logo

అణువణువూ జీవ వైవిధ్యమే!

రాష్ట్రంలోనే అత్యంత అరుదైన ప్రాంతంగా ఇప్పుడు అరిట్టాపట్టి పరిసరాలు  గుర్తింపు పొందాయి. ఇక్కడున్నంతగా ప్రకృతి, సంపద, జీవవైవిధ్య సమ్మేళనం రాష్ట్రంలో మరెక్కడా లేదని ప్రభుత్వం ప్రకటించింది.

Published : 26 Nov 2022 00:24 IST

 రాష్ట్రంలో తొలి వారసత్వ ప్రాంతంగా అరిట్టాపట్టి
 477 ఎకరాల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు

-ఈనాడు, చెన్నై

రాష్ట్రంలోనే అత్యంత అరుదైన ప్రాంతంగా ఇప్పుడు అరిట్టాపట్టి పరిసరాలు  గుర్తింపు పొందాయి. ఇక్కడున్నంతగా ప్రకృతి, సంపద, జీవవైవిధ్య సమ్మేళనం రాష్ట్రంలో మరెక్కడా లేదని ప్రభుత్వం ప్రకటించింది. తొలి జీవ వైవిధ్య వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందింది.  ప్రత్యేకతలపై ఓ సారి దృష్టిపెడితే ఎన్నో విశేషాలు తెలుస్తున్నాయి.

మదురైకి 25 కి.మీ. దూరంలో ఈ ప్రాంతముంది. వరుసగా కొండలు కనిపిస్తుంటాయి. ఇవే ప్రత్యేక ఆకర్షణ. వీటి మధ్యలోనే అనేక విశేషాలు ఉన్నాయి. బహుళ వైవిధ్య సంపదపై పలురకాల పరిశోధనలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడి అరుదైన సంపదను రక్షించేందుకు అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా మరింతగా తీర్చిదిద్దాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

పొడవాటి కొండలు..

జీవవైవిధ్య చట్టం-2002 సెక్షన్‌ 37 ప్రకారం దీన్ని గుర్తించారు. మదురై తూర్పు నియోజకవర్గంలోని మీనాక్షిపురం, మేలూర్‌ నియోజకవర్గంలోని అరిట్టాపట్టి పరిధిలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. 477.44 ఎకరాల ఈ ప్రాంతంలో కొండలు అల్లుకుని ఉండటం విశేషం. ఈ భౌగోళిక స్వరూపం ప్రత్యేకంగా ఉండటాన్ని ప్రపంచానికి చాటాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

నీటి ప్రవాహాలు కూడా..

కొండల హోయలు పర్యాటకుల మనసుల్ని దోచేస్తుండగా.. ఈ వరుసలు ఏడు వరకు ఉన్నాయి. వీటి మధ్య ఏకంగా 72 చెరువులు, 200 కుంటలు, 3 చెక్‌డ్యాంలు కనిపిస్తాయి. వీటి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నట్లుగా నిపుణులు చెప్పారు. వాటిని పరిరక్షించేందుకు ప్రభుత్వ తాజా ప్రకటన మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ జలాలతోనే స్థానికులు వ్యవసాయం చేస్తున్నారు.

250 జాతుల పక్షులు

ఇక్కడి అరుదైన జీవజాలం మరో ఆకర్షణ. వృక్షజాతులు కూడా చాలావరకు అరుదైనవే ఉన్నాయి. 250 పక్షి జాతులు ఇక్కడ కనిపిస్తున్నాయని సర్వేల్లో తేలింది. లాగర్‌ ఫాల్కన్‌, షహీన్‌ ఫాల్కన్‌, బోనెల్లిస్‌ ఈగల్‌, అలాగే ముంగిస, కొండచిలువ, దేవాంగ పక్షి జాతులూ ఉన్నాయని అధికారులు గుర్తుచేశారు.

నాగరికతకు అద్దంపట్టేలా..

కొండల్లో పలు చారిత్రక ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. పురాతన చేతిరాతలు కూడా కనిపిస్తున్నాయి. తమిళ బ్రాహ్మణులు, జైనుల ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. రాతికొండల మధ్యే చెక్కినట్లుగా ఉన్న ఆలయాలు ప్రత్యేకం. ఇవి 2,200 ఏళ్ల నాటివని సమాచారం.

నెరవేరిన పదకొండేళ్ల కల

అరిట్టాపట్టి పరిసర ప్రాంతాల్లో అరుదైన సంపద ఉందని, దీన్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని పర్యావరణ ప్రేమికులు 11 ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. తాజా ప్రకటనతో ఇది నెరవేరింది. చరిత్రకు ఈ ప్రాంతం సాక్ష్యంగా నిలవబోతోందని పర్యావరణ నిపుణులు, స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు. జాతీయ స్థాయిలో పర్యాటకులను కూడా ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. తద్వారా స్థానికులకు ఉపాధి పెరుగుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని