logo

ఉచిత ప్రయాణంతో ఊరట!

‘మహిళలకు ఉచిత బస్సు టికెట్టుతో ప్రయాణాల సంఖ్య పెరిగింది. కుటుంబాలతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.

Updated : 28 Nov 2022 06:28 IST

మహిళలకు నెలకు రూ.వెయ్యికిపైగా ఆదా
ఎంటీసీ పథకంపై ప్రణాళికా సంఘం నివేదిక
ఈనాడు, చెన్నై

‘మహిళలకు ఉచిత బస్సు టికెట్టుతో ప్రయాణాల సంఖ్య పెరిగింది. కుటుంబాలతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. వారి రాకపోకలు పెరుగుతుండటంతో నగరంలో వ్యాపార కార్యకలాపాలు వృద్ధి చెందాయి. ఇది రాష్ట్రానికి మేలుచేస్తోంది’ అని ప్రభుత్వం పేర్కొంటోంది. తాజాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ‘జీరో టికెట్‌ బస్‌ ట్రావెల్‌ (జెడ్‌టీబీటీ)’ పై ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. ఉచిత ప్రయాణాలతో మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారని అందులో పేర్కొంది.

మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) లిమిటెడ్‌.. చెన్నైలో అతిపెద్ద రవాణా సంస్థ. 31 డిపోల ద్వారా 3,233 సర్వీసులను 608 మార్గాలలో రోజూ నడుపుతోంది. నిత్యం సగటున 29.35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకంగా మహిళలు అధికమైనట్లు ఎంటీసీ అధికారులు చెప్పారు. ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని జెడ్‌టీబీటీ పథకంగా పేర్కొంటున్నారు. ఈ పథకం పనితీరు, మహిళలకు లబ్ధిపై ప్రణాళికా సంఘం ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. కోయంబేడు-తిరువొత్తియూర్‌, తాంబరం-చెంగల్పట్టు, బ్రాడ్‌వే-కన్నగినగర్‌ మార్గాల్ని నమూనాగా తీసుకుని, మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి సర్వే చేసింది.

40 ఏళ్లలోపు వారే ఎక్కువ

చదువు, ఉద్యోగం, వ్యాపారం, కూలీ.. ఇలా పలు రంగాల మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న వారిలో 58.9 శాతం మంది 40 ఏళ్లలోపువారే. 13 శాతం మంది 55 ఏళ్లు దాటిన వారు. ఉద్యోగం చేసేవారు ఆర్థికంగా కొంతవరకు స్థిరంగా ఉంటున్నప్పటికీ.. చిరువ్యాపారులు, పనులు చేసుకునేవారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని అధికారులు వివరించారు. ప్రయాణికుల్లో మరోవైపు 70.8శాతంమంది హయ్యర్‌ సెకండరీ, అంతకు తక్కువ చదువులు చదివినవారుండగా.. 29.2 శాతంమంది యూజీ, పీజీ చదివినవారున్నారు. పెళ్లయిన మహిళలు 81.8శాతంమంది ఉండగా.. ప్రయాణికుల్లో 78.8శాతంమంది తమ పిల్లలతో కలిసి వెళ్తున్నారు.

ఎంతో ఉపయోగకరం

ఉద్యోగులు 27శాతం మంది వరకు ప్రయాణాలు చేస్తున్నట్లు నివేదికలో ఉంది. పరిశ్రమలు, గృహాల్లో పనిచేసేవారు 25.6 శాతంమంది, మిగిలినవారిలో వర్తకులు, రోజువారీ కూలీలున్నారు. వీరందరిలో.. నెలకు రూ.15 వేలకు మించి సంపాదిస్తున్నవారు 16 శాతం మంది మహిళలున్నారు. వీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రూ.8 వేల నుంచి రూ.15 వేల మధ్య సంపాదిస్తూ ఈ వసతిని పొందుతున్న వారు 42.9 శాతంమంది ఉన్నారు. రూ.5 వేలకన్నా తక్కువ సంపాదిస్తున్నవారు 23.4 శాతం మంది ఉన్నట్లు వివరించారు. నెలకు రూ.8 వేలలోపు మాత్రమే సంపాదించేవారు 41 శాతం మంది ప్రయాణాలు చేస్తున్నారు. దీన్నిబట్టి తక్కువ ఆదాయవర్గాలకు ఈ పథకం ఉపయోగపడుతోందని నివేదికలో తేలింది. పథకాన్ని వినియోగించుకుంటున్నవారిలో అత్యధికంగా 80.8 శాతం బలహీనవర్గాలు, పేదవారే ఉన్నారని తెలిపారు.

ఆదా ఎంతంటే...

ఉచిత ప్రయాణాలతో సగటు మహిళలకు డబ్బు ఆదా అవుతోందని ప్రణాళిక కమిషన్‌ వివరించింది. సగటున నెలకు రూ.858 ఆదా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రొఫెనల్స్‌ కానివారు నెలకు.. సగటున రూ.884 ఆదా చేస్తున్నారు. నాన్‌ ప్రొఫెషనల్స్‌లో.. సంస్థల్లో శుభ్రతా పనులు చూసే మహిళలు ఎక్కువగా రూ.1067ల లబ్ధి పొందుతున్నారు. వీధి వర్తక మహిళలు రూ.991, వివిధ సంస్థల్లో పనిచేసేవారు రూ.946 ఆదా చేస్తున్నారు. ఇలా మహిళలు నెలకు రూ.537 నుంచి రూ.1283 మధ్య లబ్ధి పొందుతున్నట్లు సర్వేలో తేలింది. వీరికి ఎంత లబ్ధి చేకూరిందో అంత నెలకు సంపాదిస్తున్నట్లేనని నివేదికలో తెలిపారు. మహిళలు సగటున నెలకు 50-51 ప్రయాణాలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీన్నిబట్టి నెల ఆదాయంలో సగటున 11.7శాతం ఆదా చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఆత్మవిశ్వాసం పెరిగింది

మహిళలు తమ ప్రయాణాల్లో కేవలం బస్సును మాత్రమే 69.1శాతం మంది వినియోగిస్తున్నారు. మిగిలినవారు బస్సుతో పాటు ఆటో, మెట్రో, ఇతరత్రా మార్గాల్ని అనుసరిస్తున్నారు. 9.6శాతంమంది బస్సుతోపాటు ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. 74శాతం మంది రోజుకు కనీసం రెండు ట్రిప్పులు ఎంటీసీలో తిరుగుతున్నారు. వారంలో కనీసం 6 నుంచి 7 రోజులు ప్రయాణిస్తున్నారు. తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని మహిళలు పేర్కొంటున్నట్లు నివేదికలో వెల్లడైంది. 91.8శాతం తమ ప్రయాణాలు సురక్షితంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రత్యేకించి సాయంత్రం వేళల్లో 77.2 శాతం మంది తాము సురక్షితగంగా వెళ్లి రాగలుగుతున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని