logo

ప్లాస్టిక్‌ రహితం దిశగా అడుగులు

పెనుసవాళ్లనే ఎదుర్కొంటోంది. కనీసం ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని ప్రాసెస్‌ చేసే సామర్థ్యంలేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి.

Published : 25 Nov 2022 00:17 IST

ఆదర్శంగా నిలుస్తున్న వినూత్న విధానాలు
ఈనాడు, చెన్నై
పసుపు సంచుల యంత్రం

రీసైకిల్‌ కాని ప్లాస్టిక్‌ వినియోగంలో దేశం

పెనుసవాళ్లనే ఎదుర్కొంటోంది. కనీసం ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని ప్రాసెస్‌ చేసే సామర్థ్యంలేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్లాస్టిక్‌ రద్దు దిశగా దేశం కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులో తీసుకుంటున్న పలు చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ కవర్లకు ప్రత్యామ్నాయంగా పసుపు సంచుల్ని రాష్ట్రం ప్రవేశపెట్టింది. దీనిపై ‘మీండుమ్‌ మంజుప్పై’ పథకం పేరుతో పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సంచుల్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా వెండింగ్‌ యంత్రాలను అందుబాటులో ఉంచుతోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. పలుచోట్ల వీటిని పెట్టిన ప్రభుత్వం భవిష్యత్తులో ప్రతి నగరంలోనూ జనసంచారం ఉన్నచోట్ల ఉంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చెన్నైలో నిత్యం రద్దీగా ఉండే కోయంబేడు మార్కెట్‌లో 400 బ్యాగుల సామర్థ్యముంటే రెండు యంత్రాల్ని ఏర్పాటుచేశారు. రోజుకు 1,600 సంచుల విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కటి రూ.10కి విక్రయిస్తున్నారు. తాజాగా మద్రాస్‌ హైకోర్టునూ ప్లాస్టిక్‌ ఫ్రీజోన్‌గా ప్రకటించారు. ఇక్కడ 5 యంత్రాల్ని అందుబాటులోకి తెచ్చారు. మరో 25 యంత్రాలకు రూ.25 లక్షలతో తాజాగా ఆర్డర్‌ ఇచ్చింది. హైకోర్టులోనూ దీనిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు నమోదవడంతో డిసెంబరులోపు రాష్ట్రాన్ని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలని ఆదేశాలు జారీ య్యాయి.

* తయారీదారులకు రాయితీలు

ప్రత్యామ్నాయ ఉత్పత్తులు తయారుచేసే సంస్థల్ని పెద్దఎత్తున ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. సెప్టెంబరులో ఈ తరహా ఉత్పత్తుల రెండ్రోజుల జాతీయ మేళాను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసింది. 168 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పితే రాయితీలను ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఇలాంటి పరిశ్రమలు పెరిగాయి. ప్రత్యేకించి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మినీయూనిట్లు ఏర్పడ్డాయి.

* నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌

రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటుచేసింది. జిల్లాలవారీగా తయారీ, విక్రయాలను కట్టడిచేసే పనిలో ఈ అధికారులు ఉన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2019 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.11కోట్ల జరిమానాలు వసూలు చేశారు. జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో సర్వేలూ నిర్వహిస్తున్నారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అంచనా ప్రకారం 38శాతం దుకాణాలు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులకు అవగాహన కల్పించే పనిలో అధికారులున్నారు. గతంతో పోల్చితే వ్యాపారుల తీరులో చాలా మార్పులొచ్చినట్లు చెప్పారు.

రీసైకిల్‌కి ప్రత్యేక ప్లాంటు

చెన్నైలో ప్రముఖ గార్నియర్‌ సంస్థ మరో వినూత్న కార్యక్రమంతో వచ్చింది. ప్లాస్టిక్‌ ఫర్‌ ఛేంజ్‌ స్వచ్ఛంద సంస్థతో కలిసి వ్యర్థాల్ని సేకరించి రీసైకిల్‌ చేసే ప్లాంటును తెరిచింది. 2 వేల టన్నుల్ని సేకరించాలని లక్ష్యంగా కూడా పెట్టుకుంది. దీనిద్వారా సామాన్యులకు ఉపాధి ఇవ్వాలని చూస్తోంది. చెన్నైతోపాటు దేశంలో 20 నగరాల్లో వీరు ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాల్ని తెరిచినట్లుగా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.


పాలప్యాకెట్‌పై ‘పరిశోధన’

రాష్ట్రంలోనే పెద్దదైన పాల పంపిణీ సంస్థ ‘ఆవిన్‌’ ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది. రోజూ 25 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. వీటికి వాడే కవర్లకు ప్రత్యామ్నాయ మార్గం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా ప్రయోగాలు చేయాలని నిర్ణయించింది. అన్నా యూనివర్సిటీ, ఐఐటీ మద్రాస్‌ నిపుణులతో పరిశోధన మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ దేశానికే ఆదర్శం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.


నీలగిరిలో మొదలై..

సుప్రియా సాహు

పర్యాటక కేంద్రంగా ఉన్న నీలగిరి జిల్లాలో 2000 నుంచే పూర్తిస్థాయి ప్లాస్టిక్‌ నిషేధం కొనసాగుతోంది. ఇక్కడ ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను కూడా అనుమతించడం లేదు. అప్పటి కలెక్టర్‌ సుప్రియా సాహు దీనిని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు పర్యావరణ, అటవీ వాతావరణ మార్పులశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దీంతో ప్లాస్టిక్‌ రహిత చర్యలు వేగంగా చేపట్టారు. ప్రజల మద్దతు ఉంటేనే ఏ ఉద్యమమైనా విజయం సాధిస్తుందని, ఇప్పుడు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌లో ఇదే జరుగుతోందని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని