logo

దివ్యాంగుల పింఛను పెంపు

దివ్యాంగుల పింఛన్‌ను రూ.1,500లకు పెంచుతున్నట్లు, జనవరి నుంచి ఈ మేరకు అందించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు.

Published : 04 Dec 2022 02:02 IST

ముఖ్యమంత్రి ప్రకటన

పురస్కారం అందజేస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: దివ్యాంగుల పింఛన్‌ను రూ.1,500లకు పెంచుతున్నట్లు, జనవరి నుంచి ఈ మేరకు అందించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. కలైవాణర్‌ అరంగంలో శనివారం జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. వారికి పలు సంక్షేమ పథకాల కింద సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పుట్టుకతో లోపం ఉన్నా, తర్వాత ఏర్పడినా బాధితులపై ప్రత్యేక దృష్టి అవసరమని తెలిపారు. అవయవాలలోనే లోపమని.. వారి తెలివి, సామర్థ్యంలో కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఆ మేరకు దివ్యాంగులను గౌరవించాలని పేర్కొన్నారు. అందరిలా అన్ని వసతులు, అవకాశాలను దివ్యాంగులు కూడా పొందాలని తెలిపారు. సముద్ర జలాల్లో దివ్యాంగులు కూడా కాళ్లు తడపాలనే ఉద్దేశంతో మెరినా తీరంలో మార్గం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రానికి చెందిన మారియప్పన్‌ తన అవయవలోపాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొని నేడు దేశానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. మదురైకు చెందిన బాడ్మింటన్‌ క్రీడాకారిణి జెర్లిన్‌ అనికా తన అత్యుత్తమ ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. శారీరక వైకల్యం ఏర్పడినా కుంగిపోకుండా అమర్‌సేవా సంఘం వ్యవస్థాపకుడు రామకృష్ణన్‌, శంకరరామన్‌ వంటివారు తమను సంరక్షించుకుంటేనే పలువురికి సేవలు అందించి జాతీయ పురస్కారాలు పొందారని పేర్కొన్నారు. దివ్యాంగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిపుణులు, ఉన్నతస్థాయి కమిటీలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంట్లో నుంచే వారు ఉద్యోగం చేసుకునే పరిస్థితిని కల్పించనున్నామని పేర్కొన్నారు. రెవెన్యూశాఖ తరఫున కంటిచూపులేని దివ్యాంగులు తదితర 4,39,315 మంది ప్రస్తుతం పొందుతున్న రూ.వెయ్యి పింఛన్‌ను రూ.1,500లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. జనవరి నుంచి ఇది అమలు చేస్తామన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.263.58 కోట్లు అదనంగా ఖర్చు కానుందని తెలిపారు.

సామాజిక కార్యకర్తలకు పురస్కారాలు

దివ్యాంగులకు ఉత్తమ సేవలు అందించిన వారికి ముఖ్యమంత్రి పురస్కారాలు అందించారు. ఆ మేరకు ఉత్తమ సామాజిక కార్యకర్తగా మయిలాడుతురై జిల్లాకు చెందిన జయంతి ఉదయకుమార్‌, ఉత్తమ సంస్థగా తిరుచ్చి జిల్లాకు చెందిన ఇన్‌టాక్ట్‌ ప్రత్యేక పాఠశాల ట్రస్టు, బుద్దిమాంధ్యులకు బోధించినందుకుగాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా తేని జిల్లాలోని లూసిక్రాసన్సియా ప్రత్యేక పాఠశాల, వృత్తిశిక్షణ కేంద్రానికి చెందిన కవిత, వినికిడిలోపం, దృష్టిలోపం ఉన్నవారికి బోధించినందుకు చెన్నైకు చెందిన ఉపాధ్యాయులు జేమ్స్‌ మార్గరెట్‌, ఉత్తమ సిబ్బందిగా సరస్వతి, అరివళగన్‌, బాలాజీ, సుందరం, నివేద, కలైవాణి, అన్నమేరి, బొమ్మనన్‌ తదితరులకు పురస్కారాలు అందించారు. వారికి 10 గ్రాముల బంగారం, ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోని విజేతలకు బహుమతులు అందించారు. ‘నాన్‌ ముదల్వన్‌’ పథకం కింద వంద మందికి ల్యాప్‌టాప్‌లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఐదుగురికి వాటిని అందించారు. ముందుగా కాంచీపురం, రాణిపేట, తిరుపత్తూరు, మయిలాడుతురై, తెన్కాశి, కళ్లకురిచ్చి తదితర ఆరు కొత్త జిల్లాలకు దివ్యాంగుల కోసం సంచార చికిత్సా వాహనాలను ప్రారంభించారు. ఊదా స్టాల్‌, ఆధునిక ఉపకరణాల ప్రదర్శనను కూడా ఆరంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, గీతాజీవన్‌, సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, గణేశన్‌, ఎమ్మెల్యే ఎళిలన్‌, దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి ఆనందకుమార్‌, కమిషనరు జెసిందా లారెన్స్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని