logo

సురక్షిత నీటి సరఫరాలో భేష్‌!

యావత్తు దేశానికి గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత నీటి సరఫరాలో దక్షిణాదిన ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి ఆదర్శంగా నిలిచాయి. ఇక్కడి చర్యలపై అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నాయి. ఈ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనికోసం అమలయ్యే ప్రణాళికల్లోని విషయాల్ని కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది.

Published : 04 Oct 2022 04:10 IST

 జాతీయస్థాయిలో రాష్ట్రానికి ప్రథమ స్థానం 

 ప్రతి గ్రామంలో ప్రత్యేక పథకాలకు ప్రణాళిక

- ఈనాడు, చెన్నై

యావత్తు దేశానికి గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత నీటి సరఫరాలో దక్షిణాదిన ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి ఆదర్శంగా నిలిచాయి. ఇక్కడి చర్యలపై అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నాయి. ఈ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనికోసం అమలయ్యే ప్రణాళికల్లోని విషయాల్ని కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది.

జల్‌ జీవన్‌ మిషన్‌ ఆధ్వర్యంలోని ఆరు బృందాలు ఈ ఏడాది మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు వేర్వేరు జిల్లాల్లో సర్వేలు నిర్వహించాయి. గ్రామాల్లోని ఇళ్లు, పైపులైన్ల నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాయి. వాటి ఫలితాలు, స్థానికంగా నిర్వహించిన సర్వేలోని వివరాల ఆధారంగా ర్యాంకుల్ని కేటాయించారు. ప్రత్యేకించి నీటి కనెక్షన్ల కవరేజీ 60 శాతంకన్నా తక్కువగా ఉన్న కేటగిరీలో తమిళనాడు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. 60శాతం కన్నా ఎక్కువగా ఉన్న కేటగిరీలో పుదుచ్చేరి 1వ ర్యాంకును సాధించింది. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 124లక్షల గృహాలుండగా.. అందులో 69 లక్షల ఇళ్లకు తాగునీటి పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
భారీగా ప్రాజెక్టులు..
స్థానికంగా నీటి వనరులు లేని గ్రామాలకు ప్రత్యేక తాగునీటి ప్రాజెక్టుల ద్వారా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే చాలా అందుబాటులోకి వచ్చాయని, మరిన్ని నిర్మాణంలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం జల్‌జీవన్‌మిషన్‌ పథకంలో భాగంగా రూ.18వేల కోట్లతో 42 కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మరో 56 చోట్ల మరమ్మతులు చేపడుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. మరిన్ని భారీ ప్రాజెక్టులకు కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
ఏడాదిలో ఎంతో మార్పు
ఒక్క ఏడాదిలోనే గ్రామీణ తాగునీటి సరఫరాలో భారీ పురోగతి సాధించినట్లుగా కేంద్ర ప్రభుత్వం నివేదికలో వెల్లడించారు. సరఫరా చేసే నీటిలో తాగునీటికి యోగ్యంగా 90శాతానికి మించి ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడును ప్రత్యేకంగా చూపారు. ఈ రాష్ట్రంలో 97శాతం గృహాల్లో సురక్షిత నీరు పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్నట్లు వెల్లడించారు. తమిళనాడులో ఈ పరిస్థితి గతంలో 54శాతం గృహాలకే ఉండగా.. ఇప్పుడు 97శాతానికి వెళ్లిందని, ర్యాంకుల్లో ఏకంగా 18స్థానాలు పైకి వెళ్లినట్లుగా తెలిపారు.
ప్రజల్లో సంతృప్తి
గ్రామాల్లో 82 శాతం గృహాల్లో తాగునీటి సరఫరా చాలా బాగున్నట్లుగా కేంద్ర నివేదికలో పేరొన్నారు. మొత్తంగా తమిళనాడులో నీటిసరఫరా సంతృప్తికరంగా మెరుగైనట్లుగా తెలిపారు. 2020-21లో కేవలం 39 శాతం గృహాల్లో మాత్రమే ఇది ఉండగా, ఇప్పుడది 86 శాతానికి చేరింది. రోజువారీగా సరఫరా అయ్యే మోతాదులో 88 నుంచి 94 శాతం గృహాలకు పెరిగింది. సమయానుకూలంగా సరఫరాలో 84 నుంచి 93 శాతం చేరింది. ఈ కేటగిరిలో ఏకంగా 20స్థానాల ముందుకు తమిళనాడు వెళ్లింది. జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు 95శాతం గృహాలకు తాగునీరు అందుతోంది. 73శాతం గ్రామాల్లో నాణ్యతాపరీక్షల కిట్లు అందుబాటులో ఉన్నట్లు నివేదికలో తెలిపారు.
స్థానికంగానే నిల్వ
రాష్ట్రంలో 98శాతం గ్రామాల్లో అందుబాటులో నీటి నిల్వలు ఉన్నట్లుగా తెలిపారు. గ్రామాల్లోనే స్థానికంగా నీటిపథకాల్ని వృద్ధి చేసుకున్న జాబితాలో తెలంగాణతో కలిపి తమిళనాడులో దేశంలోనే టాప్‌గా ఉంది. ఓవరాల్‌గా రాష్ట్రం మెరుగైన ప్రతిభ కనబరిచింది. గృహాల్లో 93శాతం, హర్‌ఘర్‌ జల్‌ గ్రామాల్లో 95 శాతం బాగున్నట్లుగా తెలిపారు.
ప్రభావిత జిల్లాల్లో ఇలా..
జపనీస్‌ ఎన్సెఫాలిటీ అక్యూట్‌ ఎన్సెఫాలిటీస్‌ సిండ్రోమ్‌ (జేఈ-ఏఈఎస్‌) ప్రభావిత జిల్లాల్లో తాగునీటి సరఫరా చాలా మెరుగ్గా ఉన్నట్లుగా నివేదించారు. వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ లాంటి ఇతరత్రా ప్రభావాలకు లోనైన గ్రామాల్లోనూ సర్వే బృందాలు పరిశీలించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లక్ష్యాల్ని అధిగమిస్తున్నట్లు, సురక్షిత నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
పుదుచ్చేరిలో 99 శాతం
60శాతం మించి తాగునీటి సరఫరా కవరేజీ ఉన్న రాష్ట్రాల కేటగిరీలో పుదుచ్చేరి మొదటిర్యాంకులో నిలిచింది. ఇక్కడ తాగునీటి కనెక్షన్లలో, సరఫరా మొతాదులో 100శాతం గృహాలకు నీరందుతోంది. క్రమం తప్పకుండా నీరివ్వడం, రక్షిత నీటిలో సరఫరా అవుతుండటంలో 99శాతం గృహాలు ముందున్నట్లుగా చూపారు. ఓవరాల్‌గా 88శాతం సంతృప్తి స్థాయిని ఈ కేంద్రపాలిత ప్రాంతం అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని