logo

పరిశ్రమల్లో అగ్రస్థానం

నివేదిక ప్రకారం దేశం మొత్తమ్మీద రాష్ట్రంలోనే 15.7 శాతం పరిశ్రమలు ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ పారిశ్రామిక విప్లవం పెద్దఎత్తున కొనసాగుతున్నట్లుగా తెలిపారు.

Published : 02 Dec 2022 00:02 IST

జాతీయస్థాయిలో సత్తా చాటిన రాష్ట్రం
తాజా నివేదికలో ఆర్‌బీఐ వెల్లడి

కృష్ణగిరిలోని పారిశ్రామిక వాడ నమూనా

రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం విస్తరిస్తోంది. ఇది యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సైతం రాష్ట్రంలోని వ్యవస్థలపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకన్నా భిన్నంగా పెట్టుబడుల్ని కూడా ఆకర్షిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని పరిశ్రమల స్థితిగతులపై ఆర్‌బీఐ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అందులో తమిళనాడుకు సంబంధించిన ఆసక్తికర అంశాలున్నాయి.

ఈనాడు, చెన్నై

నివేదిక ప్రకారం దేశం మొత్తమ్మీద రాష్ట్రంలోనే 15.7 శాతం పరిశ్రమలు ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ పారిశ్రామిక విప్లవం పెద్దఎత్తున కొనసాగుతున్నట్లుగా తెలిపారు. తద్వారా జాతీయస్థాయిలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రం తర్వాత గుజరాత్‌లో 11.5శాతం, మహారాష్ట్రలో 10.3శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 6.8శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.5శాతం పరిశ్రమలున్నట్లు వెల్లడించారు. దీంతో దేశంలోని అందరి చూపూ మరోసారి తమిళనాడువైపు పడింది.

* భారీగా పెరుగుదల

గతం నుంచీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పరిశ్రమలకు పెద్దపీట వేశాయి. తాజా డీఎంకే ప్రభుత్వ బడ్జెట్‌లోనూ ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. దీనికి తగ్గట్లే ప్రతిపాదనలు పెట్టడం, విదేశీ పర్యటనలు చేసి అక్కడి ప్రభుత్వాల్ని, ఆయా దేశాల సంస్థల్ని తమిళనాడుకు ఆహ్వానించడం తరచూ కనిపిస్తోంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2020-21లో తమిళనాడులో 38,837 పరిశ్రమలున్నట్లు రికార్డుల ద్వారా తెలిసిందని వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంకన్నా 45 శాతం ఇవి పెరిగినట్లుగా పేర్కొంది.

*విధానాలు ఆదర్శం

దక్షిణాది రాష్ట్రాల పారిశ్రామిక విధానాలే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందులోనూ ఒక్క తమిళనాడు నుంచి పెద్ద ఆశలే ఉన్నాయి. తాజాగా ఆర్‌బీఐ నివేదికలో ఓ అంశం ఆసక్తికరంగా మారింది. పెట్టుబడుల పరంగా దేశంలో 2030కి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థను తెచ్చే సూచనలున్నాయని వెల్లడించింది. ఇందులో ఒక్క తమిళనాడులోనే ఒకటిలో 5వ వంతు ఉంటుందని అంచనాలు వేసింది. ఇది ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేసినట్లుగానూ ఉన్నట్లు కనిపిస్తోంది.

* సంస్కరణలే కీలకం

తమిళనాడును అగ్రస్థానం నిలుపుతున్నది పకడ్బందీ ప్రణాళికలేనని స్పష్టమవుతోంది. పరిశ్రమలు, పెద్ద సంస్థల్ని ఆకర్షించేందుకు తగిన వనరుల్ని సమకూర్చడం, వారికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ఇక్కడి ప్రభుత్వం దృష్టిపెట్టింది. పరిశ్రమల అనుమతుల కోసం తమిళనాడులో మంచి వ్యవస్థ ఉందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రత్యేకించి ఏకగవాక్ష విధానాన్ని తీసుకురావడం, అది ప్రభావమంతంగా పనిచేయడం శుభపరిణామమని చెప్పింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన 24 గంటల విద్యుత్తును అందించడం, పరిశ్రమల్ని ఆకర్షించే రాయితీల కల్పన  ప్రత్యేకమని తెలిపింది.


కార్మికులూ ఎక్కువే..

దేశంలో కీలకంగా మారిన ఈ రాష్ట్రంలో ఎక్కువభాగం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఉన్నాయి. ఆర్‌బీఐ కూడా ఇదే విషయాన్నే తెలిపింది. దీంతో కార్మికుల అవసరం అవసరం బాగా పెరిగిందని వివరించింది. దీనికి తగ్గట్లు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసుకున్నారని తెలిపింది. మానవ వనరులపరంగా రాష్ట్రం చాలా మందుందని వెల్లడించింది. ఏకంగా 22.09 లక్షల మంది కార్మికులు వివిధ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నట్లు నివేదికలో తెలిపింది.


భవిష్యత్తు ఆశలు

పారిశ్రామికాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం

* ప్రత్యేకించి రాష్ట్రం ఆటోమొబైల్స్‌ తయారీ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రంగంలో భారీ పెట్టుబడులు రావొచ్చని ఆర్‌బీఐ అధికారులు చెప్పారు.* దీని తర్వాత ఎలక్ట్రానిక్స్‌ రంగం పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా వృద్ధి చెందుతోందని వెల్లడించారు. ఈ రంగంలో పాట్రగాన్‌, యాపిల్‌, ఫాక్స్‌కాన్‌ లాంటి మొబైల్‌ తయారీ పరిశ్రమలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.* రసాయనాలు, చర్మ, ఇతర పరిశ్రమలు 2023 ఆర్థిక సంవత్సరానికి 320.3 బిలియన్‌ డాలర్ల జీడీపీకి చేరుకునే అవకాశముందని చెప్పారు. ఈ రంగాలు రాబోయే 8 ఏళ్లలో 40శాతంపైగా పెట్టుబడుల్ని సాధించే దిశగా వెళ్తున్నాయని వివరించారు.* కృత్రిమ మేధ, యంత్రాలు తయారీ సాంకేతికతల్లో తమిళనాడు ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 8 ఏళ్లలో ఈ రంగాల విస్తరణ మరింత మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని