logo

చెన్నైలో 312 చోట్ల ఆధునిక సెన్సార్లు

చెన్నైలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు 312 జంక్షన్లలో ఆధునిక రిమోట్‌ కంట్రోల్‌ సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. రోడ్లపై ఆగి ఉండే వాహనాలను కచ్చితంగా లెక్కించి ఎరుపు, పచ్చ సిగ్నల్‌లు, వెళ్లాల్సిన సమయాన్ని ఇవి నియంత్రిస్తాయి.

Published : 05 Oct 2022 01:27 IST

 ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు చర్యలు

సైదాపేట, వడపళని, న్యూస్‌టుడే: చెన్నైలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు 312 జంక్షన్లలో ఆధునిక రిమోట్‌ కంట్రోల్‌ సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. రోడ్లపై ఆగి ఉండే వాహనాలను కచ్చితంగా లెక్కించి ఎరుపు, పచ్చ సిగ్నల్‌లు, వెళ్లాల్సిన సమయాన్ని ఇవి నియంత్రిస్తాయి. చెన్నైలో రోజురోజుకీ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహనాలు నత్తనడకన రాకపోకలు సాగిస్తున్నాయి. సాంకేతికత సాయంతో ట్రాఫిక్‌ నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ను పర్యవేక్షించి ఆ ప్రాంతాలకు వెంటనే పోలీసులు వెళ్లి రద్దీ నివారిస్తున్నారు. చెన్నై వేప్పేరిలోని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో పెద్ద తెరను ఏర్పాటు చేశారు. షిఫ్టులవారీగా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. చెన్నైలో 312 కూడళ్లలో ఆధునిక సెన్సార్‌ రిమోట్‌ పరికరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంబులెన్స్‌లు, వీఐపీ వాహనాలు, ఇతర అత్యవసర వాహనాలు వెళ్లేతప్పుడు, రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో రవాణాను బట్టి ఈ పరికరాలు పని చేస్తాయి. దీని గురించి చెన్నై రవాణా పోలీసు అదనపు కమిషనర్‌ కపిల్‌కుమార్‌ సి.శరత్‌కర్‌ మాట్లాడుతూ... త్వరలో జంక్షన్లలో రిమోట్‌ నియంత్రణ సెన్సార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆటోమేటిక్‌గా స్పందించి ఇవి సిగ్నళ్లను నియంత్రిస్తాయి. ప్రస్తుతం టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని