logo

మూడో థర్మల్‌ విద్యుత్తు విభాగం మార్చిలో ప్రారంభం

ఉత్తర చెన్నైలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణంకానున్న మూడో థర్మల్‌ పవర్‌ యూనిట్‌ 2023 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది.

Published : 26 Nov 2022 00:24 IST

ఉత్తర చెన్నైలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రం

వడపళని, న్యూస్‌టుడే: ఉత్తర చెన్నైలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణంకానున్న మూడో థర్మల్‌ పవర్‌ యూనిట్‌ 2023 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. జనవరిలో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే టాన్‌జెడ్కో ఆధ్వర్యంలో మొదటి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంగా ఉండనుంది. 2024 నుంచి సేవలందిస్తుంది. ఈ విభాగం 2019లోనే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా జాప్యమైంది. రూ.6,376 కోట్ల అంచనా వ్యయంతో యూనిట్‌ నిర్మాణం చేపట్టారు. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నిధులు సమకూరుస్తోంది. కాంట్రాక్టు పనులు బీహెచ్‌ఈఎల్‌, బీజీఆర్‌ సంస్థలకు అప్పగించారు. కూడంకుళంలోని మూడో యూనిట్‌ 2023 లేదా 2024లో ప్రారంభంకానుంది.  ఇక్కడి నుంచి 800 మెగావాట్ల కన్నా ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తికాదు. సౌర విద్యుత్తుతో సామర్థ్యాన్ని పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు టాన్‌జెడ్కో అధికారి ఒకరన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్తును మాత్రమే పొందగలమని, కనుక టాన్‌జెడ్కో థర్మల్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఆవిర్భవిస్తే ఈ విద్యుత్తు సరిపోదని, కావున సౌర లేదా పవనం ద్వారా విద్యుత్తు సమకూర్చుకోవాలని తెలిపారు. గృహ అవసరాలకు ఒడిశాలోని తల్చర్‌, మహానది నుంచి, ఇతర అవసరాలకు విదేశాల నుంచి ఓడల ద్వారా బొగ్గు ఎన్నూరు రేవుకు వస్తోందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని