logo

ఆడ శిశువులకు శ్రీరామరక్ష

లింగ వివక్షను నిరోధించి భ్రూణ హత్యలకు పాల్పడకుండా ఆడ శిశువులను కాపాడాలని గాంధీగ్రాం ట్రస్టు పిలుపునిచ్చింది. అందుకోసం తనవంతు సాయం అందిస్తోంది.

Published : 03 Oct 2022 00:36 IST

గాంధీగ్రాం ట్రస్టు సేవలు

వడపళని,  న్యూస్‌టుడే: లింగ వివక్షను నిరోధించి భ్రూణ హత్యలకు పాల్పడకుండా ఆడ శిశువులను కాపాడాలని గాంధీగ్రాం ట్రస్టు పిలుపునిచ్చింది. అందుకోసం తనవంతు సాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవగాహన కల్పించి ఆడ శిశువులకు రక్షణ కల్పించడం అవసరమని ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.శివకుమార్‌ అన్నారు. డాక్టర్‌ సౌంద్రం అమ్మ మెటర్నటీ బెనిఫిట్‌ స్కీంను మహిళలు, సౌభాగ్య పథకం ఆడ శిశువులకు ఇటీవల ప్రారంభించినట్టు ఆదివారం తెలిపారు. రెడింగ్టన్‌ ఫౌండేషన్‌ సంస్థ సహకారంతో వీటిని మొదలుపెట్టామన్నారు.  ఆసుపత్రి జనరల్‌ వార్డులో ఉచిత చికిత్స, వైద్యుడి ఫీజు, ఇతర ఛార్జీలను ట్రస్టు భరిస్తుందన్నారు. రూ. 8 వేల నుంచి రూ.10 వేల నామమాత్రపు రుసుము వసూలు చేస్తామన్నారు. ఆడ శిశువులు కుటుంబాలకు ఒక వర ప్రసాదమని, భారంగా భావించకూడదనే ఆశయంతోనే సౌభాగ్య పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2011 గణాంకాల మేరకు 7.21 కోట్ల జనాభాలో ప్రతి వెయ్యి మందికి 996 మంది బాలికలున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ‘ఊయల బేబీ పథకం’ (క్రెడిల్‌ బేబీ స్కీం)ను 1992లో సేలం జిల్లాలో ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో భ్రూణ హత్యలు బాగా తగ్గాయని, అనంతరం ఆ పథకం మదురై, తేని, దిండిగల్లు, ధర్మపురి జిల్లాలకు విస్తరించిందని శివకుమార్‌ గుర్తు చేశారు. 2011 గణాంకాల మేరకు కడలూరు, అరియలూరు, పెరంబలూరు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో ఆర్థిక కారణాలతో బాలికల సంఖ్య తగ్గినట్టు చెప్పారు. ఊయల బేబీ పథకాన్ని గాంధీగ్రాం ట్రస్టు నిర్వహిస్తోందని, ప్రభుత్వ గుర్తింపు పొందామన్నారు. 75వ వసంతం సందర్భంగా ఆడ శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు ప్రసవ ఖర్చులు భరించామని చెప్పారు. డాక్టర్‌ సౌంద్రం అమ్మ మెటర్నిటీ స్కీంను కూడా ప్రభుత్వం గుర్తించి ప్రతి ఆడశిశువుకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం చేయాలని వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని