logo

అన్నా గ్రంథాలయంలో సాహితీ వేడుకలకు ఏర్పాట్లు

కొట్టూరుపురంలోని ‘అన్నా లైబ్రరీ’ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారనుంది. జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వం ‘చెన్నై లిటరరీ ఫెస్టివల్‌’ను నిర్వహించాలనే ఆలోచనలో ఉంది.

Published : 09 Dec 2022 00:58 IST

గ్రంథాలయం లోపలిభాగం

వడపళని, ప్యారీస్‌, న్యూస్‌టుడే: కొట్టూరుపురంలోని ‘అన్నా లైబ్రరీ’ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారనుంది. జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వం ‘చెన్నై లిటరరీ ఫెస్టివల్‌’ను నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఈ వేడుకలకు వంద మంది రచయితలు, సాహితీవేత్తలు హాజరుకానున్నారు. పుస్తకాలపై సమీక్ష, చిన్నారుల సాహిత్యం, కథలు చెప్పడంపై చర్చలు జరుగుతాయని పబ్లిక్‌ లైబ్రరీ డైరెక్టర్‌ కె.ఇలంబవహత్‌ పేర్కొన్నారు. చెన్నై పుస్తక ప్రదర్శనలో ఫొటోగ్రఫీ, చిత్రలేఖనంపై ప్రదర్శనతో పాటు కొత్త పుస్తకాలను ఆవిష్కరిస్తారు. సాహిత్యంపై అభిరుచి ఉన్న కళాశాల విద్యార్థులను కూడా వేడుకలకు ఆహ్వానించేందుకు ఆలోచిస్తున్నామని ఇలంబవహత్‌ అన్నారు. ఆడిటోరియం, కాన్ఫరెన్స్‌ హాలు, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి హాలు మరమ్మతులు పూర్తి చేశాక మొదటిసారి జరుగుతున్న పెద్ద కార్యక్రమమని ఆయన చెప్పారు. రూ.38 కోట్లతో నూతన మరుగుదొడ్లు, నేల మరమ్మతులు, ఆధునిక సాంకేతికతతో కూడిన ఆడియో విధానం, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి తగిన విధంగా హాలు నిర్మాణాలు జరిగాయి. కార్యక్రమాలు నిర్వహించేందుకు రాయితీతో కూడిన అద్దె వసూలు చేస్తారు. ‘టీఎన్‌ టాక్‌’ అనే అంశంపై 13వ తేదీ సీనియర్‌ పాత్రికేయుడు పి.సాయినాథ్‌ ప్రసంగిస్తారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా జురాసిక్‌ పార్కు, నయాగరా జలపాతం వంటివి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 1400 మంది కూర్చునే వీలు, 417 కార్లు, 1026 ద్విచక్ర వాహనాలు పార్కు చేసుకునే వసతి వంటివి ఉన్నాయి. గ్రౌండు ఫ్లోరులో బ్రెయిలీ లిపి సెక్షను, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు చదువుకునేందుకు, మొదటి అంతస్తులో వార, పక్ష, మాస పత్రికలు, చిన్నారుల సెక్షను, రెండో అంతస్తులో తమిళ పుస్తకాలు, పుస్తకావిష్కరణకు హాలు, మూడో అంతస్తులో కంప్యూటర్‌ సైన్సు, సోషల్‌ సైన్సుకు సంబంధించిన పుస్తకాలు, నాలుగో అంతస్తులో ఇంగ్లిషు, ఎకనమిక్స్‌, లా (న్యాయశాస్త్రం) పుస్తకాలు, అయిదో అంతస్తులో సైన్సు, వైద్య శాస్త్రానికి సంబంధించినవి, ఆరో అంతస్తులో ఇంజినీరింగు, ఫైనార్ట్స్‌, ఏడో అంతస్తులో ప్రభుత్వానికి చెందిన ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌, చరిత్ర, భౌగోళం, ఇ-లైబ్రరీ, ఎనిమిదో అంతస్తులో పరిపాలన కార్యాలయం, కల్వి టీవీ స్టూడియోలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని