logo

Anushka Kolla: బాల మేధావి: 12 ఏళ్లకే కోడింగ్‌పై పట్టు.. ఉచిత బోధన!

బాల మేధావి అనుష్క కొల్లా భారతీయ నౌకాదళ కమాండర్‌ కేపీ శబరీష్‌, కేఎస్‌ రేణుక దంపతులకు 2009 సెప్టెంబరు 2న జన్మించింది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న అనుష్క చిన్నతనం నుంచి ఎంతో హుషారుగా ప్రతి పనిలోనూ అంకితభావం ప్రదర్శించేది.

Updated : 14 Nov 2022 07:29 IST


తల్లిదండ్రులు, చెల్లితో అనుష్క

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: బాల మేధావి అనుష్క కొల్లా భారతీయ నౌకాదళ కమాండర్‌ కేపీ శబరీష్‌, కేఎస్‌ రేణుక దంపతులకు 2009 సెప్టెంబరు 2న జన్మించింది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న అనుష్క చిన్నతనం నుంచి ఎంతో హుషారుగా ప్రతి పనిలోనూ అంకితభావం ప్రదర్శించేది. అనుష్క చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు కోడింగ్‌ ప్రాముఖ్యతను వివరించారు.

రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తుకు కోడింగ్‌ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. కోడింగ్‌ ఆవశ్యకతను గుర్తించిన అనుష్క రెండేళ్లుగా అంతర్జాలం ద్వారా ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాల వయస్సుగల విద్యార్థులకు కోడింగ్‌పై ఉచిత శిక్షణనిస్తోంది. వారానికి ఓ గంటపాటు తరగతులు నిర్వహిస్తోంది. మొదటి స్థాయిలో బేసిక్స్‌, రెండవ స్థాయిలో యాప్‌ డెవలప్‌మెంట్, మూడో లెవల్‌లో వృత్తిపరమైన విధానాలను బోధిస్తోంది. తన దగ్గర నేర్చుకుంటున్న విద్యార్థుల నైపుణ్యతను పరీక్షించేందుకు ప్రశ్నావళి కూడా రూపొందించారు.

కోడింగ్‌ ద్వారా మన సంస్కృతి, చరిత్ర, పురాణ కథలను కూడా పరిచయం చేశారు. ఏ విద్యనైనా నేర్చుకోవడం ఓ ఎత్తు అయితే.. ఇతరులకు నేర్పడం మరొక ఎత్తు. ఈ రెండింటిలోనూ అనుష్క సవ్యసాచి. ఇప్పటిదాకా దాదాపు 500 మంది విద్యార్థులకు కోడింగ్‌ నేర్పించింది. ఈ బాలిక సేవలను గుర్తించి వాసవి క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌) తాము నిర్వహించిన కార్యక్రమాల్లో అనుష్కను బాల ఉపాధ్యాయ, బాల ద్రోణాచార్య, హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ వంటి పురస్కారాలతో సత్కరించాయి. ఆర్యవైశ్య అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (అవోపా) తరఫున బాలికను ఉగాది పురస్కారంతో సత్కరించారు.

ఆనంద్‌శ్రీ ఫౌండేషన్‌ (ముంబయి) మహాత్మాగాంధీ అవార్డుతో సత్కరించింది. అంతర్జాతీయ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఓఎంజీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అతి పిన్న వయసు బోధకురాలిగా గుర్తించి అనుష్కకు ధ్రువపత్రాలు అందించాయి. విద్యా రంగంలో అనుష్క అందిస్తున్న సేవను గుర్తించి నలంద విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఫిబ్రవరిలో అందించిన గౌరవ డాక్టర్‌ అనుష్క కీర్తికిరీటంలో మరో కలికితురాయి. ప్రముఖ పారిశ్రామివేత్త, జయరాజ్‌ ఇంటర్నేషనల్‌ అధినేత తాడేపల్లి రాజశేఖర్‌ రూ.10 వేల నగదు బహుమతితో సత్కరించారు. కోడింగ్‌తో సరిపెట్టుకోకుండా కర్ణాటక సంగీతం, పాశ్చాత్య సంగీతంతోపాటు ఫుట్బాల్‌, స్కేటింగ్‌, సైక్లింగ్‌, రన్నింగ్‌లలో కూడా ప్రవేశం సంపాదించుకున్నారు. వీటిల్లో కూడా తన సత్తా చూపి తానేమిటో నిరూపించేందుకు అంకితభావంతో కృషి చేస్తోంది.

అందుకున్న పురస్కారాలతో...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని