logo

గవర్నర్‌ను తొలగించాలని హైకోర్టులో పిటిషన్‌

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది.

Published : 30 Nov 2022 00:59 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. కాంచీపురం జిల్లా తందై పెరియార్‌ ద్రావిడ కళగ కార్యదర్శి కన్నదాసన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో... గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి గతేడాది సెప్టెంబరు 18న బాధ్యతలు స్వీకరించారని, అప్పటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారన్నారు. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొని సనాతన ధర్మం గురించి, ద్రావిడ ఉద్యమ విధానాలకు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పుదుచ్చేరిలోని ఆరోవిల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారని పేర్కొన్నారు. 1988 ఆరోవిల్‌ ఫౌండేషన్‌ చట్టం ప్రకారం అధ్యక్షునికి వేతనం, పింఛను లభిస్తుందని, రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ఎలాంటి లాభదాయకమైన బాధ్యత వహించకూడదని తెలిపారు. కావున ఆయన్ను గవర్నర్‌ పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ పిటిషన్‌ త్వరలో విచారణకు రానుంది.

‘మాజీ మంత్రి పిటిషన్‌పై ఐటీశాఖ సమాధానమివ్వాలి’

ప్యారిస్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి విజయభాస్కర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదాయపన్నుశాఖ జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 2017లో ఆర్కేనగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లకు లంచం ఇచ్చినట్లు విజయభాస్కర్‌పై ఫిర్యాదు అందింది. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయనకు చెందిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా 2011-12, 2918-19 మధ్య రూ.206.42 కోట్ల పన్ను బకాయిలు ఉన్నందున వాటిని రాబట్టేందుకు పుదుక్కోట్టైలో ఉన్న ఆయన స్థలాలను, మూడు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఈ చర్యలను సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో విజయభాస్కర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాల నుంచే ఎమ్మెల్యే వేతనం, ప్రభుత్వ నిధులు పొందుతున్నానని, వాటిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ అనిత సుమంత్‌ ఎదుట విచారణకు వచ్చింది. విచారించిన న్యాయమూర్తి.. పిటిషన్‌పై ఆదాయపన్నుశాఖ సమాధానమివ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

‘కలైమామణి’ గ్రహీతల పేర్లు మళ్లీ పరిశీలిస్తాం.. ప్రభుత్వం వివరణ

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 2019-20 ఏడాదికిగాను కలైమామణి అవార్డులను ప్రదానం గురించి మళ్లీ ఓసారి పరిశీలిస్తామని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ప్రభుత్వం తెలిపింది. తిరునెల్వేలికి చెందిన సముద్రం అనే వ్యక్తి మదురై ధర్మాసనంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో... ప్రభుత్వ ఏటా కళాకారులకు అందజేస్తున్న కలైమామణి పురస్కారానికి ఇప్పటివరకు వయోపరిమితి, అర్హతను రూపొందించలేదన్నారు. చెన్నైలో 2019-2020 ఏడాదికిగాను 2021 ఫిబ్రవరిలో అర్హత లేని వారికి ప్రదానం చేశారని పేర్కొన్నారు. ధ్రువపత్రంపై కౌన్సిల్‌ సభ్యుడు, కార్యదర్శి సంతకం లేకుండా అందజేస్తున్నారని, అనర్హులకు ఇచ్చిన అవార్డులను వెనక్కి తీసుకోవాలని అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ మహదేవన్‌, జస్టిస్‌ సత్యనారాయణ ప్రసాద్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అప్పుడు ప్రభుత్వం తరఫున 2019-20 ఏడాదికిగాను ప్రదానం చేసిన కలైమామణి పురస్కారాలను పరిశీలిస్తామని తెలిపారు. దీంతో తీర్పుని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

‘పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరగా విచారించాలి’

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 1,635 అవినీతి కేసులను త్వరగా పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ, కుంభకోణం డివిజన్‌లో కండక్టర్‌గా పని చేసిన అన్నాదురై 2018లో పదవీ విరమణ పొందారు. ఇప్పటివరకు తనకు రావాల్సిన పింఛను ప్రయోజనాలు అందలేదని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారించిన జస్టిస్‌ సుబ్రమణియం... రాష్ట్ర వ్యాప్తంగా 1983 నుంచి 2021 వరకు పలు కోర్టుల్లో 1,635 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, విచారణ ఆలస్యమైతే నిందితులు తప్పించుకునే వీలుందని, అనవసరంగా కేసులను వాయిదా వేయకుండా త్వరగా విచారించాలని కింది కోర్టు న్యాయమూర్తులకు ఆదేశించారు. కండక్టర్‌ కేసులో పిటిషన్‌దారుడికి కొన్ని ప్రయోజనాలు అందించి, కేసు పూర్తయిన తరువాత మిగిలిన వాటిని అందజేయాలని తీర్పునిచ్చారు.

ఎంపీ రాజాకు సమన్లు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అక్రమ ఆస్తుల కేసులో డీఎంకే ఎంపీ రాజా కోర్టులో హాజరవ్వాలని చెన్నై ప్రత్యేక కోర్టు సమన్లు పంపింది. ఎంపీ రాజా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2015లో సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతరం దిల్లీ, చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, పెరంబలూరు తదితర చోట్ల సోదాలు చేపట్టింది. ఏడేళ్ల విచారణ తరువాత రాజా, ఆయన భార్య పరమేశ్వరి, బంధువు పరమేశ్‌కుమార్‌, స్నేహితుడు కృష్ణమూర్తి తదితరులపై గత నెల చెన్నై సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలైంది. ఆదాయానికి మించి 579 శాతం అదనంగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలిపింది. ఈ కేసుని చెన్నై ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాజా, కృష్ణమూర్తి తదితరులు నేరుగా హాజరవ్వాలని సమన్లు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చి, జనవరి 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని