logo

Tamil Nadu: శశికళ చేతిలో కీలుబొమ్మగా దీపక్‌: జయలలిత మేనకోడలు దీప

శశికళ చేతిలో కీలుబొమ్మగా తన తమ్ముడు దీపక్‌ ఉన్నారని జయలలిత మేనకోడలు దీప ఆరోపించారు. జయలలిత మృతిపై అనుమానం ఉందని ఆరుముగస్వామి కమిషన్‌ నిర్ధారించింది. శశికళ, మాజీ మంత్రి విజయభాస్కర్‌లపై ఆరోపణలు వచ్చాయి. న్యాయ నిపుణుల సలహా మేరకు విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 29 Oct 2022 09:05 IST

సైదాపేట, న్యూస్‌టుడే: శశికళ చేతిలో కీలుబొమ్మగా తన తమ్ముడు దీపక్‌ ఉన్నారని జయలలిత మేనకోడలు దీప ఆరోపించారు. జయలలిత మృతిపై అనుమానం ఉందని ఆరుముగస్వామి కమిషన్‌ నిర్ధారించింది. శశికళ, మాజీ మంత్రి విజయభాస్కర్‌లపై ఆరోపణలు వచ్చాయి. న్యాయ నిపుణుల సలహా మేరకు విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆరోపణలను శశికళ కొట్టివేశారు. ఈ నేపథ్యంలో జయలలిత వారసుడిగా న్యాయస్థానం ప్రకటించిన జయలలిత మేనల్లుడు దీపక్‌ జయలలిత మరణంలో శశికళకు ఎలాంటి సంబంధం లేదని చెబుతుండటం గమనార్హం. కమిషన్‌ నివేదికకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయనున్నట్లు దీపక్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తన తమ్ముడు శశికళ కబంధ హస్తాల్లో ఉన్నారని దీప తెలిపారు. దీని గురించి విడుదల చేసిన ఆడియోలో తన సొంత తమ్ముడిని తనకు వ్యతిరేకంగా మార్చి శశికళ తన గుప్పిట్లో పెట్టుకుందని చెప్పారు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు, రాజకీయ పలుకుబడి కోసమే శశికళ తన మేనత్త జయలలిత దగ్గర ఉన్నారని తెలిపారు. శశికళ సూచన మేరకు దీపక్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ తాను అక్కడే ఉన్నానని దీపక్‌ చెబుతున్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఎందుకు ఆ విషయాలు మీడియాతో పంచుకోలేదని ప్రశ్నించారు. అ అంత్యక్రియల్లో కూడా తనకు అనుమతి ఇవ్వలేదన్నారు. జయలలితకు తానంటే ఇష్టం లేదని చెప్పి అనుమతించలేదని, దీపక్‌ను మాత్రమే అనుమతించామని శశికళ కూడా కమిషన్‌కు తెలిపారని చెప్పారు. తన విషయం పక్కన పెట్టినా... అన్నాడీఎంకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా జయలలితను ఎందుకు చూడలేదని ప్రశ్నించారు. శశికళ కుటుంబం  చెప్పిన విషయాలే బయటకు వచ్చి చెప్పారని తెలిపారు. ఈ విచారణను ఎవరు అడ్డుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిజాయతీగా జరపాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని