logo

అన్నాడీఎంకే కార్యాలయంలో ఎడప్పాడి పరిశీలన

చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న పునురుద్ధరణ పనులను అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి సోమవారం పరిశీలించారు. జులై 11న జరిగిన అల్లర్లలో కార్యాలయం

Published : 27 Sep 2022 01:24 IST

పార్టీలో చేరిన నేతలతో పళనిస్వామి

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న పునురుద్ధరణ పనులను అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి సోమవారం పరిశీలించారు. జులై 11న జరిగిన అల్లర్లలో కార్యాలయం దెబ్బతింది. దీంతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పనులను పళనిస్వామి, నిర్వాహకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల కార్యదర్శులతో సమాలోచనలు జరిపారు. చెంగల్పట్టు జిల్లా అనగాపుత్తూరుకు చెందిన అన్నాడీఎంకే విద్యార్థి విభాగానికి చెందిన సెవన్‌ ఆధ్వర్యంలో 100 మందికి పైగా యువకులు ఎడప్పాడి సమక్షంలో పార్టీలో చేరారు. అదేవిధంగా చెంగల్పట్టు జిల్లా సిత్తామూరు యూనియన్‌ విద్యార్థి విభాగ కార్యదర్శి, న్యాయవాది సేవల్‌ రామ్‌ప్రసాద్‌ పళనిస్వామిని కలిసి శుభాకాంక్షలు పొందారు. ఈ సమయంలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, మాజీ ఎంపీ విజయకుమార్‌ తదితరులు ఉన్నారు.

శాంతిభద్రతలను చక్కదిద్దాలి: ఓపీఎస్‌

సైదాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో శాంతిభద్రతలను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించి సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... డీఎంకే అధికారంలోకి వస్తే శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందనడానికి గతంలో జరిగిన చాలా సంఘటనలే ఉదాహరణలన్నారు. అమ్మ క్యాంటీన్లు, చౌక దుకాణాలు, టీకా కేంద్రాలు అన్నిచోట్ల డీఎంకే నేతల అధిపత్యం పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులను కూడా బెదిరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భాజపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై పెట్రోలు బాంబుల దాడులు జరుగుతున్నాయని, ఇందులో అమాయక ప్రజలు బలవుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కావున ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని శాంతిభద్రతలను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చోరీకి గురైన పత్రాలు స్వాధీనం

ప్యారిస్, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగిన ఘర్షణ కేసులో చోరీకి గురైన అన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీసీఐడీ అధికారులు తెలిపారు. జులై 11వ తేదీ అన్నాడీఎంకే కార్యాలయంలో ఓపీఎస్, ఈపీఎస్‌ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కార్యాలయం నుంచి పత్రాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసుల విచారణ సీబీసీఐడీకి బదిలీ చేసి డీఎస్పీ వెంకటేశన్‌ నేతృత్వంలోని పోలీసులు తీవ్రంగా విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి 19 మందిని అరెస్టు చేశారు. ముఖ్యంగా అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం ఓపీఎస్, ఈపీఎస్‌ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో కార్యాలయ ప్రవేశ తలుపులు పగలగొట్టి లోపల ప్రవేశించి పత్రాలు, కంప్యూటర్‌ మొదలైన వస్తువులు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఓపీఎస్‌ మొదలైన 60 మందిపై కేసు నమోదు చేశారు. ఏయే పత్రాలు కార్యాలయం నుంచి ఓపీఎస్‌ మద్దతుదారులు చోరీ చేశారని, చోరీకి గురైన పత్రాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని, సీబీసీఐడీ డీఎస్పీ వెంకటేశన్‌ నేతృత్వంలోని పోలీసులు రెండు సార్లు కార్యాలయానికి వెళ్లి విచారించారు. విచారణలో చోరీకి గురైన పత్రాలు, కంప్యూటర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఓపీఎస్‌ మద్దతు దారుడైన కొళత్తూర్‌ కృష్ణమూర్తి వద్ద ఉన్నట్లు గుర్తించి 113 పత్రాలను సీబీసీఐడీ స్వాధీనం చేసుకుంది. రాయపేటలో ఉన్న అన్నాడీఎంకే కార్యాలయ పత్రం, ఎంజీఆర్‌ భార్య జానకి రాసిచ్చిన పత్రం, అన్నా ట్రస్ట్‌ పత్రం, పుదుచ్చేరి, తిరుచ్చి, మదురై మొదలైన ప్రాంతాల్లో ఉన్న పార్టీ ఆస్తుల పత్రం, కంప్యూటర్‌ మొదలైన ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్లు సీబీసీఐడీ పోలీసులు తెలిపారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts