logo

కార్తిక మహాదీపోత్సవాలకు శ్రీకారం నేడు

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు ఆదివారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. పది రోజులుపాటు వేడుకలు కొనసాగుతాయి.

Published : 27 Nov 2022 01:19 IST

అరుణాచలేశ్వరాలయంలో ఏర్పాట్లు పూర్తి
 పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తులు


చంద్రశేఖరస్వామి, ఉన్నాములై ఉత్సవమూర్తులు

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు ఆదివారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. పది రోజులుపాటు వేడుకలు కొనసాగుతాయి. అణ్ణామలైయ్యన్‌ పరమ పవిత్ర నివాస స్థానమైన తిరువణ్ణామలై క్షేత్రం ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ పట్టణం విల్లుపురం-కాట్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కిలోమీటర్ల దూరంలో నెలవైంది. చెన్నై నుంచి తిరువణ్ణామలై చేరడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ ఆలయంలో కార్తిక మాసంలో మహాదీపోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ఇక్కడ పర్వతమే అణ్ణాళ్‌ మలై.. అదే కాలక్రమంలో అణ్ణామలైగా మార్పు చెందింది. ఈ పుణ్యక్షేత్రంలోనే శివుడు అగ్నిరూపం దాల్చి ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి ఇంత కీర్తి. తమిళంలో గల ఒక మహిత సూక్తిననుసరించి తిరువారూర్‌లో జన్మిస్తే, కాశిలో మరణిస్తే, తిల్లైని (చిదంబరాన్ని) దర్శిస్తే, తిరువణ్ణామలైని తలిస్తే ముక్తి తథ్యం, మోక్షం ఖాయమని భక్తుల నమ్మకం. ప్రకృతి శోభతో అలరారే అణ్ణామలై పట్టణంలో ప్రవేశించినవారికి తొలుత 65 మీటర్ల ఎత్తున నిలిచిన రమణీయమైన రాజగోపురం కనువిందు చేస్తుంది. ఇది విజయనగర ప్రభువుల శివభక్తికి, లలిత కళాసక్తి ఉజ్వల నిర్మాణ శక్తికి దర్పణం పడుతుంది. ఆలయ ఆవరణలోని వెయ్యి స్తంభాల వైభవ మండపం నైరుతి మూలలో పాతాళ (భూగర్భ) లింగ ప్రతిష్ఠతమై ఉంది. మహాత్ముడైన రమణ మహర్షి చాలాకాలం కఠోర తపమాచరించి దివ్యజ్ఞానసిద్ధిని ఇక్కడే పొందారు. ఈ ఆలయం 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. కార్తిక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ఈ ఉత్సవాలు ప్రారంభమై భరణి నక్షత్రం రోజున ముగుస్తాయి. చివరిరోజు 2,668 అడుగుల కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు సమర్పణ జ్యోతులను వెలిగించే ఆచారం ఉంది.  


వాహన సేవల వివరాలు...

* ఆదివారం వేకువజామున 5.30 నుంచి 7 గంటలలోగా వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఉదయం పంచమూర్తులను వెండి వాహనంలో ఊరేగిస్తారు. రాత్రి వెండి అధికార నంది, హంస వాహనాలలో పంచమూర్తుల ఊరేగింపు ఉంటుంది.

* 28న ఉదయం బంగారు సూర్యప్రభ వాహనంపై చంద్రశేఖరస్వామి, రాత్రి పంచమూర్తులను వెండి ఇంద్ర విమానంలో ఊరేగిస్తారు.

* 29వ తేదీన ఉదయం భూత వాహనంపై చంద్రశేఖరస్వామి, రాత్రి పంచమూర్తులను సింహ వాహనం, వెండి హంస వాహనాలలో ఊరేగిస్తారు.

* 30న ఉదయం సర్ప వాహనంలో చంద్రశేఖరస్వామి, రాత్రి పంచమూర్తులను వెండి కామధేను, కర్పక వృక్ష వాహనాలలో ఊరేగిస్తారు.

* డిసెంబరు 1న ఉదయం అద్దాల వృషభ వాహనంలో చంద్రశేఖరస్వామి, రాత్రి వెండి పెద్ద వృషభ వాహనాలలో పంచమూర్తుల ఊరేగింపు ఉంటుంది.

* 2న ఉదయం గజ వాహనంపై చంద్రశేఖరస్వామిని, ఆ తర్వాత 63 నాయన్మారుల ఊరేగింపు జరుగుతుంది. ఆ రోజు రాత్రి వెండి రథం, వెండి విమానాలపై ఊరేగిస్తారు.

* 3న ఉదయం నుంచి రాత్రి వరకు పంచమూర్తుల రథోత్సవం ఉంటుంది.

* 4న ఉదయం అశ్వ వాహనంలో చంద్రశేఖరస్వామి, సాయంత్రం 4 గంటలకు బిచ్చాండవర్‌ ఉత్సవం, రాత్రి అశ్వవాహనంపై పంచమూర్తుల ఊరేగింపు జరుగుతుంది.

* 5న పురుష ముని వాహనంపై చంద్రశేఖరస్వామిని, రాత్రి పంచమూర్తులను కైలాస వాహనం, కామధేను వాహనాలలో ఊరేగిస్తారు.

* 6న వేకువజాము 4 గంటలకు భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు మహాకొండపై కార్తిక మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ రోజు రాత్రి బంగారు వృషభ వాహనాలలో పంచమూర్తుల ఊరేగింపు జరుగుతుంది.

ఆలయం

అయ్యన్‌గుంట

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు