logo

వంటలు తెచ్చిన వెలుగు!

హిజ్రాలు మునుపుటిలా కాదు. వారి జీవితాలు నెమ్మదిగా వెలుగు దిశగా పయనిస్తున్నాయి. అన్ని రంగాల్లోకీ వస్తున్నారు. ఇప్పుడు రుచికర వంటకాలు చేసిపెట్టే  రంగంలోకీ వచ్చారు.  

Published : 21 Jan 2023 01:43 IST

హిజ్రాల జీవితాల్లో కొత్త ఆశలు

వారి నిర్వహణలో చెన్నైలో రెస్టారెంట్

శిక్షణ పొందిన బృందం

హిజ్రాలు మునుపుటిలా కాదు. వారి జీవితాలు నెమ్మదిగా వెలుగు దిశగా పయనిస్తున్నాయి. అన్ని రంగాల్లోకీ వస్తున్నారు. ఇప్పుడు రుచికర వంటకాలు చేసిపెట్టే  రంగంలోకీ వచ్చారు.  హిజ్రాలతోనే నడిచే చెన్నైలోని తొలి రెస్టారెంట్ ‘చెన్నై ట్రాన్స్‌ కిచెన్‌’ తాజాగా ప్రారంభమైంది. వారి వంటకాలు  ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

రాష్ట్రంలో మూడో ట్రాన్స్‌ రెస్టారెంట్ను తాజాగా చెన్నైలోనూ ఏర్పాటు చేశారు. ఇదివరకు కోయంబత్తూరు, మదురైలో ప్రారంభించారు. చెన్నైలో మాత్రం ఇదే మొదటిది. కొలత్తూరు జీకేఎం కాలనీ, 25వ వీధిలో పది మంది హిజ్రాలు ఏకమై రుచుల వేదికను తెరిచారు. దక్షిణాది, శాకాహార, మాంసాహార, చైనీస్‌ వంటకాలతోనూ ఆకట్టుకుంటున్నారు. యునైటెడ్‌ వే ఆఫ్‌ చెన్నై, స్వస్తి స్వచ్ఛంద సంస్థలు వీరికి తోడ్పాటు అందిస్తున్నాయి. హిజ్రాల హక్కుల సంఘం వెన్నుదన్నుగా నిలవడంతో ఓ బ్యాంకు వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతో రెస్టారెంట్ పెట్టేందుకు ఆర్థిక సాయం అందించారు. అందరి సహకారంతో హిజ్రాలు ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి.

తమ జీవితాల్ని మార్చుకోవాలనే ఆసక్తి హిజ్రాల్లో పెరిగింది. కేవలం వారితోనే రెస్టారెంట్ పెడుతున్నామని తెలిసినప్పుడు.. 80 మంది ముందుకొచ్చారు. వారి నుంచి స్వచ్ఛంద సంస్థలు పది మందిని ఎంపికచేశాయి. ఇందులో హిజ్రాలుగా మారిన ఆడవారు, మగవారు ఇరువురూ ఉన్నారు. మూడు నెలల ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వంటల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆత్మవిశ్వాసం పెరిగింది. వారిపై మంచి ఉద్దేశం పెంచేందుకు ఈ రెస్టారెంట్ను చక్కటి అవకాశంగా తీసుకుని ముందుకెళ్తున్నారు.

ఆదాయం మెరుగు

గతంలో ఉపాధి, సరైన గౌరవం లేదు. జీవితమంటే రోడ్లపైనే అన్నట్టు ఉండేది. అలాంటివారు ఇప్పుడు రెస్టారెంట్ నడుపుతున్నారు. రుచికర వంటకాలు వండుతూ, చకచకా సరఫరా చేస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు. ఎందురికో హిజ్రాలకు వీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒక్కొక్కరూ నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పొందనున్నారు. నగరంలో ఇలాంటి వాటిని మరికొన్ని తెరవాలనే ఆలోచనలో సంస్థ ప్రతినిధులున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇలాంటి ఓ రెస్టారెంట్ నిర్వహించేందుకు ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు.

కన్నీళ్ల నుంచి బయటకు..

ఈ రెస్టారెంట్లో కీలకపాత్ర పోషిస్తున్న సంజన గాథ వింటే చాలా బాధకు గురిచేస్తుంది. చిన్నతనం నుంచి చెన్నైతోపాటు ముంబయి, పుణె వీధుల్లో తిరిగారు. యాచక వృత్తిలోనూ ఉన్నారు. అన్నేళ్లు ఎలా బతికానో కూడా తలచుకుంటే భయంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు గౌరవప్రదంగా జీవనం సాగిస్తున్నారు. వంట మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బిర్యానీ చేయడంలో దిట్ట. హిజ్రాల హక్కుల సంఘం తనని అక్కున చేర్చుకుందని, అందువల్లే తనకిది సాధ్యమైందని చెప్పారు. మరో హిజ్రా పేరు.. దయ. పెద్దగా చదువుకోలేదు. ఇప్పుడు రెస్టారెంట్‌లో చేరారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ.  

మరింత అవగాహన

హిజ్రాల హక్కుల సంఘం అధ్యక్షులు ఆర్‌.జీవా మాట్లాడుతూ.. ‘హిజ్రాలు అన్నిరంగాల్లోనూ స్ఫూర్తినిస్తూ వెళ్తున్నారు.  చెన్నై ట్రాన్స్‌ కిచెన్‌ ద్వారా వారి ప్రతిభ బయటికి వస్తోంది. ఉపాధి పెరుగుతోంది. యాచక వృత్తి, వ్యభిచారం నుంచి చాలామందిని వివిధ రంగాల్లోకి తీసుకురావాలనేది మా సంకల్పం. ఇందులో భాగంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. తమ సంఘంలో ఇప్పుడు 400 మంది హిజ్రాలున్నారని, వారందరికీ ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సమాజంతో కలిసి..

సామాజిక దురాలోచల్ని దూరం చేసి వారిని కూడా సమాజంలోకి సమాన స్థాయిలో బతికేలా చేయడానికి ఈ రెస్టారెంట్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని స్వస్తి ఎన్జీవో ప్రతినిధులు తెలిపారు. ప్రయత్నం చేస్తే ఈ సామాజిక వర్గానికి కూడా ఉపాధికి కొదవలేదని చెప్పడానికి స్ఫూర్తిగా చూపెడుతున్నామని అన్నారు. అంతకుముందు కమ్యూనిటీ కిచెన్‌ పేరుతో  కరోనా సమయంలో హిజ్రాలు స్వయంగా వంటలు చేసి ఎంతోమందికి ఉచితంగా ఆహారాన్ని అందించారు. నగరవాసుల మన్ననలు పొందారు. ఇప్పుడూ అలాంటి మార్గంలోనే నడుస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని