logo

అన్ని విధాలా సిద్ధంగా ఉండండి

తుపాను, భారీవర్షాల నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రధానకార్యదర్శి ఇరైయన్బు ఆదేశాలిచ్చారు.

Published : 09 Dec 2022 00:58 IST

తుపాను నేపథ్యంలో సీఎస్‌ ఆదేశాలు

సమీక్ష నిర్వహిస్తున్న ఇరైయన్బు

చెన్నై, న్యూస్‌టుడే: తుపాను, భారీవర్షాల నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రధానకార్యదర్శి ఇరైయన్బు ఆదేశాలిచ్చారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 11వ తేదీ వరకు భారీ, అతిభారీ వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సముద్రతీర ప్రాంతాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు తుపాను హెచ్చరికలు జారీ చేయాలన్నారు. కామన్‌ అలర్ట్‌ ప్రొటోకాల్‌, టీఎన్‌స్మార్ట్‌ యాప్‌, సామాజిక మాధ్యమాల ద్వారా తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందుగానే అవసరమైన బోట్లు, ఉపకరణాలను ఉంచాలని పేర్కొన్నారు. జాలర్లు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, బలమైన గాలులతో కూలే వృక్షాలను వెనువెంటనే తొలగించాలని పేర్కొన్నారు. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వ ఉంచాలని, దెబ్బతినే కనెక్షన్ల పునరుద్ధరణకు బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక బస్తాలు, అవసరమైన మందులను నిల్వ ఉంచాలని సూచించారు. ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సహాయక శిబిరాలకు తరలించాలని పేర్కొన్నారు. అవసరమైన ఆహారం, రక్షిత నీరు, మందులు తదితర వసతులు కల్పించాలని తెలిపారు. జలాశయాల పరిస్థితిపై నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు జలాల విడుదలప్పుడు ప్రజలకు తగిన హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి సేవలు అందించడానికి రహదారులు, జలవనరులు, విద్యున్మండలి, అగ్నిమాపక తదితర శాఖలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని