అతివలకు అనువైన మార్గాలు!
మహిళలు తిరిగేందుకు చెన్నై దారులు ఎంత సురక్షితం? పలానా దారి మంచిదా కాదా, వెళ్తే తగిన భద్రత ఉంటుందా? లేదా? ఇలా మహిళలు, యువతుల్లో ఎన్నో సందేహాలు.
స్త్రీలు వెళ్లేందుకు సురక్షితంగా నగర దారులు
పకడ్బందీ ఏర్పాట్లకు జీసీసీ ప్రతిపాదనలు
అధునాతన సాంకేతికత వినియోగం
ఈనాడు-చెన్నై
మహిళలు తిరిగేందుకు చెన్నై దారులు ఎంత సురక్షితం? పలానా దారి మంచిదా కాదా, వెళ్తే తగిన భద్రత ఉంటుందా? లేదా? ఇలా మహిళలు, యువతుల్లో ఎన్నో సందేహాలు. వీటిని నివృత్తి చేసేలా నగరంలోని చాలా మార్గాల్ని అత్యంత సురక్షితంగా మార్చే ప్రాజెక్టును గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తీసుకొస్తోంది.
చెన్నై నగరంలో ఇప్పటికీ కొన్ని మార్గాలు మహిళల రాకపోకలకు అనువుగా లేవు. ఈ విషయాన్ని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక మార్పులు తెస్తూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓ స్టార్టప్‌తో కలిసి మహిళలకు అనువుగా రోడ్లను మార్చేలా ప్రాజెక్టు తీసుకొస్తోంది. వారికి సురక్షిత దారుల్ని కానుకగా ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో ఆ స్టార్టప్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్ని అమల్లోకి తెస్తోంది.
యాప్‌లో సమగ్ర సమాచారం
చెన్నైలో ఏ మార్గాన్ని చూసినా.. అందులోని లోపాలు స్పష్టంగా కనిపించేలా ఓ యాప్‌ను తయారుచేశారు. క్షేత్రస్థాయి పరిశీలనలు, ఇతర డేటా సేకరణ సాంకేతికతను మ్యాపింగ్‌కు అనుసంధానించి అధికారులకు ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నారు. నగరంలో ఏ రోడ్డును ఆ మ్యాప్‌లో చూసినా.. మహిళల రాకపోకలకు తగ్గట్లు వెలుతురు ఎలా ఉంది, విద్యుద్దీపాల సౌకర్యాలు ఎలా ఉన్నాయి, నిర్ణీత సమయం దాకా ప్రజా రవాణా ఉందా? లేదా? నడకబాటల పరిస్థితేంటి, ఆయా మార్గాల్లో పోలీసు భద్రత ఏ విధంగా ఉంది.. ఇలాంటి సమగ్ర సమాచారం వివిధ శాఖల ఉన్నతాధికారులకు తెలిసేలా వివరాల్ని అందులో పొందుపరుస్తున్నారు.
ఎప్పటికప్పుడు పనులు
స్టార్టప్ సంస్థ ఇచ్చిన సాంకేతికత సమాచారాన్ని, వారిచ్చే నివేదికల్ని అనుసరించి.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకుని అధికారులు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు దారుల్ని ఎంపికచేసే పనిలో జీసీసీ జోన్లలోని అధికారులున్నారు. వీటిపై పాలకమండలిలో ఇప్పటికే చర్చ జరిగింది. పనులు వెంటనే జరిగేలా వారినుంచి యంత్రాంగానికి ఆదేశాలు కూడా వెళ్లాయి.
రాత్రివేళ సైకిల్‌పై వీధుల్లో తిరుగుతూ పరిశీలిస్తున్న జీసీసీ మేయర్ ప్రియ (పాతచిత్రం)
నడకదారులే కాస్త ఇబ్బంది
ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన స్టార్టప్ గతేడాది పలు సాంకేతికతలను వినియోగించి నగరంలో సర్వేలు చేసింది. తండియార్‌పేటలో పాఠశాలలు, కళాశాలలున్న మార్గాల్లో ఆడపిల్లలకు అనువుగా ఆయా మార్గాలు ఉన్నాయా? లేవా? అనేది ఆడిట్ నిర్వహించారు. అక్కడ 60 శాతం దారులు ప్రజలు తిరిగేందుకు బాగున్నాయని, 85 శాతం ప్రజారవాణా అందుబాటులో ఉందని, 91 శాతం దారుల్లో వెలుతురు బాగుందని నివేదిక ఇచ్చారు. కానీ నడకమార్గాలు మాత్రం బాగా ఇబ్బందిగా ఉన్నట్లు నివేదికలో తెలిపారు. ఇదే తరహా సర్వేను సెమ్మంచ్చేరిలోనూ నిర్వహించారు. ఇలా బయటపడిన లోపాల్ని కార్పొరేషన్‌కు నివేదిక ఇచ్చి.. అక్కడ పరిష్కారమయ్యేలా చూస్తున్నారు. పనులు పూర్తయ్యాక ఆయా మార్గాలు సురక్షితమని ప్రకటిస్తారు.
సింగార చెన్నై లక్ష్యంగా..
‘సింగార చెన్నై 2.0’ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చేందుకు పలు ప్రతిపాదనలు చేసింది. 10 జోన్లలో పెద్దఎత్తున పార్కులు, క్రీడా మైదానాలు నిర్మించాలని పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇందులో మహిళలకు ప్రత్యేక స్థానాన్నీ ఇవ్వనున్నారు. రూ.50 కోట్లతో 150 పార్కులు, 50 మైదానాలు వచ్చేలా అంచనాలు వేస్తున్నారు. దీనికి సబంధించి ఇదివరకే ప్రతిపాదనల్ని తమిళనాడు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్‌ఐడీసీవో)కు జీసీసీ అధికారులు సమర్పించారు. మొదటి విడతలో జోన్ 1-4, 7-9, 10, 13, 14లో 45 పార్కులు, 13 మైదానాల్ని ఏర్పాటుచేయనున్నారు.
‘నిర్భయ’ ప్రాజెక్టు జోరు
నిర్భయ పథకం కింద చెన్నైకి ఇదివరకే రూ.425 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. పాఠశాలల్లో భద్రత, పరిశుభ్రత, వివిధ ప్రాంతాల్లో విద్యుద్దీపాల కోసం, దివ్యాంగులకు షెల్టర్లు, మొబైల్ మరుగుదొడ్లు, పాతవాటికి మరమ్మతులు, పాఠశాలల్లో క్రీడల వృద్ధి, విద్యుద్దీపాల్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నిర్వహించడం, ప్రత్యేకించి జెండర్‌ల్యాబ్ ఏర్పాటు.. ఇలా పలురకాల పనులకోసం నిధులు ఇచ్చారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తవగా మరికొన్ని చివరిదశకు వస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్ హాఫ్‌శారీ.. టీమ్‌తో రాశీఖన్నా!
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు
-
Movies News
Natti Kumar: కౌన్సిల్ ఒక్కటే ఉండాలి.. ‘దాసరి’పై సినిమా తీయబోతున్నాం.. నట్టి కుమార్