logo

నైపుణ్య శిక్షణ.. ఉపాధికి రక్షణ

చదువు పూర్తవగానే ఉపాధి పొందేలా యువతకు ప్రభుత్వం పలు అవకాశాల్ని కల్పించనుంది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Published : 29 Nov 2022 00:28 IST

సర్వే ప్రారంభించిన ప్రభుత్వం

ఉద్యోగార్థుల కోసం కార్యాచరణ

 ఈనాడు, చెన్నై

చదువు పూర్తవగానే ఉపాధి పొందేలా యువతకు ప్రభుత్వం పలు అవకాశాల్ని కల్పించనుంది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్లలో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయో అంచనాకు వస్తోంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ఎలాంటి ఉపాధి మార్గాలు అందుబాటులో ఉన్నాయో యువత తెలుసుకునేలా.. రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సర్వేను మొదలుపెడుతోంది. జిల్లాల్లో స్థానికంగా అందుబాటులో ఉండే వనరులు, ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉపాధికి డిమాండ్‌ ఉంది, 2025లోపు ఏ రంగాల్లో ఉద్యోగాలకు అవకాశముందనే కోణాలలో ఈ సర్వే కొనసాగనుంది. దీనికి తగ్గట్లు ఎలాంటి నైపుణ్యాలున్నవారికి ఈ అవకాశం వస్తుందనేదీ అంచనా వేయనుంది. ఇందుకోసం ఓ జాతీయస్థాయి ఏజెన్సీని ఎంపిక చేసింది. ఈ సర్వేకు ‘స్కిల్‌ గ్యాప్‌ అసెస్‌మెంట్‌ స్టడీ అండ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ తమిళనాడు’ అని పేరుపెట్టింది.


పేదల కోసం తపన..

శిక్షణలో కళాశాల విద్యార్థినులు

ప్రభుత్వం దృష్టికి మరో ఆసక్తికర విషయం వచ్చింది. 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక సుమారు 680 మంది ఎలాంటి ఉన్నత విద్యలో చేరలేదని, వీరి ఆచూకీ తెలియడం లేదని గుర్తించారు. వీరి భవితవ్యంపై ఆందోళన చెందిన విద్యాశాఖ వారి వివరాల్ని సేకరించింది. ఇందుకోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర పాఠశాల కమిటీ సభ్యుల సహకారం తీసుకున్నారు. ఇలాంటి పేద విద్యార్థులకు తిరిగి కళాశాలల్లో చేర్పించి ఉన్నత విద్య చదివించేలా, ప్రత్యేకంగా సర్టిఫికెట్‌ కోర్సులు చేయించేలా తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ (టీఎన్‌ఎస్‌డీసీ) నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్య చదివేందుకు వీరు ఆసక్తిగా లేనట్లు సర్వేలో తేలింది. చాలామంది ఏపీ, కర్ణాటక, తదితర రాష్ట్రాలకు పనులకోసం వలస వెళ్లినట్లుగా గుర్తించారు. ఉన్నత చదువులపై ఆసక్తి చూపకపోయినా.. కనీసం చేస్తున్న పనిలో మరింత నిష్ణాతులుగా మారే కోర్సుల్లోనైనా చేరాలని కబురుపెట్టారు. 3, 6 నెలల కోర్సుల్ని వీరికోసం సిద్ధం చేశారు. ఇతర ఖర్చుల్ని కూడా భరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనసు మార్చుకుంటే ఇప్పటికైనా ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేయవచ్చని అధికారులు ప్రకటించారు.


ఎంతమంది ఉన్నా..

ఈ సర్వేను ఇదివరకే వివిధ రంగాల నైపుణ్యాలు కలిగిఉన్న యువత, ఇకపై కోర్సులు చేయబోతున్నవారికి ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అధికారులు వెల్లడించారు. అలాంటి ఉపాధికోసం వేచిఉండే వారిలో ఎలాంటి రంగాల్లో, ఏ తరహా నైపుణ్యమున్నవారు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారనేదీ తేల్చనుంది. వారి స్థితిగతులను సులువుగా గుర్తించేలా లేబర్‌ మార్కెట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎంఐఎస్‌)ను తెస్తున్నారు. మహిళలకు ప్రత్యేక అవకాశాల వ్యవస్థని రూపొందిస్తున్నామని చెబుతున్నారు.


12 లక్షల మందికి పైగా..

నాన్‌ ముదల్వన్‌ పోర్టల్‌ ద్వారా ఈ ఏడాదికి 12.50లక్షల మందిని నమోదు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 12 లక్షల మంది విద్యార్థులు వివిధ నైపుణ్యాలు నేర్చుకునేందుకు నమోదు చేసుకున్నారు. సంస్థల తరఫున వీరికి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా కుదిరింది. చదువులు పూర్తవగానే.. ఈ యువతను ఉద్యోగాలకు సిద్ధంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. శిక్షణ ఇచ్చేందుకు 2 వేలకు పైగా సంస్థలు, 300కు పైగా కోర్సుల్ని సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా సంస్థలు తమ శిక్షకుల్ని కూడా ఎంపిక చేసుకున్నాయి. విద్యార్థుల్ని విడతలవారీగా నిష్ణాతుల్ని చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని