logo

సిద్ధాంతాలు, విజయాలే డీఎంకే ఆయుధాలు: స్టాలిన్‌

సిద్ధాంతాలు, విజయాలే డీఎంకే ఆయుధాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు.

Published : 01 Dec 2022 00:45 IST

చెన్నై, న్యూస్‌టుడే: సిద్ధాంతాలు, విజయాలే డీఎంకే ఆయుధాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఆయన రాసిన లేఖలో... రాష్ట్ర స్థాయిని పెంచడానికి, హక్కులు తిరిగి పొందేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని తెలిపారు. ఎవరినీ వదలకుండా అన్నివర్గాల ప్రజల జీవన స్థాయిని కచ్చితంగా పెంచాలంటే అన్ని జిల్లాలకు ఏకీకృత అభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు. దానికోసం ఈ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. ఆదర్శంగా కొనసాగుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతిభద్రతల సమస్యలు, గందరగోళాలు సష్టించడానికి రాజకీయ ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత డీఎంకేలోని ప్రతి కార్యకర్తకు ఉందన్నారు. ప్రత్యర్థుల ఆరోపణాస్త్రాలు తిప్పికొట్టేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోని అన్ని విభాగాలకు నిర్వాహకులను వారి అర్హతలను పరిశీలించి నియమించినట్టు తెలిపారు. కష్టించేవారికి పదవులు రాకుంటే తర్వాతి అవకాశాల్లో వారి నిరీక్షణకు తప్పకుండా ఫలితం లభిస్తుందని తెలిపారు. వేల సంవత్సరాలుగా ఆర్య-ద్రావిడ సంస్కృతి యుద్ధంలో ప్రజాస్వామ్య విధానంలో డీఎంకే పోరాడుతోందని పేర్కొన్నారు. జాతి, భాష, రాష్ట్ర హక్కులపై ప్రకటించిన యుద్ధాన్ని నిజాయతీగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. అందులో విజయం కూడా సాధించామని పేర్కొన్నారు. సిద్ధాంతాలు, విజయాలే తమకు కత్తి, డాలుగా తెలిపారు.

అన్బళగన్‌ విద్యా ప్రాంగణంగా డీపీఐ

చెన్నై, న్యూస్‌టుడే: డీపీఐ ప్రాంగణాన్ని ఇకపై అన్బళగన్‌ విద్యా ప్రాంగణంగా పిలువనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉత్తమ విద్యావేత్త అన్బళగన్‌ను కీర్తించేలా ఆయన శతజయంతి వేడుకలు పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ తరఫున రూ.7,500 కోట్ల వ్యయంతో పాఠశాల అభివృద్ధి పథకాన్ని ప్రకటించినట్టు తెలిపారు. దాని కోసం ప్రస్తుత ఏడాది రూ.1,400 కోట్లను కేటాయంచినట్టు పేర్కొన్నారు. అన్బళగన్‌ శతజయంతిని స్మరించేలా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కొనసాగే డీపీఐ ప్రాంగణంలో ఆయనకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రాంగణాన్ని ‘పేరాసిరియర్‌ అన్బళగన్‌ కల్వి వళాగం’ (ఆచార్యులు అన్బళగన్‌ విద్యా ప్రాంగణం)గా పిలువనున్నట్టు తెలిపారు. బోధన, ఉపాధ్యాయ నైపుణ్యాభివృద్ధి, నాయకత్వం, విద్యార్థి అభివృద్ధి తదితర బహుముఖ అభివృద్ధిని ఆవిష్కరించే ఉత్తమ పాఠశాలలకు అన్బళగన్‌ పేరిట పురస్కారం కూడా అందించనున్నట్టు పేర్కొన్నారు..


క్రికెట్ విజయోత్సవాలకు ఆహ్వానం

సీఎంకు జ్ఞాపిక అందజేస్తున్న కృష్ణమాచారి శ్రీకాంత్‌

చెన్నై, న్యూస్‌టుడే: భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌ను తొలిసారి గెలిచి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే సంబరాలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆహ్వానం అందింది. భారత మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. భారత క్రికెట్జట్టు ప్రపంచ కప్‌ను 1983లో గెలిచి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే వేడుకలకు స్టాలిన్‌ను ఆహ్వానించారు. వేడుకను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను ముఖ్యమంత్రికి అందజేశారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు