logo

Talented kid: బుజ్జి పాపాయి.. జ్ఞాపకశక్తిలో మేటోయి

తల్లిదండ్రుల మాట వినకుండా మారాం చేసే రెండేళ్ల వయసులో ఓ బుజ్జి పాపాయి జ్ఞాపకశక్తితో ఏకంగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించింది.

Published : 14 Nov 2022 07:48 IST

చిన్నారికి శిక్షణ ఇస్తున్న తల్లి పవిత్ర

చెన్నై, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల మాట వినకుండా మారాం చేసే రెండేళ్ల వయసులో ఓ బుజ్జి పాపాయి జ్ఞాపకశక్తితో ఏకంగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించింది. పుదుచ్చేరి విల్లియనూర్‌లోని వసంతం నగర్‌కు చెందిన బాలాజీ, పవిత్ర దంపతుల కుమార్తె దేయన్‌శ్రీ (3). నెలల శిశువుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు చెప్పించే సంజ్ఞలను తిరిగి చేసి చూపించేది. టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనలోని దృశ్యాలను అనుకరించేది. ఇది తల్లిదండ్రులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్నారిలో ప్రత్యేక జ్ఞాపకశక్తి ఉన్నట్టు గుర్తించారు. దానికి మరింత పదును పెట్టేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన పలు పుస్తకాలను కొని మరీ దేయన్‌శ్రీకి అందులోని విషయాలను చెప్పించారు. వివిధ రంగులు, జంతువులు, పండ్లు, జాతీయ నేతలు తదితర 9 విభాగాలకు సంబంధించిన విషయాలను నేర్పించారు. వాటికి సంబంధించి ప్రశ్నిస్తే టక్కున సమాధానం ఇచ్చేంతగా ఆ చిన్నారి తర్ఫీదు పొందింది. దీంతో హరియానా కేంద్రంగా కొనసాగుతున్న ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులను సంప్రదించారు. వారి సమక్షంలో చిన్నారి తన జ్ఞాపకశక్తిని ప్రదర్శించి మెప్పించింది. దీంతో గత ఏడాది ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. అప్పటికి ఆ చిన్నారి వయసు రెండేళ్లు మాత్రమే.


అంతటితో ఆగలేదు


సాధించిన పురస్కారాలతో దేయన్‌శ్రీ

దేయన్‌శ్రీ ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు తల్లిదండ్రులు కృషి చేశారు. తమిళంలో ‘అ’ నుంచి ‘అక్‌’ వరకు ఉన్న అచ్చులను పదాలతో 22 సెకన్లలో, ఆంగ్లంలో ‘ఏ’ నుంచి ‘జెడ్‌’ వరకు ఉన్న అక్షరాలను పదాలతో 50 సెకన్లలో చెప్పడంలో శిక్షణ పొందింది. నేతల ఫొటోలను చూసి వారిని గుర్తుపడుతోంది. వీటితో పాటు మొత్తం 15 విభాగాల్లో జ్ఞాపకశక్తి ప్రతిభను కనబరిచింది. దీంతో ‘ఏసియన్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ పుస్తకంలోనూ చోటు సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని