logo

ఆన్‌లైన్‌ ఆటలపై నిషేధానికి ఆర్డినెన్స్

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ ఆటలను నిషేధించడానికి రూపొందించిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌ జూదం నిషేధానికి ప్రత్యేక చట్టం రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

Published : 27 Sep 2022 01:24 IST

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ ఆటలను నిషేధించడానికి రూపొందించిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌ జూదం నిషేధానికి ప్రత్యేక చట్టం రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు నేతృత్వంలోని కమిటీ జూన్‌ 27న ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. నివేదికను మంత్రివర్గం పరిశీలనలో ఉంచారు. తర్వాత విద్యార్థులపై ఆన్‌లైన్‌ ఆటల ప్రభావం గురించి పాఠశాల విద్యాశాఖ ద్వారా చేపట్టిన సర్వే, ప్రజల నుంచి ఇ-మెయిల్‌ ద్వారా పొందిన అభిప్రాయాల ఆధారంగా న్యాయశాఖ సూచనలతో డ్రాఫ్టు ఆర్డినెన్స్‌ రూపొందించారు. ఆగస్టు 29న మంత్రివర్గ సమావేశంలో దానికి మరింత మెరుగులద్ది పూర్తి ఆర్డినెన్స్‌ను మళ్లీ మంత్రివర్గం పరిశీలనలో ఉంచాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని త్వరలో గవర్నర్‌కు పంపనున్నారు.

అప్రమత్తంగా వ్యవహరిద్దాం

చెన్నై, న్యూస్‌టుడే: విష రాజకీయ శక్తులకు చోటివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరిద్దామని డీఎంకే శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో... దేశమే తిరిగి చూసేలా నేడు డీఎంకే ప్రభుత్వం పరిపాలిస్తోందని తెలిపారు. సర్కార్‌కు అప్రతిష్ట కలిగించాలనే దురుద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు కల్పించకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని తెలిపారు. పదేళ్ల తర్వాత డీఎంకేకు ప్రజలు అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రజల అభీష్ఠాలను నెరవేర్చేందుకు ప్రతిరోజు పనిచేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్వాహకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చేసే ప్రసంగాలను వక్రీకరించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎలాగైనా రాష్ట్రంలో పాదం మోపాలనే ఉద్దేశంతో పరిస్థితులను వాడుకోవాలని, ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి విష శక్తులకు కొంచెం కూడా చోటివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

సమన్వయంతో చర్యలు చేపట్టాలి

చెన్నై, న్యూస్‌టుడే: వరద సహాయక చర్యలను అన్ని శాఖలు సమన్వయంతో చేపట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. ఈశాన్య రుతుపవన వర్షాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. కలైవాణర్‌ ఆడిటోరియంలో జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ... గత ఏడాది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెన్నైలో ఎదుర్కొన్న భారీవర్షాల అనుభవాలు, సవాళ్లు పునరావృతం కాకూడదని అప్పట్లోనే భావించామని చెప్పారు. దానికి అనువుగా చర్యలు చేపట్టామని తెలిపారు. తిరుపుగళ్‌ నేతృత్వంలో కమిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈశాన్య రుతుపవనాలతో దెబ్బతినే ఇతర జిల్లాల్లోనూ చేపట్టాల్సిన వరద నివారణ చర్యలను గుర్తించి, వాటిని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఆ పనులను త్వరగా ముగించాలని కోరారు. ఇప్పటికే నీటి నిల్వ ఉన్న చెంబరంపాక్కం, పుళల్‌ జలాశయాలను రుతుపవన వర్షాలు సందర్భంగా తరచూ పర్యవేక్షించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు, వర్షపునీటి కాలువల పనుల్లో కంచె లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ఆ పనులను యుద్ధప్రాతిపదికన ముగించాలని తెలిపారు. తమకు కేటాయించిన జిల్లాల్లోని పరిస్థితులను మానిటరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలని, జిల్లాల్లో ఉంటూ పాఠశాల భవనాలు, సహాయక కేంద్రాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. పలు స్థానిక సంస్థలకు చెందిన అధికారులు, రెవెన్యూ, ప్రజాపనులు, అగ్నిమాపక, వ్యవసాయ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలూ సహకరించేలా పరిస్థితులు కల్పించాలని తెలిపారు. వాతావరణ పరిశోధన కేంద్రం నుంచి లభించే సమాచారంతోపాటు ప్రైవేటు వాతావరణ పరిశోధకులు అందించే వివరాలను విశ్లేషించి తగిన సన్నాహాలు చేపట్టాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. సహాయక శిబిరాల్లోని ప్రజలకు నాణ్యమైన ఆహారం, తాగునీరు, విద్యుత్తు, వైద్యం, ఆరోగ్య వసతులను కల్పించడంలో రాజీ పడకూడదని తెలిపారు. ఈ చర్యలతో వరద బాధితులకు కొంత ఊరట కల్పించవచ్చని, అదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవాలని, విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో మంత్రులు దురైమురుగన్, కేఎన్‌ నెహ్రూ, వేలు, పన్నీర్‌సెల్వం, రామచంద్రన్, పెరియకరుప్పన్, అనితా రాధాకృష్ణన్, సెంథిల్‌ బాలాజీ, సుబ్రమణియన్, పళనివేల్‌ త్యాగరాజన్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, డీజీపీ శైలేంద్రబాబు, రెవెన్యూ పరిపాలన కమిషనరు ప్రభాకర్, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ జయంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని