా వెనకబడిపోయారని తెలిపారు. వారు చదువులు ఏమవుతాయోనన్న బెంగ వారిలో ఎక్కువగా ఉందని వివరించారు. సర్వేనుబట్టి ఒక్క గణితంలోనే 9 ఏళ్ల చిన్నారుల్లో 23 నెలల వెనకబాటు కనిపించింది. 5-7 ఏళ్ల పిల్లల్లో 11-15 నెలల వెనకబాటు ఉందని తేలింది. తమిళభాషలో 9 ఏళ్ల విద్యార్థుల విషయంలో 22 నెలలు వెనక్కి వెళ్లిపోయారు. ఈ స్థితిలో ఉన్న వారిని.. ఈ ఏడాది మే మాసంలో పాఠశాలలు తెరిచే సమయానికి పరీక్షించినప్పుడు 2/3వ వంతు బాలలు తమ పూర్వజ్ఞానాన్ని పొందినట్లుగా తేలింది. పైగా గణితం, తమిళంలో పూర్వంకన్నా మెరుగైన స్థితికి చేరినట్లు సర్వేలో వెల్లడైంది.

బోధిస్తున్న వాలంటీరు

ఇలా సాధ్యమైంది..

కొవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత గతేడాది నవంబరులో పాఠశాలలు తెరిచారు. అంతకుముందు అక్టోబరులోనే రాష్ట్ర ప్రభుత్వం ‘ఇల్లం తేడి కల్వి’ పథకాన్ని మొదలుపెట్టింది. ప్రాథమిక పాఠశాలల వారికి ఇళ్ల సమీపంలోనే విద్యను బోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను తీసుకున్నారు. ఇలా మొత్తం 2 లక్షల కేంద్రాల్లో వారు సేవలు అందించారు. 34 లక్షల మందికి బోధించారు. 12వ తరగతి, డిగ్రీలోపు విద్యార్హత ఉన్నవారిని 1-5 తరగతి పిల్లలకు, డిగ్రీ, ఆ పైన చదివిన వారిని 6-8 తరగతుల వారికి బోధించేలా ఏర్పాట్లు చేశారు. స్థానికంగా ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్‌లు, ఇతర వసతుల్ని ఎంపికచేశారు. వారానికి 4 రోజులు, నిత్యం 90 నిమిషాలపాటు చదువు చెప్పే వాలంటీర్లకు నెలకు రూ.1000 ఉపకార వేతనం, ఇతర ఖర్చులు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి కొంతవరకు బోధనా సామగ్రిని సమకూర్చగా, వాలంటీర్లు తమ సొంత ఆసక్తితో మరింత సామగ్రిని సమకూర్చుకున్నారు. ఈ పథకంలో ఎక్కువమంది చేరేందుకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆటలు తదితర పోటీలు పెట్టారు. పథకాన్ని 92 శాతం మంది సద్వినియోగం చేసుకున్నట్లు నివేదికలు తేల్చాయి.

సర్వే బృందం ప్రశంసలు

చిన్నారులు తమ జ్ఞానాన్ని కోల్పోకుండా, బడికి దూరంగా ఉండకుండా చేసేందుకు ఈ పథకం ఉపయోగపడిందని సర్వే బృందం తెలిపింది. వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు బాలలను బడికి మానసికంగా ఎలా సిద్ధం చేయాలో కూడా నేర్పారని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు విద్యార్థుల పురోగతిని అంచనా వేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర కమిటీలు, వాలంటీర్లకు టెలిగ్రామ్‌ గ్రూప్‌ల్ని ఏర్పాటు చేసుకుని పథకాన్ని సమీక్షించారని వివరించారు.

చిత్రకళ పోటీలు నిర్వహించిన దృశ్యం

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని