logo

Jayalalithaa: వేలిముద్ర వేయడం చూడలేదు: జయ మృతి వ్యవహారంలో అధికారుల వెల్లడి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో ఉండగా వేలిముద్ర తీసుకున్న విషయాన్ని ముందుగా తమకు చెప్పలేదని, తమ సమక్షంలో వేలిముద్ర తీసుకోలేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపినట్టు జస్టిస్‌ ఆరుముగస్వామి విచారణ కమిషన్‌ నివేదిక వెల్లడించింది.

Updated : 25 Oct 2022 06:56 IST

సమగ్ర విచారణ అవసరం లేదన్న కమిషన్‌

చెన్నై, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో ఉండగా వేలిముద్ర తీసుకున్న విషయాన్ని ముందుగా తమకు చెప్పలేదని, తమ సమక్షంలో వేలిముద్ర తీసుకోలేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపినట్టు జస్టిస్‌ ఆరుముగస్వామి విచారణ కమిషన్‌ నివేదిక వెల్లడించింది. దీనిపై కమిషన్‌ ఒకింత విస్మయాన్ని వ్యక్తం చేసినా సమగ్ర విచారణ అవసరంలేదని భావించింది. జయలలిత ఆస్పత్రిలో ఉండగా జరిగిన తిరుప్పరంకుండ్రం, అరవకురిచ్చి, తంజావూర్‌ శాసనసభ ఎన్నికల్లో జయలలిత బొటనవేలి ముద్రలతో ఉన్న ఏ, బి ఫారాలను ఎన్నికల అధికారులకు అన్నాడీఎంకే అభ్యర్థులు సమర్పించడం అప్పట్లో వివాదాస్పదమైంది. సంతకాలు లేకుండా వేలిముద్రలు ఉండటం పలు అనుమానాలను రేకెత్తించింది. వేలిముద్రలు తీసుకునేటప్పుడు ఆమె ప్రాణాలతో ఉండే అవకాశంలేదంటూ తిరుప్పరంకుండ్రం డీఎంకే అభ్యర్థి డాక్టర్‌ పి.శరవణన్‌ బహిరంగ ఆరోపణలు చేశారు. ఇదే విషయమై మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్‌ వేశారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఫారాల్లోని వేలిముద్రలను బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు రిజిస్టర్‌లో ఉన్న జయలలిత వేలిముద్రలతో సరిపోల్చాలనీ డిమాండ్‌ చేశారు. తన విచారణలో భాగంగా ఈ వ్యవహారంపై కూడా జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ విచారించింది. ఎన్నికల కమిషన్‌ అనుమతితో జయలలిత వేలిముద్రను ఏ, బీ ఫారాల్లో తీసుకున్నట్టు అన్నాడీఎంకే తరఫున ఆరుముగస్వామి విచారణ కమిషన్‌కు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందే ముఖ్యమంత్రి దగ్గర వేలిముద్ర తీసుకునే ప్రతిసారి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి లేక ప్రభుత్వ అధికారులైన ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శులకు తెలియజేయాలి. జయలిత వ్యవహారంలో అలా జరగలేదనే విషయం విచారణలో స్పష్టమైంది.

అధికారులకు ముందుగా చెప్పలేదు
జయలలిత నుంచి వేలిముద్రలు తీసుకోవడం గురించి తనకు ముందుగా చెప్పలేదని నాటి స్పెషల్‌ డ్యూటీ ఆఫీసర్‌ షీలా బాలకృష్ణన్‌ తెలిపారు. జయలలిత నుంచి సంతకం చేయించుకోవడం నాటి క్యాంపు కార్యాలయ కార్యదర్శి రామలింగం బాధ్యత అని, సంతకం పొందడానికి ఆయనకు రాతపూర్వకంగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని నాటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ పి.రామమోహన్‌రావు వెల్లడించారు. వేలిముద్రల గురించి ఎవరూ అలాంటి అనుమతి కోరలేదని, అందువల్ల ఎలాంటి అనుమతి ఇవ్వలేదని జయలలిత వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ వెంకట్రామణన్‌ తెలిపారు. వేలిముద్ర తీసుకోవడం గురించి తనకు ఎవరూ వెల్లడించలేదని జయలలిత క్యాంపు కార్యాలయ కార్యదర్శి రామలింగం పేర్కొన్నారు. దీంతో జయలలిత నుంచి వేలిముద్ర తీసుకోవడం గురించి ముందుగా ప్రభుత్వ సంబంధిత అధికారులు ఎవరికీ తెలియదనే విషయాన్ని కమిషన్‌ గ్రహించింది.

పలువురికి మొట్టికాయలు
జయలలిత మృతిపై విచారించిన జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ తన నివేదికలో పలువురికి మొట్టికాయలు వేసింది. జయలలితకు బాగోలేదని తెలిసిన వెంటనే ఆమెను వ్యక్తిగత వైద్యుడిగా ఉన్న శివకుమార్‌ పరీక్షించి ఉండాల్సిందని కమిషన్‌ అభిప్రాయపడింది. ఇది కమిషన్‌ దృష్టిలో నిర్లక్ష్యంగా తెలిపింది. అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు ‘సెప్సిస్‌’పై మాత్రమే దృష్టి సారించి 2016 సెప్టెంబరు 27 అర్ధరాత్రి వరకు దానికి చికిత్సలు అందించారని, ఆమె ఆరోగ్యం క్షీణించడానికి కారణమైన హృద్రోగానికి చికిత్సలు అందించడం మరిచారని తెలిపింది. అపోలోకు ఐదుసార్లు విచ్చేసిన ఎయిమ్స్‌ బృందం ఎలాంటి చికిత్సలు సిఫారసు చేయలేదని పేర్కొంది. నాటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ సాక్ష్యం తిరస్కరించేలా, బాధ్యతారాహిత్యంగా ఉండటం బాధాకరమని తెలిపింది. మెరుగైన చికిత్సలు కోసం జయలలితను విదేశాలకు తీసుకెళ్లకపోవడాన్ని ప్రశ్నించగా... ఆ చర్యలు భారతీయ వైద్యులను అవమానించేలా ఉంటాయని సమాధానం ఇవ్వడంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. అలాంటప్పుడు చికిత్సలు కోసం లండన్‌ నుంచి వైద్యులను, సింగపూర్‌ నుంచి ఫిజియోథెరఫిస్ట్‌ను అపోలోకు ఎందుకు రప్పించినట్టని ప్రశ్నించింది. ఆ చర్యలు భారతీయ వైద్యులను అవమానించేలా లేవా? అనీ ప్రశ్నించింది. వెటర్నరీ వైద్యుడైన ఆయన ఆరోగ్యశాఖ కార్యదర్శి అర్హత ప్రాతిపదికన తనను వైద్యుడిగా చెప్పకపోవడమే శ్రేష్టమని వ్యాఖ్యానించింది. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి కావడం ఆమె నిర్ణయంపై ఆధారపడిందంటూ అపోలో ఆస్పత్రి సంస్థల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి అప్పట్లో విలేకర్లకు వెల్లడించడాన్ని విమర్శించింది. ఆ వ్యాఖ్యలు వాస్తవదూరమనే విషయం విచారణలో తెలిసిందని పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్పత్రి ఛైర్మన్‌ ఇలా మీడియాతో బాధ్యతారాహిత్య అభిప్రాయాన్ని వెల్లడించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపింది. జయలలితను బాగు చేయాలని భావించడం వాస్తవమైతే తొరసిక్‌ నిపుణులను నియమించి, వారి సూచనల మేరకు చికిత్సలు అందించి ఉంటారని, ఇది మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా ఉందని అపోలో ఆస్పత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జయలలితకు నమ్మిన బంటుగా ఉన్న ఓ.పన్నీర్‌సెల్వం సైతం ఆమె మృతిని రాజకీయ లబ్ధికి వాడుకున్నట్టు కమిషన్‌ అభిప్రాయపడింది.

పొంతనలేని సమాధానం: 2016 అక్టోబరు 27 సాయంత్రం 6.30 గంటలకు జయలలిత నుంచి వేలిముద్రలు తీసుకున్నట్టు అపోలో ఆస్పత్రి అనుసంధాన అధికారిగా ప్రభుత్వం నియమించిన డాక్టర్‌ పి.బాలాజీ కమిషన్‌కు మొదట్లో వెల్లడించారు. వేలిముద్ర తీసుకున్నట్టు ఆయన చెప్పిన సమయంలో జయలలిత నిద్రపోతున్నట్టు ఆస్పత్రి చార్ట్‌లో నమోదైంది. ఆ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆమె నిద్రించినట్టు చార్ట్‌లో ఉంది. దీనిపై క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడంతో వేలిముద్ర తీసుకున్న సమయాన్ని సాయంత్రం 6 గంటలుగా బాలాజీ సవరించారని కమిషన్‌ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా జయలలిత నుంచి వేలిముద్ర తీసుకున్న విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్‌ నేత తంబిదురైను కమిషన్‌ ప్రశ్నించింది. ఆమె పార్టీ ప్రధానకార్యదర్శిగా ఉండటంతో వేలి ముద్రలు తీసుకోవడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో కమిషన్‌ ఏకీభవించింది. వేలిముద్రలు తమకు తెలియకుండా తీసుకున్నారని నాటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, స్పెషల్‌ డ్యూటీ ఆఫీసర్‌, వ్యక్తిగత కార్యదర్శి వెల్లడించినా కమిషన్‌ పరిధి పరిమితుల దృష్ట్యా దీనిపై సమగ్ర అధ్యయనం అనవసరమని జరపాల్సిన ఆవశ్యకతలేదని భావించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని