logo

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రతిజ్ఞ చేద్దామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

Published : 03 Dec 2022 00:31 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌  

వీసీ ద్వారా ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్న సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రతిజ్ఞ చేద్దామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. అందులో... దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. దీనిపై తగిన అవగాహన కల్పించేలా దినోత్సవం ఉందన్నారు. దివ్యాంగులు ప్రతిభను ప్రదర్శించేలా క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలను ప్రభుత్వం సన్మానిస్తోందని తెలిపారు. వారిని ప్రోత్సహించేలా రాష్ట్ర పురస్కారాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వారి నైపుణ్యానికి తగినట్టు వృత్తి శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు పెంచుతున్నట్లు తెలిపారు. దివ్యాంగులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.


రైటర్లకు సంక్షేమ నిధి

చెన్నై, న్యూస్‌టుడే: డాక్యుమెంట్‌ రైటర్ల సంక్షేమ ఫండ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రిజిస్ట్రేషన్లశాఖకు సంబంధించిన వీరు, వారి కుటుంబ సంక్షేమార్థం దీన్ని ఫండ్‌ను ఏర్పాటు చేశారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆ ఫండ్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించి ఇందులో సభ్యులుగా చేరినవారికి గుర్తింపు కార్డుల అందజేతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడుగురికి సభ్యత్వ కార్డులు అందించారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లశాఖ మంత్రి మూర్తి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శి జ్యోతి నిర్మలాస్వామి, రిజిస్ట్రేషన్లశాఖ ఛైర్మన్‌ శివన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: దేవాదాయశాఖ తరఫున మదురైలోని మీనాక్షి సుందరేశ్వర, ఇరుక్కన్‌కుడిలోని మారియమ్మన్‌, పణ్ణారిలోని పణ్ణారియమ్మన్‌, అళగర్‌ కోవిల్‌లోని కళ్లళగర్‌, శంకరన్‌కోవిల్‌లోని శంకరనారాయణస్వామి ఆలయాలలో ఆరోగ్య కేంద్రాలు నిర్మించారు. వాటిని సచివాలయం నుంచి శుక్రవారం వీసీ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభించారు. దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు తదితరులు పాల్గొన్నారు.


స్మారక మందిరం...

చెన్నై, న్యూస్‌టుడే: ప్రముఖ రచయిత దివంగత కి.రా అలియాస్‌ కి.రాజనారాయణన్‌కు ఆయన స్వగ్రామంలో నిర్మించిన స్మారక మందిరాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. తూత్తుకుడి జిల్లా ఇడైసేవల్‌ గ్రామానికి చెందిన ప్రసిద్ధ రచయిత కి.రాజనారాయణన్‌ గత ఏడాది మే 17న మరణించగా, విగ్రహంతో కూడిన స్మారక మందిరాన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు రూ.1.50 కోట్లతో నిర్మించారు.  


వీరమణికి జన్మదిన శుభాకాంక్షలు

చెన్నై, న్యూస్‌టుడే: ద్రావిడర్‌ కళగం అధ్యక్షుడు వీరమణికి స్టాలిన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని వీరమణి నివాసానికి శుక్రవారం వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. వెంట మంత్రులు దురైమురుగన్‌, పొన్ముడి, వేలు, ఎంపీ జగద్రక్షగన్‌, మురసొలి సెల్వం, ద్రావిడర్‌ కళగం ప్రధాన కార్యదర్శి అన్బురాజ్‌, వీరమణి సతీమణి మోహన తదితరులు ఉన్నారు.  

కి.రా స్మారక మందిరాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం    


మురళీధరన్‌ మృతికి సంతాపం

చెన్నై, న్యూస్‌టుడే: లక్ష్మీ మూవీ మేకర్స్‌ అధినేతల్లో ఒకరైన మురళీధరన్‌ మృతికి ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. ఆయన మరణించారన్న వార్త ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. వియవంతమైన చిత్రాలు నిర్మించి ప్రత్యేక గుర్తింపు పొదారని తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు అన్నారు. సమాచారశాఖ మంత్రి స్వామినాథన్‌ కూడా సంతాపం తెలిపారు.


రచయిత భేటీ

చెన్నై, న్యూస్‌టుడే: కువెంపు పురస్కారానికి ఎంపికైన రచయిత ఇమైయం శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. ఇమైయం వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.


అధికారులతో సమీక్ష

చెన్నై, న్యూస్‌టుడే: ‘ముదల్వరిన్‌ ముగవరి’కి అందిన వినతులపై తీసుకున్న చర్యల గురించి ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, పథకం ప్రత్యేక అధికారి శిల్పా ప్రభాకర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

చెన్నై, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని