logo

మోటావర్స్‌ చదువు..ఎంతో ప్రత్యేకం!

చెన్నైలోని 3 ప్రభుత్వ బడులు, 2 గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పాఠశాలల్లో ‘మెటా కల్వి (మెటావర్స్‌ చదువులు)’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టు తెచ్చారు. జులైలో మొదలైన దీనిపై విద్యాశాఖ సమీక్షలు నిర్వహించింది. ఈ పద్ధతిలో బోధించడంతో విద్యార్థులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. వారి నైపుణ్యాల్లోనూ పెరుగుదల

Published : 30 Sep 2022 02:08 IST

చెన్నై సర్కారు బడుల్లో ప్రయోగం

ఈనాడు, చెన్నై

వీఆర్‌ కిట్లతో చెన్నైలోని లేడీ విల్లింగ్టన్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు

తరగతులు కాస్తా స్మార్ట్‌గా మారిపోయాయి. పుస్తకాలూ డిజిటల్‌లోకి వెళ్లాయి. ఇప్పుడు విద్యాబోధనలో సరికొత్త అధ్యాయం.. మెటావర్స్‌ చదువులు. కృత్రిమ 3డీ దృశ్యరూపకాన్ని వర్చువల్‌ రియాలటీ (వీఆర్‌) పద్ధతిలో బోధించే వినూత్న సాంకేతికత విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ బడుల్లో ప్రయోగాత్మకంగా తెచ్చిన ఈ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. 
చెన్నైలోని 3 ప్రభుత్వ బడులు, 2 గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పాఠశాలల్లో ‘మెటా కల్వి (మెటావర్స్‌ చదువులు)’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టు తెచ్చారు. జులైలో మొదలైన దీనిపై విద్యాశాఖ సమీక్షలు నిర్వహించింది. ఈ పద్ధతిలో బోధించడంతో విద్యార్థులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. వారి నైపుణ్యాల్లోనూ పెరుగుదల వచ్చిందని అధికారులు చెప్పారు. విడతలవారీగా గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌, తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలుపరిచేలా ప్రత్యేక కార్యచరణపై ఆలోచిస్తున్నారు.

నిపుణుల పర్యవేక్షణలో..
ఈ విధానంలో విద్యార్థుల తలకు వీఆర్‌ సెట్‌, చేతిలో జాయ్‌స్టిక్‌, పక్కనే పాఠాల్ని వివరించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు ఉంటారు. ఒక్కో పాఠశాలకు ఒక్కో మెటా కల్వి వీఆర్‌ ల్యాబొరేటరీని కేటాయించారు. రోజూ విద్యార్థుల్ని విడతలవారీగా ఈ గదిలో పాఠాలు వినేందుకు, 3డీ దృశ్యమాధ్యమంలో అర్థం చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఈ ప్రాజెక్టును చేపడుతున్న మేనికార సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ప్రత్యేక నిపుణులు వీరికి సాంకేతికత సాయం అందిస్తున్నారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రస్తుతం సైన్స్‌, గణితం, సాంఘిక శాస్త్రాల్ని ఈ సాంకేతితతో బోధిస్తున్నారు.

 

పాఠం.. అద్భుతం
చెన్నై నగరం ట్రిప్లికేన్‌లోని లేడీ విల్లింగ్టన్‌ ఉన్నత పాఠశాల, చెన్నై మిడిల్‌ స్కూల్‌, ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌, చింతాద్రిపేటలోని చెన్నై ఉన్నత పాఠశాల, అన్నాసాలైలోని ప్రభుత్వ మదర్సా-ఎ-ఆజం హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లలో ఈ ల్యాబ్‌లను తెరిచారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాల్ని ఈ ల్యాబ్‌ల్లో వర్చువల్‌ రియాలిటీలో అర్థం చేసుకోవడంతో అద్భుత అనుభూతికి విద్యార్థులు లోనవుతున్నారు. అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాలు, రాకెట్‌ ప్రయోగాలు ఇవన్నీ చాలా దగ్గరగా చూస్తున్న అనుభూతిని పొందామని విద్యార్థులు చెప్పారు. క్లిష్టమైన రసాయనశాస్త్ర పాఠాల్లోని పరమాణువులకు సంబంధించిన చర్యల్ని 3డీలో చూసి అర్థం చేసుకోగలుగుతున్నామని వెల్లడించారు. నాగరిత, చారిత్రక అంశాలు తమకు కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయని చెప్పారు.  వర్చువల్‌ పాఠాలకు గ్రాఫిక్స్‌ను కూడా అన్వయిస్తున్నారు.
పెరిగిన ఆసక్తి
చదువులపై పేద పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆసక్తిని పెంచడంతోపాటు హాజరు పెంచడం, సాంకేతికత పాఠాలు నేర్చుకోవడంపై తాము ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా తెచ్చామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తద్వారా పాఠాల్ని అర్థం చేసుకునే తీరులో చాలా మార్పులొచ్చాయని, సాంకేతిక పరికరాలపై అవగాహన పెరుగుతోందని తెలిపారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి సంబంధించి ఆన్‌లైన్‌ ఖాతా తెరవడమేకాక వారిలో పెరుగుతున్న నైపుణ్యాల్ని ఆన్‌లైన్‌లోనే పాయింట్లవారీగా తెలుసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని