logo

రాష్ట్రానికి పూర్వ వైభవం: రాబోతోంది స్టాలిన్‌

రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోందని, పాలన ఎలా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఎలా వ్యవరించకూడదు అనే దానికి గత అన్నాడీఎంకే ప్రభుత్వం, చక్కని పాలనకు నేటి డీఎంకే ప్రభుత్వం ఉదాహరణలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అన్నారు.

Published : 30 Nov 2022 00:59 IST

పలు పథకాల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం. చిత్రంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పన్నీర్‌సెల్వం, రఘుపతి, శివశంకర్‌ తదితరులు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోందని, పాలన ఎలా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఎలా వ్యవరించకూడదు అనే దానికి గత అన్నాడీఎంకే ప్రభుత్వం, చక్కని పాలనకు నేటి డీఎంకే ప్రభుత్వం ఉదాహరణలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అన్నారు. అరియలూరు జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ పాల్గొని రూ.30.26 కోట్ల వ్యయంతో చేపట్టిన 51 పథకాల పనులను ప్రారంభించారు. అదేవిధంగా రూ.1.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూడు పథక పనులకు శంకుస్థాపన చేశారు. 27,070 మంది లబ్ధిదారులకు రూ.52 కోట్ల వ్యయంతో సంక్షేమ సాయం అందజేశారు. ముందుగా మాళిగైమేడులో పురాతన తవ్వకాల్లో బయటపడిన వస్తువుల ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోటీపడి పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు. ఎగుమతిలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉందన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనిస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉందన్నారు. పాఠశాల విద్యలో పలు అవార్డులు దక్కాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి లబ్ధి చేకూర్చామని తెలిపారు. పదిహేను నెలల్లో ఒకటిన్నర లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవల రిజర్వు బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఎక్కువ పరిశ్రమలు ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో తమిళనాడు ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనం చేసేందుకు కొందరు ప్రణాళిక చేస్తున్నారన్నారు. తమిళనాడు కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

మృతుల కుటుంబాలకు సాయం ప్రకటన

చెన్నై, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా కన్నగపట్టు కొలనులో ప్రమాదవశాత్తు మునిగి విద్యార్థులు మురుగేశ్‌, ఉదయకుమార్‌, విజయ్‌ మరణించడంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున సీఎం జనరల్‌ ఫండ్‌ నుంచి అందజేయాలని అధికారులను ఆదేశించారు.

జాలర్లను విడుదలకు కేంద్రానికి లేఖ

చెన్నై, న్యూస్‌టుడే: శ్రీలంక జైళ్లలో ఉన్న రాష్ట్రానికి చెందిన 23 మంది జాలర్లను విడిపించడానికి వెంటనే చర్యలు చేపట్టాలంటూ కేంద్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. 5 ఫిషింగ్‌ బోట్లు సహా 23 మంది తమిళులను శ్రీలంక నావికా దళం సోమవారం అరెస్టు చేసిందన్నారు. ఈ ఏడాదిలో 221 మంది తమిళ జాలర్లను అరెస్టు చేశారని పేర్కొన్నారు. 105 బోట్లు శ్రీలంక ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. శ్రీలంక చెరలోని జాలర్లను, బోట్లను వెంటనే విడిపించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని