logo

పదేళ్లలో పెరగనున్న విద్యుత్తు డిమాండు

రానున్న పదేళ్లలో రాష్ట్రానికి 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుంది. ‘సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ (సీఈఏ) విడుదల చేసిన విశ్లేషణాత్మక నివేదిక (అనలిటికల్‌ రిపోర్ట్‌)లో తమిళనాడుకు విద్యుత్తు అవసరం ఎక్కువ కానుందని పేర్కొంది.

Published : 27 Nov 2022 01:19 IST

విద్యుత్తు కేంద్రం

వడపళని, న్యూస్‌టుడే: రానున్న పదేళ్లలో రాష్ట్రానికి 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుంది. ‘సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ (సీఈఏ) విడుదల చేసిన విశ్లేషణాత్మక నివేదిక (అనలిటికల్‌ రిపోర్ట్‌)లో తమిళనాడుకు విద్యుత్తు అవసరం ఎక్కువ కానుందని పేర్కొంది.  2021-22లో 16,889 మెగావాట్ల మేరకు విద్యుత్తు డిమాండు ఉంది. దీన్ని ఆధారంగా వేసిన అంచనా మేరకు రానున్న పదేళ్లలో 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని నివేదికలో వెల్లడించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా డిమాండు పెరిగే అవకాశాలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి సీఈఏ విద్యుత్తు వినియోగం, అవసరాలపై ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. సర్వేలో  మధ్య తరహా, దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినియోగావసరాలపై అంచనా వేస్తోంది. తాజాగా 20వ సారి సీఈఏ బృందం రాష్ట్రంలోనూ సర్వే నిర్వహించింది. గతంలో చేపట్టిన సర్వే నివేదికను 2017 జనవరిలో విడుదల చేసింది. 2021-22లో ఉన్న విద్యుత్తు డిమాండుతో పోల్చుకుంటే 2031-32 నాటికి గరిష్ఠంగా 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఏర్పడనుంది. గృహాలకు వినియోగించే విద్యుత్తు 61,575 మిలియన్‌ యూనిట్లకు చేరుకోగలదు. ప్రస్తుతం 31,606 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం 34 శాతంగా ఉన్న డిమాండు పదేళ్ల తర్వాత 38 శాతానికి చేరుకోనుంది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 2021-22 కాలంలో 18 శాతం మేరకు డిమాండు కనిపించింది. ఇది కూడా 2031-32 నాటికి 19 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. 2031-32 నాటికి రాష్ట్రానికి 1,75,391 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉండొచ్చని భావిస్తోంది. గరిష్ఠ డిమాండు  26,662 మెగావాట్లుగా ఉండనుంది. ఇంధన విభాగం పేర్కొన్న మేరకు 2022-23లో 16,652.20 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండాలి. అయితే టాన్‌జెడ్కో 4,320 మెగావాట్ల సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి స్థాయి 6,972 మెగావాట్లుగానూ ఉంది. దీనిపై రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2030లోగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 వేల మెగావాట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు