logo

‘మెరీనా లైఫ్‌గార్డ్‌ యూనిట్‌’ ప్రారంభం

‘మెరీనా లైఫ్‌గార్డ్‌ యూనిట్‌’ను డీజీపీ శైలేంద్రబాబు మెరీనా బీచ్‌లో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మెరీనాకు వచ్చే పర్యాటకులు ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైతే వారిని కాపాడే చర్యలపై ప్రత్యేకంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

Published : 03 Oct 2022 00:36 IST

జెండా ఊపి వాహనాన్ని ప్రారంభిస్తున్న శైలేంద్ర బాబు

వడపళని, న్యూస్‌టుడే: ‘మెరీనా లైఫ్‌గార్డ్‌ యూనిట్‌’ను డీజీపీ శైలేంద్రబాబు మెరీనా బీచ్‌లో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మెరీనాకు వచ్చే పర్యాటకులు ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైతే వారిని కాపాడే చర్యలపై ప్రత్యేకంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. మెరీనాలో ఈ తరహా యూనిట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్టు గత ఏడాది అసెంబ్లీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ప్రత్యేక సిబ్బంది, వాహనాల కొనుగోలు, ఇతర పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.60 కోట్లు కేటాయించింది. తీర గస్తీ దళం, తమిళనాడు స్పెషల్‌ పోలీసు, గ్రేటర్‌ చెన్నై పోలీసు, ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సర్వీసెస్‌ విభాగాల నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారితో పాటు జాలర్ల వాలంటీర్లు విధుల్లో ఉంటారు. ‘తమిళనాడు అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌ కార్పొరేషన్‌’ ఆధ్వర్యంలో నాలుగు చక్రాల వాహనాలు, రెండు మినీ ట్రాక్టర్లు, ఓ ప్రొటో టైప్‌ డ్రోన్‌ కూడా సేవలందించనుంది. అత్యవసర సమయాల్లో రక్షించేందుకు ఎనిమిది మంది జాలర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది జాలర్ల చేత ప్రత్యేక మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. వీరు బీచ్‌ సందర్శనార్థం వచ్చే పర్యాటకులు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైతే రక్షిస్తారు. అదేవిధంగా ప్రత్యేక తీర గస్తీ బృందం ఫైబర్‌ పడవల్లో వేటకు వెళ్లిన జాలర్లు సముద్ర జలాల్లో చిక్కుకుపోతే జెట్‌ స్కైస్‌ ద్వారా రక్షిస్తుంది. 1093 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందగానే అగ్నిమాపక దళం, తీర గస్తీ దళం స్కూబా డైవర్ల సాయంతో నీట మునిగిన వారిని రక్షించేందుకు చర్యలు చేపడుతుంది. ఈ సమాచారాన్ని ‘మారి టైం రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌’కు చేరవేస్తామని తీర గస్తీ బృంద అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు సందీప్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. కార్యక్రమానికి కార్పొరేషన్‌ కమిషనరు గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ, పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి నావల్‌ ఏరియా ఫ్లాగ్‌ ఆఫీసర్‌ రియర్‌ అడ్మిరల్‌ ఎస్‌. వెంకట్‌రామన్‌ తదితరులు హాజరయ్యారు.

తీర గస్తీ దళం మాక్‌ డ్రిల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని