logo

Panneerselvam: మళ్లీ రేసులోకి ఓపీఎస్.. అన్నాడీఎంకేలో అదే గందరగోళం

అన్నాడీఎంకే ఏక నాయకత్వ సమస్య మొదలైనప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో సర్వసభ్య సమావేశంలో ఓపీఎస్‌, అతని మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించారు.

Updated : 14 Dec 2022 09:00 IST

భాజపాపై ఎడప్పాడి ఒత్తిడి?

జేపీ నడ్డాతో ముచ్చటిస్తున్న పన్నీర్‌సెల్వం

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ఏక నాయకత్వ సమస్య మొదలైనప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో సర్వసభ్య సమావేశంలో ఓపీఎస్‌, అతని మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించారు. అదేవిధంగా ఎడప్పాడి పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అయితే అప్పటి నుంచీ పార్టీలో ఇప్పటికీ తానే సమన్వయకర్తనని చెబుతూ వస్తున్నారు పన్నీర్‌. ఇదిలా ఉండగా సర్వసభ్య సమావేశం కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కోర్టు తీర్పు సంగతి ఎలా ఉన్నా భాజపా పెద్దల మద్దతు కూడగట్టేందుకు ఓపీఎస్‌, ఈపీఎస్‌లు పోటాపోటీగా యత్నిస్తున్నారు. అయితే భాజపా పెద్దల మద్దతు పన్నీర్‌కే అన్న అభిప్రాయం రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచే ఉంది. అయితే నిజానికి అన్నాడీఎంకేలో ఓపీఎస్‌, ఈపీఎస్‌లు వర్గాలుగా విడిపోయిన తర్వాత ఇద్దరిని సమానంగానే భాజపా చూస్తూ వస్తోంది. అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు, నిర్వాహకులు ఎక్కువ శాతం మంది తనవైపే ఉన్నారని, ఆ ప్రకారమే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను ఎంచుకున్నారని పళనిస్వామి చెబుతున్నారు. దీంతో తనకు సరిసమానంగా ఓపీఎస్‌కు భాజపా ప్రాముఖ్యత ఇవ్వటం ఎడప్పాడికి రుచించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన జీ-20 సదస్సు సంప్రదింపుల సమావేశానికి ప్రధాన కార్యదర్శి అని పేర్కొంటూ పళనిస్వామికి ఆహ్వానం అందడంతో భాజపా అధిష్ఠానం ఈపీఎస్‌ వైపు మొగ్గు చూపుతోందని వార్తలు వచ్చాయి. ఈ ఆహ్వానంతో ఎడప్పాడి వర్గంలో ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో ఆ కార్యక్రమానికి ఓపీఎస్‌ను ఆహ్వానించకపోవడంతో ఆయన వర్గం నీరసించింది. దీని గురించి కేంద్రానికి పన్నీర్‌ లేఖ కూడా రాయటం గమనార్హం.

గుజరాత్‌ వెళ్లిన పన్నీర్‌

ఇదిలా ఉండగా సోమవారం గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా భాజపా అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయన తనయుడు, అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్‌కుమార్‌, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్‌, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌, పుదియనీతి కట్చి అధ్యక్షుడు ఏసీ షణ్ముగం తదితరులు వెంట ఉన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డాతో కొంతసేపు మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటన ఈపీఎస్‌ వర్గానికి మింగుడు పడటం లేదు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈపీఎస్‌కు ఎడప్పాడికి ఆహ్వానం అందినా అతను పాల్గొనకపోవటం గమనార్హం. దీని గురించి పళనిస్వామి వర్గ నేతల సమాచారం ప్రకారం.. కార్యక్రమానికి ఓపీఎస్‌ను కూడా తనకు సరిసమానంగా ఆహ్వానించడంతో అసంతృప్తికి లోనైనట్లు తెలిపారు. దీనికి సంబంధించి పళనిస్వామి గుజరాత్‌ ముఖ్యమంత్రికి పంపిన శుభాకాంక్షల లేఖలో.. ముందే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమయం కేటాయించినందున ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోతున్నానని తెలిపారు. నిజానికి సోమవారం ఎడప్పాడికి చెప్పుకోదగ్గ కార్యక్రమాలేవీ లేకపోవడం గమనార్హం.

పళనిస్వామి కోపం అందుకే..

దీంతో భాజపా చర్యలకు ప్రతిచర్యలుగా పళనిస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని తెలుస్తోంది. దీనికి కారణం భాజపా పెద్దలు ఈపీఎస్‌ను కలిసి మాట్లాడేందుకు ఆసక్తి కనబరచకపోవటమేనని సమాచారం. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీడ్కోలు పార్టీలో ఎడప్పాడి పాల్గొన్నప్పుడు మోదీ, అమిత్‌షాలు మాట్లాడేందుకు సమయం కేటాయించలేదు. అలాగే మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఈపీఎస్‌ కలిసేందుకు సమయం ఇవ్వలేదు. ప్రధానికి స్వాగతం పలికే సమయంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌లను పిలిచి ఒక్కచోట నిలబెట్టి స్వాగతం స్వీకరించారు. ఇది కూడా ఎడప్పాడి వర్గానికి అసంతృప్తిని కలిగించింది. దీంతో కోపానికి గురైన ఎడప్పాడి అమిత్‌షా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చినప్పుడు హాజరవలేదు. భాజపా నేతలు వచ్చినప్పుడల్లా కలవాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అన్నాడీఎంకే నేతృత్వంలో మెగా కూటమి అని ప్రకటించారు. దీన్ని భాజపా పెద్దలు ఎలా తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల జీ-20 సదస్సు ఆలోచన సమావేశానికి ఎడప్పాడి పళనిస్వామిని ఆహ్వానించటంతో భాజపా ఈపీఎస్‌ వైపు మొగ్గు చూపుతుందనే వార్తలు వచ్చాయి. సమావేశంలో పాల్గొన్న పళనిస్వామికి ప్రధాని మోదీ, అమిత్‌షాలు ప్రత్యేకంగా కలిసేందుకు సమయం కేటాయించకపోవటం గమనార్హం. దీంతో ఓపీఎస్‌తో సంబంధాలు పెట్టుకుంటే తమతో సంబంధాలు కుదరవని ఓ భాజపా సీనియర్‌ నేతతో ఎడప్పాడి తెగేసి చెప్పి చెన్నైకి తిరిగి వచ్చినట్లు సమాచారం.

ఎడప్పాడి పళనిస్వామి

అంతుచిక్కని భాజపా వైఖరి

ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఓపీఎస్‌ పాల్గొన్నారు. అప్పుడు భాజపా అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆ ఫొటోలను చూస్తుంటే వారి మధ్య భేటీ సజావుగా సాగినట్లు తెలుస్తోంది. దీంతో ఎడప్పాడి వర్గం మరింత అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓపీఎస్‌, భాజపా నేతల భేటీ తర్వాత త్వరలో అన్నాడీఎంకేకు సంబంధించి ముఖ్య ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏదేమైనా భాజపా పెద్దల మద్దతు ఓపీఎస్‌కా, ఈపీఎస్‌కా అనే గందరగోళం కొనసాగుతోంది. దీంతో మున్ముందు అన్నాడీఎంకే వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో, ఎన్నికల కమిషన్‌ తుది నిర్ణయం ఏంటి అనే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని