logo

వందే భారత్‌ బోగీల తయారీకి సన్నద్ధం

ఎనిమిది బోగీలతో కూడిన వందే భారత్‌ రైలును త్వరలో ‘ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ’ (ఐసీఎఫ్‌) తయారు చేయనుంది.

Published : 22 Jan 2023 00:23 IST

వడపళని, న్యూస్‌టుడే: ఎనిమిది బోగీలతో కూడిన వందే భారత్‌ రైలును త్వరలో ‘ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ’ (ఐసీఎఫ్‌) తయారు చేయనుంది. కొద్ది పాటి దూరానికి సెమీ హైస్పీడుతో కూడిన రైలును ప్రవేశ పెట్టేందుకు రైల్వే శాఖ ఆలోచిస్తోంది. ప్రధాన నగరాల నుంచి చిన్నపాటి నగరాలకు, రద్దీ లేని ప్రాంతాలలో తిరిగేందుకు వీలుగా ఎనిమిది బోగీల రైలును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రమేపీ బోగీల సంఖ్యను 16 వరకు పెంచనున్నారు. కోయంబత్తూరు, మదురైలాంటి 2 టైర్‌ నగరాలతో పాటు కొద్దిపాటి దూరంలో ఉన్న ఊర్లకు కూడా బోగీల సంఖ్యను మున్ముందు పెంచనున్నారు. రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్డీఎస్‌ఓ), ఐసీఎఫ్‌లకు చిన్న దూరానికి తగిన విధంగా బోగీలను తయారు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. త్వరలోనే డిజైన్‌ను నిర్ణయించి, ప్రయోగాత్మకంగా బోగీ కూడా నిర్మాణం జరుగుతుందని అధికారి ఒకరన్నారు.

మెట్రో భూగర్భ పనులు త్వరలో

నగరంలో మెట్రో రెండో దశలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చైనా నుంచి ‘టన్నల్‌ బోరింగ్‌ మిషన్స్‌’ (టీబీఎం)లు దిగుమతి అయిన అనంతరం గత ఏడాది మాధవరంలో భూగర్భ స్టేషన్లకు సీఎంఆర్‌ఎల్‌ పనులు ప్రారంభించింది. మరో రెండు టీబీఎం యంత్రాలతో ఈ నెలలో అయనావరం ప్రాంతంలో భూగర్భ పనులు ప్రారంభించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 30 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టనున్నారు. మార్చి నెలాఖరు నాటికి మరో మూడు యంత్రాలను తీసుకొచ్చి మాధవరం, అయనావరం ప్రాంతంలో పనులకు వినియోగించనున్నామని చెప్పారు. మాధవరం మిల్క్‌ కాలనీ నుంచి కెల్లీస్‌ వరకు నిర్మాణం జరగనున్న మార్గంలో అయనావరం, మాధవరం స్టేషన్లు రానున్నాయి. తొమ్మిది కి.మీ దూరానికి రెండు సొరంగ మార్గాల కోసం ఏడు యంత్రాలతో పనులు జరుగుతాయని సీఎంఆర్‌ఎల్‌ అధికారులు తెలిపారు. మాధవరం మిల్క్‌ కాలనీ నుంచి సిరుసేరి సిప్కాట్‌ వరకు మెట్రో రెండో దశ, మూడో మార్గంలో 45.8 కి.మీ దూరంలో ఈ మార్గం అందుబాటులోకి రానుంది. మాధవరం మిల్క్‌ కాలనీ నుంచి కెల్లీస్‌ వరకు భవనాల తీరు తెన్నులపై చేపట్టిన అధ్యయనాల్లో  207 వాణిజ్య, గృహ సముదాయాలకు సమస్యలేర్పడే అవకాశాలున్నాయి. పనులు త్వరగా, భద్రతతో నిర్వహించేందుకు జర్మనీలో తయారైన ట్రెంచ్‌ కటర్స్‌ను మొదటిసారి వినియోగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని