logo

తిరుచెందూర్‌ ఆలయాభివృద్ధి పనులు ప్రారంభం

: తిరుచెందూర్‌లోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వామసుందరి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

Published : 29 Sep 2022 02:23 IST

వీసీ ద్వారా పనులు ప్రారంభిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: తిరుచెందూర్‌లోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వామసుందరి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా రూ.200 కోట్ల వ్యయంతో ఆలయ యంత్రాంగానికి, భక్తులకు మరిన్ని వసతులు కల్పించడం, పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయ నిధి ద్వారా రూ.100 కోట్ల వ్యయంతో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు, ఆరోగ్య ప్రాంగణం, బస్టాండు, కల్యాణ మండపాలు, పంచామృతం తయారీ శాలలు, సిబ్బంది క్వార్టర్లు వంటివి నిర్మించనున్నారు. మొత్తం రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను సచివాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు, ఎంపీ కనిమొళి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి చంద్రమోహన్‌, దేవాదాయశాఖ కమిషనరు కుమరగురుభరన్‌, హెచ్‌సీఎల్‌ సంస్థ ఉన్నతాధికారులు శివశంకర్‌, సుందర్‌ రామలింగం తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత విద్యాశాఖ తరఫున...

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు, ప్రత్యేక శిక్షణా సంస్థల్లో లెక్చరర్ల ఉద్యోగ ఖాళీల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా గత ఏడాది ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ మేరకు ఎన్నికైన 1,024 మందికి ఉద్యోగ నియామకాల అందజేతను ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సూచనప్రాయంగా 11 మందికి నియామక ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి తదితరులు పాల్గొన్నారు.

రింగ్‌ మెయిన్‌ యూనిట్‌..

చెన్నై, న్యూస్‌టుడే: ఇందన వనరులశాఖ తరఫున నగరంలో ఏర్పాటు చేసిన రింగ్‌ మెయిన్‌ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. చెన్నై, దాని పరిసరాల్లోని 28 శాసనసభ నియోజకవర్గాల్లో సుమారు రూ.787 కోట్ల వ్యయంతో 5,692 రింగ్‌ మెయిన్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ) ఏర్పాటు పనులను ఇంధన వనరులశాఖ చేపట్టింది. నగరంలోని షెవాలియో శివాజీ గణేశన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆర్‌ఎంయూని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, సెంథిల్‌బాలాజీ, సుబ్రమణియర్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, ఎంపీ దయానిధిమారన్‌, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌, టాన్‌జెడ్కో ఛైర్మన్‌, ఎండీ రాజేశ్‌ లఖాని తదితరులు పాల్గొన్నారు.

నకిలీ పత్రాల రద్దుకు అధికారం

రిజిస్ట్రేషన్లశాఖ తరఫున నకిలీ పత్రాలు రద్దు చేసే అధికారాన్ని ఆ శాఖకు అందించడాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. భూకబ్జాతో బోగస్‌గా చేసిన పత్రాల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ వాటి నిజ యజమానులకు సంబంధిత పత్రాలను ముఖ్యమంత్రి అందించారు. ఎక్కువ పత్రాలు నమోదయ్యే 100 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తత్కాల్‌ టోకెన్‌ వసతి, వివాహ ధ్రువపత్రాల సవరణకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రారంభించారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts