logo

పరిహారాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశం

నకిలీ పత్రాలను చూపిన వారికి ఇచ్చిన పరిహారం తిరిగి పొందకపోతే సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు హెచ్చరించింది.

Published : 29 Nov 2022 00:28 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలను చూపిన వారికి ఇచ్చిన పరిహారం తిరిగి పొందకపోతే సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు హెచ్చరించింది. చెన్నై-బెంగళూరు హైవే పథకం కోసం కాంచీపురం జిల్లా శ్రీ పెరంబుదూర్‌లో భూములు స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది నకిలీ పత్రాలు చూపి రూ. 20 కోట్ల వరకు పరిహారం పొందినట్లు పిటిషన్‌ దాఖలైంది. నిజమైన యజమానులకి పరిహారం అందించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ  ఉత్తర్వులను నెరవేర్చలేదని ధిక్కరణ కేసు దాఖలైంది. ఇది మళ్లీ సోమవారం విచారణకు వచ్చింది. అప్పుడు కాంచీపురం జిల్లా కలెక్టరు పొన్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి నర్మద, తహసీల్దారు మీనాలు హాజరయ్యారు. కలెక్టరు తరఫున హాజరైన న్యాయవాది... పరిహారం పంపిణీకి కలెక్టరుతో సంబంధం లేదని, జాతీయ రహదారుల చట్టం కింద భూములు స్వాధీనం చేసుకోవడం వంటి అన్ని అధికారాలు జిల్లా రెవెన్యూ అధికారికి ఉన్నట్లు తెలిపారు. అరెస్టు వారెంట్‌ జారీ అయిన రెవెన్యూ అధికారి నర్మద తరఫున సీనియర్‌ లాయరు ఇళంగో హాజరయ్యారు. సీబీసీఐడీ తరఫున న్యాయవాది... విచారణ జరుగుతోందని, ఇప్పటి వరకు రూ. 4 కోట్లు వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. అప్పుడు న్యాయమూర్తి.. నకిలీ పత్రాలు చూపి పరిహారం పొందిన విషయమై సీబీసీఐడీ చేస్తున్న దర్యాప్తులో సంతృప్తిలేదని తెలిపారు. అక్రమంగా  నగదు పొందిన వారి నుంచి తిరిగి తీసుకోవాలని పేర్కొంది. లేదంటే కేసులో సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇస్తామని, విచారణను 2వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని