logo

చెన్నైలో మెగా జౌళి పార్కు

అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా జౌళి పార్కును నగరంలో ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. మామల్లపురంలో చేనేత మ్యూజియం, పలు నగరాల్లో ఎగుమతి కేంద్రాలు కూడా నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.

Published : 26 Nov 2022 00:24 IST

 మామల్లపురంలో చేనేత మ్యూజియం
ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడి

వీసీ ద్వారా ప్రసంగిస్తున్న స్టాలిన్‌ ‌

చెన్నై, న్యూస్‌టుడే: అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా జౌళి పార్కును నగరంలో ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. మామల్లపురంలో చేనేత మ్యూజియం, పలు నగరాల్లో ఎగుమతి కేంద్రాలు కూడా నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. ‘టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌’ పేరిట రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నగరంలో శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రతిరంగం అభివృద్ధి చెందాలని అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రభుత్వం సన్నాహాలను చేస్తోందన్నారు. అందులో పరిశ్రమల రంగం ముందంజలో ఉందని తెలిపారు. పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇలాంటి సదస్సులు అవసరమని తెలిపారు. ప్రభుత్వం రూ.2.50 కోట్ల రాయితీతో చిన్నస్థాయి జౌళి పార్కులను ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. జౌళిశాఖ కింద కొనసాగే 6 సహకార టైక్స్‌టైల్స్‌లలోని శాశ్వత సిబ్బందికి రూ.2,500 చొప్పున వేతన పెంపునకు జీవో విడుదల కానుందని తెలిపారు. ప్రత్యేక విద్యుత్తు ఫీడర్‌ లైన్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినట్టు, జౌళి విధానాలు రూపకల్పనకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. యంత్రాల కొనుగోళ్లకు రూ.29.34 కోట్ల వ్యయంతో కార్యాచరణ పథకం రూపొందిస్తున్నామని చెప్పారు. విరుదునగర్‌ జిల్లా కుమారలింగపురంలో 1,500 ఎకరాల్లో భారీ జౌళి పార్కు ఏర్పాటుకు సిప్కాట్‌ ద్వారా భూసమీకరణ జరిగిందని వివరించారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, అందులో కొత్తదనం చొప్పించాలని, ఉన్నత సాంకేతికతను ఉపయోగించాలనే విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. దేశంలోని జౌళి మిల్లుల్లో 55శాతం, మరమగ్గాల్లో 23శాతం రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని జౌళి రంగం 31 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ రంగం భవిష్యత్తు ‘టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌’పై ఆధారపడి ఉందని, అందుకే దానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా జౌళి నగరాన్ని చెన్నైలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మామల్లపురంలో రూ.30 కోట్ల వ్యయంతో చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రూ.10 కోట్లతో డిజైన్‌ అండ్‌ ఇంకుబేషన్‌ సెంటర్‌ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. రాష్ట్రంలోని జౌళి ఎగుమతులను పలురెట్లు పెంచడానికి కరూరు, తిరుప్పూరు, కాంచీపురం వంటి నగరాల్లో ఎక్స్‌పోర్ట్‌ హబ్‌లు ఏర్పాటు చేసే పనులను త్వరితగతిన చేపట్టినట్టు తెలిపారు. సదస్సులో మంత్రులు తంగం తెన్నరసు, అన్బరసన్‌, గాంధీ, చేనేత, టెక్స్‌టైల్స్‌, ఖాదీశాఖ ముఖ్యకార్యదర్శి ధర్మేంద్ర ప్రతాప్‌ యాదవ్‌, కేంద్ర చేనేత మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ రాజీవ్‌ సక్సేనా, టెక్స్‌టైల్స్‌ శాఖ కమిషనరు వళ్లలార్‌, సీఐఐ తమిళనాడు ఛైర్మన్‌ సత్యకం ఆర్య, వైస్‌ ఛైర్మన్‌ శంకర్‌ వానవరాయర్‌, డైరెక్టరు తులసిరాజ్‌, సీఐఐ తమిళనాడు జౌళి కమిటీ కన్వీనరు గోపీకుమార్‌, రిలయన్స్‌ సంస్థ పాలిస్టర్‌ విభాగం ఛైర్మన్‌ ఉదేశి, శివా టెక్స్‌ యాన్స్‌ సంస్థ ఎండీ సుందరరామన్‌ తదితరులు పాల్గొన్నారు.

రచయితకు శుభాకాంక్షలు

చెన్నై, న్యూస్‌టుడే: ‘కువెంపు రాష్ట్రీయ పురస్కార్‌’కు ఎంపికైన రచయిత ఇమైయానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్‌లో... ఈ పురస్కారం పొందడం సంతోషకరమని తెలిపారు. ద్రావిడ పార్టీ ప్రభావశీల రచయితల వరుసలో నడుస్తున్న ఆయన బాటలో మరిన్ని ప్రశంసాహారాలు వెల్లువెత్తాలని ఆకాంక్షించారు.

జైళ్లలో గదులు ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: జైళ్లలో నిర్మించిన గుర్తింపు పరేడ్‌ కోసం నిర్మించిన గదులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. 12 జిల్లా జైళ్లలో రూ.2.51 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. శుక్రవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి ఆరంభించారు. కార్యక్రమంలో మంత్రి రఘుపతి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీంద్ర రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

సీఎంకు నివేదికల సమర్పణ

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రణాళిక కమిషన్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు రెండు నివేదికలు సమర్పించింది. సచివాలయంలో సీఎంను కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ జయరంజన్‌ శుక్రవారం కలిశారు. ప్రభుత్వ సాధారణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ లబ్ధి, జిల్లాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలపై నివేదికలను అందించారు.

డీఎంకే విద్యార్థి విభాగంలో నియామకాలు

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకే విద్యార్థి విభాగం నిర్వాహకులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీవ్‌గాంధీ, కార్యదర్శిగా ఎమ్మెల్యే ఎళిలరసన్‌, సంయుక్త కార్యదర్శులుగా జెరాల్డ్‌, మోహన్‌, ఉపకార్యదర్శులుగా చోళరాజన్‌, తమిళరసన్‌, సెంథిల్‌కుమార్‌, అముదరసన్‌, ఆనంద్‌, పొన్‌రాజ్‌, గోకుల్‌, పూర్ణ సంగీత, వీరమణిలను నియమించినట్టు పార్టీ ప్రధానకార్యదర్శి దురైమురుగన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని