logo

వరద కష్టాల నుంచి ఊరటే లక్ష్యం

మండౌస్‌ తుపాను ప్రభావం చెన్నైపైనా ఉండొచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. దీనికి తగ్గట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ఏర్పాట్లు చేస్తోంది.

Published : 09 Dec 2022 00:58 IST

ఐఏఎస్‌ల బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఇటీవల వర్షాల సమయంలో సత్ఫలితాలు

అధికారుల బృందంతో మాట్లాడుతున్న సీఎస్‌ ఇరైయన్బు  

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ను వరద ముప్పు నుంచి తప్పించడంలో చాలావరకు ప్రభుత్వం విజయవంతమైంది. తొలి విడతలో భాగంగా చాలాచోట్ల వరదకాలువల నిర్మాణాల్ని చేపట్టారు. ఇటీవల వర్షాలకు వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఈ కాలువల కారణంగా ఊరట చెందారనే చెప్పాలి. ఇలా పనులు మరిన్ని ప్రాంతాలలో చేపట్టేందుకు కార్పొరేషన్‌ చర్యలు చేపడుతోంది. వరద కాలువల్ని ప్రణాళిక ప్రకారం నిర్మించడం, జోన్లలోని లోతట్టు ప్రాంతాలకు ముప్పును తప్పించడమే లక్ష్యంగా ఓ ప్రత్యేక ఐఏఎస్‌ల బృందం పనిచేస్తోంది. ఫలితాలు కూడా చక్కగా వస్తున్నాయి.

- ఈనాడు, చెన్నై

తుపాను హెచ్చరికల నేపథ్యంలో సహాయ చర్యల కోసం రిప్పన్‌ భవనంలో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1913
నెంబరులో సంప్రదించి సేవలు పొందొచ్చని ప్రకటించారు.

మండౌస్‌ తుపాను ప్రభావం చెన్నైపైనా ఉండొచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. దీనికి తగ్గట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ఏర్పాట్లు చేస్తోంది. లోతట్టు ప్రాంతాలకు ప్రత్యేక సహాయక బృందాల్ని పంపుతోంది. గాలుల ప్రభావానికి అవకాశముందని చెప్పడంతో.. ఎక్కడైనా చెట్లు లాంటివి పడిపోయినా వెంటనే తొలగించేందుకు ప్రత్యేక పరికరాలను సమకూర్చుకుంటున్నారు. గతంలో వర్షాల్లాగే ఈసారి తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా చెన్నైని వరద భయం వేధిస్తోంది. 2015, 2021 వరదలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. నీటివనరుల దగ్గరే నిర్మాణాలు పెరగడం, కాలువలున్నా డిజైన్లు సక్రమంగా లేకపోవడం, తీవ్రమైన లీకేజీలు, మురుగునీటి పారుదల వ్యవస్థలో లోపాలు, సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాలుగా ఉన్నాయి. లోపాల్ని విశ్లేషించి పరిష్కారాల్ని చూపించేందుకు జీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలువల నిర్మాణంలో సాంకేతికత అవసరం, పైగా ఇంజినీర్లే వాటికి సరైన రీతిలో పరిష్కారం చూపే అవకాశముంది. దీంతో ఇంజినీరింగ్‌ నేపథ్యమున్న ఐఏఎస్‌లనే ఓ బృందంగా నియమించారు. వీరిని నగరంలో రీజినల్‌ డిప్యూటీ కమిషనర్లుగా నియమించారు. ఎం.శివగురు ప్రభాకరన్‌, షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌, ఎం.పి.అమిత్‌ ఈ బృందంలో ఉన్నారు. వీరు జీసీసీ కమిషనర్‌ గగన్‌దీప్‌సింగ్‌ బేడీ ఆధ్వర్యంలో పనిచేశారు.

లోతైన అధ్యయనం తర్వాత...

నగరంలో వరద కాలువల నిర్మాణాలకు ముందు ఈ ముగ్గురు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించారు. జీసీసీ దగ్గర అందుబాటులో ఉన్న డాటా, తాము క్షేత్రస్థాయిలో తెలుసుకున్న విషయాల ఆధారంగా లోపాల్ని తెలుసుకున్నారు. తగిన రీతిలో కాలువలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. రాబోయే 30 ఏళ్లు వర్షాలకు తట్టుకునే సామర్థ్యమున్న కాలువల్ని డిజైన్‌ చేశారు. ఆ తర్వాతే నిర్మాణాల్ని చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు రోజులతరబడి నీరు నిలుస్తోంది. అక్కడ మోటార్లతోనే నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. దీనికోసం ఎక్కువ సామర్థ్యంతో కూడిన నాణ్యమైన విద్యుత్తు మోటార్లను వినియోగించారు. సజావుగా పనిచేశాయని, చాలావరకు ఇబ్బందుల్ని సకాలంలో దూరం చేశామని అధికారులు తెలిపారు. వీధులు, అంతర్గత రోడ్లు, జాతీయ రహదారుల్లో ఎక్కడా నీరు నిల్వఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రైవేటు ప్రాంతాల యజమానులను అప్రమత్తం చేసి వారే స్వయంగా నీటిని తోడించేందుకు ఏర్పాట్లు చేసుకునేలా  చూస్తున్నారు.

కాశిమేడు హార్బరులో గురువారం సాయంత్రం అలల ఉద్ధృతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని