logo

సంగీతోత్సవాలకు సిద్ధమవుతున్న సభలు

మార్గళి సంగీతోత్సవాలకు చెన్నై మహానగరం, కళాకారులు సిద్ధమవుతున్నారు.

Published : 28 Nov 2022 01:18 IST

వేడుకలో పాల్గొన్న సంగీతాభిమానులు (పాతచిత్రం)

వడపళని, న్యూస్‌టుడే: మార్గళి సంగీతోత్సవాలకు చెన్నై మహానగరం, కళాకారులు సిద్ధమవుతున్నారు. ఏటా సంగీత కార్యక్రమాలు నిర్వహించే పలు సభలు రెండేళ్ల విరామానంతరం ఈ ఏడాది ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శనివారం భారతీయ విద్యాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి సుధా రఘునాథన్‌ తన గాత్ర మాధుర్యంతో సంగీతాభిమానులను అలరింపజేశారు. పలు సంగీత సభలు కార్యక్రమాలు నిర్వహించే ప్రాంగణాల్లో అభిమానులను ఆకర్షించే విధంగా కళాకారులతో కూడిన చిత్రలేఖనాలు ఏర్పాటు చేస్తున్నాయి. కేటరింగ్‌ సంస్థలు కొత్తరకం వంటలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. కళాకారులు కూడా ప్రత్యక్షంగా ఆహూతుల మధ్య కచేరీలు చేయడానికి ఉబలాటపడుతున్నారు. కళాక్షేత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో డిసెంబరు 30వ తేదీన అశ్విని భిదే-దేశ్‌పాండేతో జుగల్బందీలో పాల్గొంటున్నానని సుధా రఘునాథన్‌ అన్నారు. జనవరి 8వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో తాను 13 కచేరీల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
* ఈ నెల 25 నుంచి భారతీయ విద్యాభవన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 14 వరకు జరుగుతాయి. డిసెంబరు 15 నుంచి 31 వరకు నృత్య కార్యక్రమాలుంటాయి. ఆ తర్వాత జనవరి 1 నుంచి 15 వరకు కార్యక్రమాలుంటాయని సంస్థ డైరెక్టర్‌ కేఎన్‌ రామస్వామి చెప్పారు.
* జిక్‌ అకాడమీలో డిసెంబరు 15 నుంచి జనవరి 1 వరకు, నృత్యోత్సవాలు జనవరి 3 నుంచి 9 వరకు ఉంటాయని సంస్థ అధ్యక్షుడు ఎన్‌.మురళి అన్నారు. 2022తో పాటు సంగీత కళానిధి, సంగీత ఆచార్య, టీటీకే పురస్కారాలు కూడా ప్రదానం చేస్తామన్నారు.
* శ్రీ పార్థసారధి స్వామి సభలో రోజుకు ఆరు కార్యక్రమాల చొప్పున డిసెంబరు 16 నుంచి 18 రోజుల పాటు ఉంటాయని, ఈ ఏడాది ప్రత్యక్షంగానే నిర్వహిస్తున్నామని సభ కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి చెప్పారు.
* నారద గాన సభలో డిసెంబరు 15న ప్రారంభమవుతాయి. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎ.కన్యాకుమారి వయోలిన్‌ కచేరీ జరుగుతుంది. నృత్య కళాకారిణి సుధారాణి రఘుపతి, కర్ణాటక సంగీత విద్వాంసుడు త్రిసూరు వి.రామచంద్రన్‌, వయోలిన్‌ కళాకారిణి ఎ.కన్యాకుమారిలకు ‘నాద బ్రహ్మం’ పురస్కారాలందిస్తామని కార్యదర్శి కె.హరిశంకర్‌ పేర్కొన్నారు.
* ప్రముఖ వ్యాపారవేత్త, కళాకారుడు నల్లి కుప్పుస్వామి శెట్టి మాట్లాడుతూ.. ఈ ఏడాది కార్యక్రమాలు ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న సభలకు సమర్పకుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిందన్నారు. సభలు కచేరీల తేదీలను ఆలస్యంగా ప్రకటించడంతో విదేశాల నుంచి వచ్చే వారికి విమాన ఛార్జీలు కూడా పెరిగి, టిక్కెట్లు బుక్‌ చేసుకోవడంలో ఇబ్బందులుంటాయన్నారు.
* హోటళ్ల బుకింగులపై కూడా సందిగ్ధం నెలకొందని, సాధారణంగా డిసెంబరు సీజన్‌కి ముందుగా బుక్‌ అవుతాయని, ఎంతమంది విదేశాల నుంచి వస్తారో తెలియడం లేదని ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌ మేనేజరు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు