logo

‘ద్రావిడ సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం వీరమణి’

ద్రావిడ సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం ద్రావిడర్‌ కళం అధ్యక్షుడు వీరమణి అని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభివర్ణించారు.

Published : 04 Dec 2022 02:02 IST

స్టాలిన్‌తో అన్బళగన్‌ కుటుంబసభ్యులు

చెన్నై, న్యూస్‌టుడే: ద్రావిడ సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం ద్రావిడర్‌ కళం అధ్యక్షుడు వీరమణి అని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభివర్ణించారు. కలైవాణర్‌ అరంగంలో జరిగిన వీరమణి 90వ జన్మదిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... సామాజిక న్యాయం కోసం పెరియార్‌ అంతర్జాతీయ అమెరికా సంస్థ తరఫున ఈ ఏడాది వీరమణి పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వీరమణికి శతజన్మదిన వేడుకలూ నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఎండీఎంకే ప్రధాన కార్యదర్శియైన ఎంపీ వైగో, ఐయూఎంఎల్‌ అధ్యక్షుడు కేఎం ఖాదర్‌ మొహిదీన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌, ద్రావిడర్‌ కళగం ఉపాధ్యక్షుడు కలి పూంకుండ్రన్‌, కోశాధికారి కుమరేశన్‌, ప్రధాన కార్యదర్శి అన్బురాజ్‌, ఉప ప్రధానకార్యదర్శి ఇన్బకని, ద్రావిడ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రిన్స్‌ ఎన్నారెసు పెరియార్‌ తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకకు హాజరు

చెన్నై, న్యూస్‌టుడే: టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి మనవరాలు, ఎంపీ విష్ణుప్రసాద్‌ కుమార్తె ప్రతిక్ష-నవమణి రాజేంద్రన్‌ వివాహ నిశ్చితార్థ కార్యక్రమం నగరంలో జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి స్టాలిన్‌ పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించారు. వెంట మంత్రులు పొన్ముడి, శేఖర్‌బాబు, మస్తాన్‌, పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు, ఎంపీ అన్బుమణి ఉన్నారు.

ఫొటో జర్నలిస్ట్‌ మృతికి సంతాపం

చెన్నై: డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌ రాజేశ్‌ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్‌, సమాచారశాఖ మంత్రి స్వామినాథన్‌ సంతాపం ప్రకటించారు. మురసొలి దినపత్రికలో 28 ఏళ్లకుపైగా పనిచేసిన ఆయన అంకితభావం, నిరంతరశ్రమ కీర్తించదగిందని ముఖ్యమంత్రి తెలిపారు.  

అన్బళగన్‌ కుటుంబసభ్యుల భేటీ

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకే దివంగత ప్రధానకార్యదర్శి అన్బళగన్‌ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అన్బళగన్‌ శతజయంతి స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ కొనసాగుతున్న డీపీఐ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రాంగణాన్ని ‘పేరాసిరియర్‌ అన్బళగన్‌ కల్వి వళాగం’గా పిలవనున్నట్టు, ఉత్తమ పాఠశాలలకు ఆయన పేరిట పురస్కారాలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్బళగన్‌ కుమారుడు అన్బుసెల్వన్‌, మనవడు ఎంపీ వెట్రియళగన్‌ శనివారం క్యాంపుకార్యాలయంలో స్టాలిన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని