logo

తగ్గిన ప్రసూతి మరణాలు!

రాష్ట్రంలో సురక్షిత కాన్పుల సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్‌) ప్రత్యేక బులెటిన్‌లో ఈ విషయం వెల్లడైంది.

Published : 03 Dec 2022 00:31 IST

కేంద్ర ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడి

ఈనాడు, చెన్నై

రాష్ట్రంలో సురక్షిత కాన్పుల సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్‌) ప్రత్యేక బులెటిన్‌లో ఈ విషయం వెల్లడైంది. 2020 వరకు గణాంకాల ప్రకారం.. రాష్ట్రలో కాన్పులు సురక్షితంగానే అవుతున్నాయని, మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని నివేదిక తెలిపింది.


 

తంతో పోల్చితే తమిళనాడులో ప్రసూతి మరణాల్ని తగ్గించేందుకు గట్టి చర్యలే చేపడుతున్నారు. ఆడిట్‌ విధానాన్ని మరింత బలీయం చేశారు. ప్రస్తుతం 4 స్థాయుల్లో లోతుగా పరిశీలన చేస్తున్నారు. కమ్యూనిటీస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని చూడటం, ఆసుపత్రుల్లో కాన్పులపై పర్యవేక్షణ, కలెక్టర్‌ స్థాయిలో మరోసారి ఆడిట్‌, రాష్ట్రవ్యాప్తంగా నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో లోతైన పరిశీలన.. ఇలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దీంతో గతంతో పోల్చితే మరణాల సంఖ్యను కాస్త తగ్గించినట్లుగా నివేదికలో వెల్లడైంది.

మార్పు ఎంతంటే..

ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్‌) 2017-19 మధ్య ప్రతి లక్షమందిలో 58 మంది చనిపోతున్నట్లు వెల్లడించారు. ఇది 2018-20కి వచ్చేసరికి 54కు తగ్గింది. ప్రభుత్వ చర్యలతోనే ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు. తర్వాతి రెండేళ్లు మరింత మార్పు సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

చర్యలు మొదలు

రక్తస్రావ చికిత్సకు సక్షన్‌ కాన్యులా పరికరాల్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం వైద్య నిపుణులను నియమిస్తున్నారు. జిల్లా, వైద్య కళాశాల ఆసుపత్రుల్లో ప్రస్తుతం వీరు ఉన్నారు. కిందిస్థాయి ఆసుపత్రుల్లోని వైద్యులకు వీరితో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని అధికారులు తెలిపారు. ప్రసూతి సమయంలో రక్తపోటు సమస్య రాకుండా డిజిటల్‌ పరికరాల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలుత 11 జిల్లాల్లో తెస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గర్భిణులకు పౌష్ఠికాహారంతో పాటు తరచూ బీపీ పరీక్షల్ని ఇక్కడే నిర్వహించేలా శిక్షణ ఇస్తున్నారు.

ఇప్పటికీ యూట్యూబ్‌ చూసి కాన్పులు చేసుకోవడాలు, సమయానికి ఆసుపత్రికి చేరడంలో ఆలస్యమవడం లాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్యసంఘాలు కోరుతున్నారు. కాన్పు కష్టమైందిగా భావించినప్పుడు పీహెచ్‌సీ స్థాయిలో చేయడం ఆపాలని, పై ఆసుపత్రికి రెఫర్‌ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాలు అత్యవసరంగా అంబులెన్సుల్లో పంపడం కూడా కష్టమని గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు అత్యవసర, నవజాత శిశుసంరక్షణ కేంద్రాల్ని వీలైనంత ఎక్కువ సంఖ్యలో తెరవాలని చెబుతున్నారు.


కారణాలివీ..

ప్రసూతి మరణాలు ఎలా సంభవిస్తున్నాయనే కోణంలో కొన్ని పరిశీలనలు జరిగాయి. నిపుణులు వెల్లడించిన మేరకు.. ప్రసవానంతరం తీవ్ర రక్తస్రావం అవడంలో పలు మరణాలు జరిగాయని తేలింది. కాన్పు సమయంలో గర్భిణులకు రక్తపోటు రావడం కూడా మరో కారణంగా పేర్కొన్నారు. గతంలో ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో తమిళనాడులో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నట్లుగా ఉంది. తాజా గణాంకాల్ని బట్టి.. 2020-21లో సిజేరియన్లు 43శాతం ఉన్నాయి. 2021-22కు 34 శాతానికి తగ్గినట్లుగా అధికారులు వెల్లడించారు. గతంతో పోల్చితే 9 శాతం తగ్గాయని తేలింది. వీటిపై మరింత ఆడిట్‌ జరగాల్సిన అవసరముందని నిపుణులు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులతో పోల్చితే ప్రైవేటు వాటిల్లోనే సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్ర నివేదిక వెల్లడిస్తోంది.


కేరళ ఆదర్శం

కేరళలో కాన్పుల ప్రక్రియలో చక్కటి పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. లక్ష మందిలో అక్కడ 19మంది మాత్రమే ప్రసవ సమయంలో చనిపోతున్నారు. ఇది దేశంలోనే అతి తక్కువ ప్రసూతి మరణాల రేటు. గతం నుంచీ కేరళ ఇదే ఒరవడిని కొనసాగిస్తోంది. తమిళనాడుతో పోల్చితే 3 రెట్లు తక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు