logo

Jayalalithaa: సీసీ కెమెరాలు ఆపమన్నదెవరు?

జయలలితకు చేసిన చికిత్సపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా కీలకమైన సమాచారం రాబట్టవచ్చని కమిషన్‌ భావించింది.

Updated : 21 Oct 2022 08:34 IST

ఆసుపత్రికి అందిన ఆదేశాలు
పొంతన లేని వివరాలు
కమిషన్‌కు వింత అనుభవం'

మాజీ ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న ఫ్లోర్‌లో సీసీ కెమెరాల విషయంలో హైడ్రామా నడిచింది. ఆ ఫ్లోర్‌ మొత్తం వీటిని ఆపేసి మరీ వైద్యం అందించడం, ఆమె ఆరోగ్యస్థితిని దాచిపెట్టడం, శశికళపైనా అనుమానాలుండటంతో ఏదో జరిగిందనే ఆరోపణపై తీవ్ర చర్చలే సాగుతున్నాయి. జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ నివేదికలో ఇలాంటి పలు విషయాలు బయటికొచ్చాయి.

ఈనాడు, చెన్నై: జయలలితకు చేసిన చికిత్సపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా కీలకమైన సమాచారం రాబట్టవచ్చని కమిషన్‌ భావించింది. ఆ ఫుటేజీల కోసం ఆసుపత్రివర్గాలకు కమిషన్‌ లేఖ కూడా రాసింది. జయ ఆసుపత్రిలో చేరిన 2016 సెప్టెంబరు 22వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆమె కన్నుమూసే వరకు ఫుటేజీలు ఇవ్వాలని కోరింది. దీనికి ఆసుపత్రివర్గాలు బదులు చెప్పినతీరుపై కమిషనే ఆశ్చర్యపోయింది. జయలలిత ఉన్న రెండో అంతస్తుకు సంబంధించిన ఎలాంటి ఫుటేజీలు లేవని ఆస్పత్రి ప్రతినిధులు చెప్పారు. పైగా 30-45 రోజులకు మించి సీసీ కెమెరా ఫుటేజీలు ఉండవని బదులిచ్చారు. ఆ గడువు దాటిపోతే వివరాలు ఆటోమేటిక్‌గా రికార్డుల నుంచి కనిపించకుండా పోతాయని సమాధానమిచ్చారు.

ఆసుపత్రి బయట బందోబస్తు (పాత చిత్రం)

భద్రపరచాల్సి ఉన్నా..
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పుడు, తీవ్ర ఆరోపణలు వస్తున్నప్పుడు సీసీ కెమెరా ఫుటేజీలు భద్ర పరచకపోవడంపై కమిషన్‌ అనుమానం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ చేపట్టింది. జయలలిత మరణం నేపథ్యంలో ఆసుపత్రిలోని ఫొటోలు, వీడియోల ముద్రణ విషయంలో హైకోర్టులో కేసు కూడా నడిచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులనుంచిగానీ, అటు కోర్టునుంచిగానీ.. ఈ ఫుటేజీ డిలిట్‌ అవకుండా చూడాలనే ఆదేశాలు జారీ కాలేదని కమిషన్‌ తెలిపింది. ఆసుపత్రి వర్గాలు గతంలో హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం పోలీసుల ఆదేశాలమేరకే 2వ అంతస్తులోని సీసీ కెమెరాలను ఆపేసినట్లుగా కమిషన్‌ వివరించింది.

ఆసుపత్రికే స్పష్టత లేదు
సీసీ కెమెరాలు తీసేయడం వెనక ఆసుపత్రికి, అక్కడ పనిచేసేవారికి సరైన కారణాలు లేవని కమిషన్‌ తేల్చిచెప్పింది. చాలామంది చెప్పిన మేరకు.. జయలలిత చికిత్స పొందుతున్న 2వ అంతస్తులో కెమెరాలు కనిపించాయిగానీ అవి పనిచేయలేదని అవగాహనకు వచ్చింది. సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసినంత మాత్రాన భద్రత సరిగాలేదని చెప్పలేమని కమిషన్‌ వ్యాఖ్యానించింది. ఆసుపత్రిలో కట్టుదిట్ట భద్రత ఉందని తెలిపింది.

ఆదేశాలు ఎక్కడివి..
*  సీసీ కెమెరాలు ఆపాల్సిన అవసరమేంటి, ఎవరు అలా చెప్పారనే కోణంలో కమిషన్‌ దర్యాప్తు చేసింది. ఎవరి నుంచీ స్పష్టమైన సమాధానం రాలేదనేది నివేదికను బట్టి తెలుస్తోంది.
*  ఆసుపత్రికి చెందిన మోహన్‌కుమార్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆరోగ్య శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆపామని పేర్కొన్నారు. కానీ వారిద్దరూ మాత్రం కమిషన్‌ ముందు ఆసుపత్రికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. వాటిని ఆపేయమని తానెప్పుడూ ఆదేశాలు ఇవ్వలేదని అప్పట్లో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిషన్‌కు వివరించారు.
*   ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయట్లేదనే విషయం తాను గమనించలేదని అప్పటి ఐజీ కె.ఎన్‌.సత్యమూర్తి కమిషన్‌కు బదులిచ్చినట్లుగా వెల్లడించారు. అవి పనిచేస్తున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత అధికారులదని, వాటిని ఆపేయాలని తన నుంచి ఆదేశాలు వెళ్లలేదని స్పష్టం చేశారు.
*   ఆసుపత్రికి చెందిన సత్యభామ ఇచ్చిన వాంగ్మూలంలో.. ఆసుపత్రి సీసీ కెమెరాలను చక్కగా నిర్వహిస్తున్నారని, దానికోసం ప్రత్యేక విభాగమే ఆసుపత్రిలో ఉందని తెలిపారు. కెమెరాల్ని తీసేయాలని ఎవరి నుంచీ తమకు విజ్ఞప్తి రాలేదని తెలిపారు.
*   ఆ ఫ్లోర్‌లో మొత్తం 27 కెమెరాలు ఆపేసినట్లు కొందరు చెప్పారు. మరికొందరు వాటిని గోడల నుంచి తీసేశారని వివరించినట్లు కమిషన్‌ తెలిపింది.
*   సిటీస్కానింగ్‌కు తీసుకెళ్లేటప్పుడు ఒక గది నుంచి మరో చోటుకు మార్చేటప్పుడు మాత్రమే వాటిని స్విచాఫ్‌ చేస్తారని ఆసుపత్రివర్గాలే వెల్లడించాయి. అన్ని సమయాల్లోనూ వాటిని ఎందుకు ఆపి ఉంచారని కమిషన్‌ అడిగిన ప్రశ్నలకు ఎవరి నుంచీ సరైన సమాధానం రానట్లు నివేదికలో వెల్లడించారు.
*అప్పట్లో విధుల్లో ఉన్న ఏఎస్‌పీ పెరుమాల్‌సామి ఇచ్చిన సమాధానంలో.. తాను వాటిని తీయమని చెప్పలేదని, రికార్డు చేయొద్దని ఎవరితోనూ అనలేదని వివరించారు. అధికారులు, పోలీసులు దీనికి సంబంధించిన అనుమానాల్ని నివృత్తి చేయలేకపోయారని కమిషన్‌ చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని