logo

పీఎఫ్‌ఐపై నిషేధం.. కట్టుదిట్టంగా పోలీసు భద్రత

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, దాని అనుబంధ సంస్థలపై కేంద్రం ఐదేళ్లు నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇటీవల పీఎఫ్‌ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లలో

Published : 29 Sep 2022 02:23 IST

పురసైవాక్కంలోని పీఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద భద్రతా విధుల్లో పోలీసులు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, దాని అనుబంధ సంస్థలపై కేంద్రం ఐదేళ్లు నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇటీవల పీఎఫ్‌ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 11 మందిని అప్పుడు అరెస్టు చేశారు. బుధవారం సంస్థపై నిషేధాన్ని కేంద్రం ప్రకటించింది. పీఎఫ్‌ఐ ప్రధాన కార్యాలయం ఉన్న చెన్నై పురసవాక్కం ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులు భద్రతా విధులు చేపట్టారు. చెన్నై వ్యాప్తంగా 4 వేల మంది బందోబస్తు చేపట్టారని కమిషనరు శంకర్‌ జివాల్‌ తెలిపారు. 2006లో ప్రారంభమైన పీఎఫ్‌ఐకి దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో బ్రాంచులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగే అవకాశం ఉందని నిఘా విభాగ పోలీసులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అధికంగా గుమిగూడే ప్రాంతాల్లో పర్యవేక్షణను తీవ్రం చేసి భద్రతను పెంచాలని కమిషనరు ఉత్తర్వులు ఇచ్చారు. మన్నడి, ట్రిప్లికేన్‌, ఐస్‌హౌస్‌, జామ్‌బజార్‌ వంటి ప్రాంతాల్లో అదనపు పర్యవేక్షణ చేపట్టారు.  

కోయంబత్తూరు, న్యూస్‌టుడే:  ఉక్కడం, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసుల భద్రత తీవ్రం చేశారు. సంస్థ కార్యాలయం ఉండే కోడైమేడులో పోలీసులు పెద్ద సంఖ్యలో విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసు కమిషనరు బాలకృష్ణన్‌ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కమిషనరు మాధవన్‌ నేతృత్వంలో భద్రత కల్పిస్తున్నారు. 37 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.   కోడైమేడు ప్రాంతంలో మహిళలు ఆందోళన చేపట్టడంతో కలకలం ఏర్పడింది.  

కేంద్రం నిర్ణయం సరికాదు: సీపీఎం

చెన్నై, న్యూస్‌టుడే: పీఎఫ్‌ఐను కేంద్రం నిషేధించడం తగదని సీపీఎం అభిప్రాయపడింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. అందులో... పీఎఫ్‌ఐపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఆర్‌ఎస్‌ఎస్‌, మావోయిస్టులు వంటి సంస్థలపై నిషేధం తగిన ఫలితాలు ఇవ్వలేదని గత అనుభవాలు చాటుతున్నాయని తెలిపింది.  

దిగ్భ్రాంతికరం: సీమాన్‌

వేలచ్చేరి, న్యూస్‌టుడే: పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతి కల్గిస్తోందని నామ్‌ తమిళర్‌ కట్చి కోఆర్డినేటరు సీమాన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో.. పీఎఫ్‌ఐ కార్యకలాపాలను అడ్డుకోవడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం క్రూరమైందని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని