logo

విదేశాల్లో మన రైల్వేకు డిమాండ్‌

వందేభారత్‌ లాంటి అద్భుత హైస్పీడ్‌ రైలు ఆవిష్కరణ.. దేశంలోని పట్టాలపై రివ్వుమని పరుగులు తీస్తోంది. దేశానికి అవసరమైన రైళ్లనే కాదు, విదేశాలకు అవసరమైన రైళ్లనూ తయారుచేసి ఇవ్వడంలో భారతీయ రైల్వే జోరుగా కదులుతోంది.

Published : 05 Oct 2022 01:27 IST

ఐదేళ్లలో పెరిగిన ఆర్డర్లు

- ఈనాడు, చెన్నై

శ్రీలంకకు పంపిన తాజా డెమూ రైలు..  కోచ్‌లోని లోపలి భాగం 

వందేభారత్‌ లాంటి అద్భుత హైస్పీడ్‌ రైలు ఆవిష్కరణ.. దేశంలోని పట్టాలపై రివ్వుమని పరుగులు తీస్తోంది. దేశానికి అవసరమైన రైళ్లనే కాదు, విదేశాలకు అవసరమైన రైళ్లనూ తయారుచేసి ఇవ్వడంలో భారతీయ రైల్వే జోరుగా కదులుతోంది. ఇప్పటికే సుమారు 20 నుంచి 25 దేశాలకు ఇక్కడి కోచ్‌లు, లోకోలు, వ్యాగన్‌లు వెళ్తున్నాయి. విదేశీయుల మనసు దోచుకుంటున్నాయి.

విదేశాలకు భారతీయ రైల్వేకోచ్‌లు వెళ్లడమనేది కొత్తమీ కాదు. కానీ భారత్‌లో రైల్వేపరంగా తీసుకొస్తున్న సాంకేతికత విదేశీ ప్రభుత్వాల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకించి ఎక్కువ సామర్థ్యం ఉన్న లోకో (రైల్వే ఇంజిన్లు), ఎల్‌హెచ్‌బీ ఏసీ, నాన్‌ఏసీ కోచ్‌లు, డెమూ రైళ్లకు బాగా డిమాండ్‌ వస్తోంది. ఈ తరహా ఆర్డర్లు గత 5 ఏళ్లలో పెరిగినట్లుగా రైల్వే అధికారులు స్పష్టత ఇస్తున్నారు. వందేభారత్‌ ఆవిష్కరణ తెచ్చిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) నుంచి గత రెండేళ్లలోనే ఏకంగా 200 కోచ్‌లు తయారై వెళ్లాయి. ఇవన్నీ శ్రీలంక ప్రభుత్వమే తీసుకుంది. ఈ దేశంతోపాటు నేపాల్‌, అంగోలా లాంటిచోట్లకు కోచ్‌లు పంపడంతో గత 4 ఏళ్లలో ఐసీఎఫ్‌కు రూ.450కోట్లు సమకూరినట్లుగా రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక్కడి నుంచి 1967లోనే కోచ్‌లు, లోకోలు, షెల్స్‌ విదేశాలకు తరలి వెళ్లడం మొదలవగా.. ఇప్పటిదాకా 15 దేశాల్లో ఐసీఎఫ్‌ రైళ్లు తిరుగుతున్నాయి. మొత్తం 875 కోచ్‌లు, 359 బోగీలు, 11 షెల్స్‌లను ఇక్కడి యంత్రాంగం తయారుచేసి ఎగుమతి చేసింది. అత్యధిక రైళ్లు తైవాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, అంగోలా తదితర దేశాలకు తరలించారు. తాజాగా బంగ్లాదేశ్‌ నుంచి మరిన్ని ఆర్డర్లు ఇచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

ఆఫ్రికా కోసం..
తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌కు మన దేశం నుంచి లోకోలు, కోచ్‌లు, వ్యాగన్లు తరలి వెళ్తున్నాయి. అక్కడి మొజాంబిక్‌ పోర్ట్స్‌ అండ్‌ రైల్వేస్‌ విభాగం భారత ప్రభుత్వ సహకారంతో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నుంచి 95 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల రుణాన్ని పొందింది. ఈ నిధులతో రైళ్ల తయారీకోసం గతేడాది కీలక ఒప్పందం చేసుకుంది. ఈ దేశం కోసం రాయ్‌బరేలీలోని మోడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఎంసీఎఫ్‌) నుంచి 90 కోచ్‌లు, 30 డెమూ కోచ్‌లు తయారై వెళ్తున్నాయి. ఇందులో ఫస్ట్‌క్లాస్‌, సెకండ్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లు, నాన్‌ఏసీ కోచ్‌లున్నాయి. ఇప్పటికే చాలా కోచ్‌ల్ని అక్కడికి ఎగుమతి చేశారు. ఇదే దేశం కోసం వారణాసి బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (బీఎల్‌డబ్ల్యూ)లో 3 వేల హెచ్‌పీ సామర్థ్యమున్న లోకోలు తయారవుతున్నాయి. కపుర్తలలోని రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్‌) నుంచి బంగ్లాదేశ్‌కు 120 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తయారై వెళ్లాయి. వీటి నుంచి రూ.367 కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.

‘వందేభారత్‌’కు ప్రణాళిక
తాజాగా దేశవ్యాప్త చర్చగా ఉన్న హైస్పీడ్‌ రైలు వందేభారత్‌ను చెన్నై ఐసీఎఫ్‌ నుంచే విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. భారత అవసరాలకోసం సుమారు 400 వందేభారత్‌ రైళ్లను ఇవ్వడంతోపాటు ఈ తరహా సాంకేతికతను విదేశాలకు ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేకించి ఇతర దేశాలకోసం 2026-27 నుంచి తయారీ మొదలవవచ్చని ఐసీఎఫ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రైలు తాజాగా గంటకి 180 కి.మీ. వేగాన్ని అందుకుంది.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts